Share News

భారీగా వచ్చాయ్‌

ABN , Publish Date - Dec 24 , 2025 | 11:05 PM

జిల్లాలో పంచాయతీల విభజనకు భారీగా ప్రతిపాదనలు అందాయి. ప్రభుత్వం ఇచ్చిన గడువు ముగియడంతో పంచాయతీల విభజన కోసం వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అందుకోసం ముగ్గురు అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి పంచాయతీల విభజనకు వచ్చిన ప్రతిపాదనలను పరిశీలన చేపట్టారు.

భారీగా వచ్చాయ్‌
పంచాయతీల విభజన ప్రతిపాదనలు పరిశీలన చేస్తున్న అధికారులు

జిల్లావ్యాప్తంగా కొత్త పంచాయతీలకు 79 ప్రతిపాదనలు

పరిశీలించేందుకు కమిటీ ఏర్పాటు

రేపు కలెక్టర్‌తో ఆమోదం పొందాక

విజయవాడకు ప్రతిపాదనలు

ఒంగోలు కలెక్టరేట్‌, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో పంచాయతీల విభజనకు భారీగా ప్రతిపాదనలు అందాయి. ప్రభుత్వం ఇచ్చిన గడువు ముగియడంతో పంచాయతీల విభజన కోసం వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అందుకోసం ముగ్గురు అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి పంచాయతీల విభజనకు వచ్చిన ప్రతిపాదనలను పరిశీలన చేపట్టారు. ఆ ప్రతిపాదనలను ఈనెల 26వతేదీలోపు పంపాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేయడంతో తదనుగుణంగా చర్యలు చేపట్టారు. జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్ల పరిధిలో 729 గ్రామపంచాయతీలు ఉన్నాయి. జిల్లాలోని అనేక గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న గ్రామాలు ప్రస్తుతం విభజన చేయాలని ప్రతిపాదనలు చేసుకున్నారు. అలా జిల్లావ్యాప్తంగా 27 మండలాల నుంచి 79 ప్రతిపాదనలు అందాయి. ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ప్రతిపాదనలు పంచాయతీ అధికారులకు ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న జనాభా, విభజన చేసే పంచాయతీలో ఎంతమంది జనాభా ఉంటారు, ఆ గ్రామ సర్వే నెంబర్లు, తీర్మానాలు తదితర వివరాలతో ప్రతిపాదనలు చేసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయడంతో తదనుగుణంగా జిల్లా పంచాయతీ కార్యాలయంలో ఆ ప్రతిపాదనలను స్వీకరించారు.


కలెక్టర్‌ ఆమోదం తర్వాత పైకి..

ప్రతిపాదనల స్వీకరణ గడువు ముగియడంతో బుధవారం సాయంత్రం నుంచి డీపీవో ఎం.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఆ ప్రతిపాదనలను పరిశీలన (స్ర్కూట్నీ) చేసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో ఒంగోలు, మార్కాపురం డివిజనల్‌ పంచాయతీ అధికారులతోపాటు స్వామిత్వ డెవల్‌పమెంట్‌ ఆఫీసర్‌ను నియమించారు. ఈ కమిటీ పూర్తి స్థాయిలో ప్రతిపాదనలు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఉన్నాయా, లేవా అని పరిశీలించాల్సి ఉంది. అనంతరం ఆ ప్రతిపాదనలను డీపీవో వెంకటేశ్వరరావు ప్రొసీడింగ్స్‌ను కలెక్టర్‌ రాజాబాబుకు పంపిస్తారు. కలెక్టర్‌ ఆ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిన తర్వాత వాటిని పంచాయతీరాజ్‌ కమిషనర్‌ కార్యాలయానికి పంపాల్సి ఉంది. ఈ ప్రతిపాదనలను శుక్రవారం సాయంత్రంలోపు పంపాలని ఆదేశాలు జారీకావడంతో తదనుగుణంగా జిల్లా పంచాయతీ అధికారులు చర్యలు ప్రారంభించారు. జిల్లాలో కనిగిరి డివిజన్‌లో 31 ప్రతిపాదనలు, మార్కాపురం డివిజన్‌లో 36 ప్రతిపాదనలు, ఒంగోలు డివిజన్‌లో 12 ప్రతిపాదనలు వచ్చాయి.

Updated Date - Dec 24 , 2025 | 11:05 PM