Share News

వారంలో ఒక్కరోజు కూడా చెత్త తీయరు మేడం..!

ABN , Publish Date - Jul 24 , 2025 | 01:06 AM

ఒకరోజు కాదు.. రెండు రోజులు కాదు మేడం.. వారం రోజులకు ఒకసారి కూడా చెత్త తీయడం లేదు. ఇళ్లలోది తీసుకెళ్లరు.. కాలువల్లో మురుగు తొలగించరు! అడిగితేపట్టించుకోరు. ఎన్నిసార్లు చెప్పినా నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారు. నాలుగు నెలల నుంచి పారిశుధ్యం గురించి పట్టించుకున్నవారే లేరు’ అని పలువురు నగరవాసులు కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియాకు ఫిర్యాదు చేశారు.

వారంలో ఒక్కరోజు కూడా చెత్త తీయరు మేడం..!
ఒంగోలులోని కోటవీధిలో మహిళతో మాట్లాడుతున్న కలెక్టర్‌ అన్సారియా

కలెక్టర్‌కు ప్రజల ఫిర్యాదు

నగరంలో అన్సారియా ఆకస్మిక పరిశీలన

పారిశుధ్యం అధ్వానంపై అధికారులపై ఆగ్రహం

ఒంగోలు కార్పొరేషన్‌, జూలై 23 (ఆంధ్రజ్యోతి): ‘ఒకరోజు కాదు.. రెండు రోజులు కాదు మేడం.. వారం రోజులకు ఒకసారి కూడా చెత్త తీయడం లేదు. ఇళ్లలోది తీసుకెళ్లరు.. కాలువల్లో మురుగు తొలగించరు! అడిగితేపట్టించుకోరు. ఎన్నిసార్లు చెప్పినా నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారు. నాలుగు నెలల నుంచి పారిశుధ్యం గురించి పట్టించుకున్నవారే లేరు’ అని పలువురు నగరవాసులు కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియాకు ఫిర్యాదు చేశారు. బుధవారం నగరంలోని పలు ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణ తీరును కలెక్టర్‌ ఆకస్మికంగా పరిశీలించారు. శానిటేషన్‌ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంగోలు నగరంలో కలెక్టర్‌ బుధవారం తెల్లవారుజామున ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కోట వీధి, బలరాం కాలనీ, మిలటరీ కాలనీ, దిబ్బల రోడ్‌ తదితర ప్రాంతాల్లో తిరిగారు. ఈ సందర్భంగా పారిశుధ్యం ఎలా ఉంది అని స్థానికులను అడిగి తెలుసుకున్నారు. నీసం వారానికి ఒకరోజు కూడా ఇళ్లలో చెత్త తీసుకెళ్లడం లేదని, కాలువలు బాగుచేయడం లేదని కలెక్టర్‌కు వారు ఫిర్యాదు చేశారు. దీంతో శానిటేషన్‌ అధికారులను కలెక్టర్‌ ప్రశ్నించగా, కార్మికులు సమ్మెలో ఉన్నారనే సమాఽధానం రావడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. సమ్మె ఈ పదిరోజులే కదా.. ఐదారు నెలల నుంచి చెత్త తీయడం లేదని ప్రజలు చెబుతున్నారని ప్రశ్నించారు. హెల్త్‌ ఆఫీసర్‌ ఏమి చేస్తున్నారు. శానిటరీ సూపర్‌వైజర్లు, ఇన్‌స్పెక్టర్లు, శానిటరీ సెక్రటరీలు ఏమి చేస్తున్నారంటూ మండిపడ్డారు. పనితీరు మార్చుకోవాలని హెచ్చరించారు.

సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి

వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా పారిశుధ్య పనులు సక్రమంగా నిర్వర్తించాలని కార్పొరేషన్‌ అధికారులను కలెక్టర్‌ అన్సారియా ఆదేశించారు. పారిశుధ్యం మెరుగునకు డివిజన్‌ల వారీగా ప్రణాళిక రూపొందించాలని కమిషనర్‌ వెంకటేశ్వరరావుకు సూచించారు. ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ముఖ్యంగా సీజనల్‌ వ్యాధులైన డెంగ్యూ, మలేరియా, గున్యా వంటివి రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆమె వెంట డీఎంహెచ్‌వో టి.వెంకటేశ్వర్లు, మునిసిపల్‌ హెల్త్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ వైష్ణవి పాల్గొన్నారు.

Updated Date - Jul 24 , 2025 | 01:06 AM