Share News

వర్షపు నీటిని ఒడిసిపట్టారు!

ABN , Publish Date - Nov 15 , 2025 | 01:15 AM

వర్షపు నీరు వృథా కాకుండా ఒడిసిపట్టి.. భూగర్భంలోకి ఇంకించి జల సంరక్షణలో పీసీపల్లి మండలంలోని మురుగుమ్మి గ్రామం ఆదర్శంగా నిలిచింది. 6వ జాతీయ ఉత్తమ జల పంచాయతీ అవార్డుకు ఎంపికైంది. ఈనెల 18న ఈ అవా ర్డును నీటి యాజమాన్య సంస్థ ఉన్నతాధికారులు రాష్ట్రపతి ద్రౌపదిముర్ము చేతుల మీదుగా ఢిల్లీలో అందుకోనున్నారు.

వర్షపు నీటిని ఒడిసిపట్టారు!
నీటి కుంటలో నిలిచిన నీరు

సమగ్రంగా జల సంరక్షణ

మెరుగైన నీటి యాజమాన్య పద్ధతులు

ఆదర్శంగా నిలిచిన మురుగుమ్మి

జాతీయ ఉత్తమ జల పంచాయతీ అవార్డుకు ఎంపిక

పీసీపల్లి, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): వర్షపు నీరు వృథా కాకుండా ఒడిసిపట్టి.. భూగర్భంలోకి ఇంకించి జల సంరక్షణలో పీసీపల్లి మండలంలోని మురుగుమ్మి గ్రామం ఆదర్శంగా నిలిచింది. 6వ జాతీయ ఉత్తమ జల పంచాయతీ అవార్డుకు ఎంపికైంది. ఈనెల 18న ఈ అవా ర్డును నీటి యాజమాన్య సంస్థ ఉన్నతాధికారులు రాష్ట్రపతి ద్రౌపదిముర్ము చేతుల మీదుగా ఢిల్లీలో అందుకోనున్నారు. మురుగుమ్మి ప్రజలకు వ్యవసాయమే జీవనాధారం. ఈ పంచాయతీలో 381కుటుంబాలు, 1,850మంది జనాభా ఉన్నారు. ఇక్కడ జల సంరక్షణలో భాగంగా సుమారు కోటి రూపాయల వ్యయంతో 47కు పైగా పనులు చేపట్టారు. నీటి కుంటలు, ఊట కుంటలు, చెక్‌డ్యాంలు నిర్మించారు. వర్షపునీరు చెక్‌డ్యాంలు, ఊట కుంటలు, నీటి కుంటలలోకి చేరుతోంది. దీంతో ఆ గ్రామ పరిసరాల్లో ఉన్న వ్యవసాయ బోర్లు, చేతిపంపులు, భూగర్భ జలాల నీటిమట్టం అమాంతం పెరిగింది. దీంతో రైతులు వరి, శనగ, పొగాకు వంటి పంటలను విస్తారంగా సాగుచేశారు. ఇటీవల ఆగ్రామంలో పర్యటించిన అధికారుల బృందం నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన జల సంరక్షణ పనులను పరిశీలించి జాతీయ పురస్కారానికి ఎంపిక చేసింది.

నాడు బీళ్లు.. నేడు సాగు భూములు

పెద్దిరెడ్డి వెంకట్రావు, రైతు, మురుగుమ్మి

మా గ్రామ ప్రజలకు వ్యవసాయమే జీవనాధారం. కొందరు పంటలు సాగుచేస్తే, మరికొందరు వ్యవసాయ కూలి పనులకు వెళ్లేవారు. ఈప్రాంతంలో గతంలో సరైన జల సంరక్షణ పనులు చేపట్టకపోవడంతో వ్యవసాయ బోర్లన్నీ ఎండిపోయేవి. దీంతో పంటలు పండక వ్యవసాయ భూములు బీళ్లుగా మారాయి. గత రెండేళ్ల నుంచి నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో నీటికుంటలు, ఊటకుంటలు, చెక్‌డ్యాంలు నిర్మించారు. ఫలితంగా ఈ ఏడాది కురిసిన వర్షాలతో అవన్నీ నిండి నిండుకుండలా దర్శనమిస్తున్నాయి. దీంతో భూగర్భ జల మట్టం పెరిగింది. నాడు బీళ్లుగా ఉన్న భూములు ఇప్పుడు పంట పొలాలుగా మారాయి.

Updated Date - Nov 15 , 2025 | 01:15 AM