వేసవిలో సైతం బావులలో నీరు పుష్కలం
ABN , Publish Date - Dec 17 , 2025 | 01:36 AM
ఒక వైపు వీధి వీధికి పుట్టగొడుగుల్లా మినరల్ వాటర్ ప్లాంట్లు వెలుస్తున్నప్పటికీ, ఆ గ్రామం మాత్రం పురాతన కాలం నుంచి తమ పెద్దలు తాగిన బావి నీటినే నేటికి తాగు తున్నారు.
బల్లికురవ, డిసెంబరు16 (ఆంధ్రజ్యోతి): ఒక వైపు వీధి వీధికి పుట్టగొడుగుల్లా మినరల్ వాటర్ ప్లాంట్లు వెలుస్తున్నప్పటికీ, ఆ గ్రామం మాత్రం పురాతన కాలం నుంచి తమ పెద్దలు తాగిన బావి నీటినే నేటికి తాగు తున్నారు. బావుల నీటిలో ఎన్నో ఉపయోగాలు ఉన్నా యని వారు అంటున్నారు. బావుల పక్కనే బోర్లు ఏర్పాటు చేస్తున్న అరకొరగా నీరు పడడంతో పాటు ఉప్పు నీరు పడుతున్నాయని అందుకే తాము గతంలో ఉన్న బావుల నీటిని గృహ అవసరాలతో పాటు తాగు నీటికి కూడా వినియోగిస్తున్నారని ఆ గ్రామ ప్రజలు పేర్కొంటున్నారు.
బల్లికురవ మండలం ముక్తేశ్వరం గ్రామంలో వందల ఏళ్ల నుంచి పురాతన మహల్‌బావి ఎంతో గుర్తింపు ఉంది. ఈ బావి నీరు స్వచ్ఛంగా ప్లోరిన్ లేకుండా ఉంటుందని ప్రజలు పేర్కొంటున్నారు. ఈ గ్రామంలో పదుల సంఖ్యలో మాత్రమే బోర్లు ఉన్నాయి. బోర్ల ద్వారా వచ్చే నీరు ఉప్పగా ఉంటుందని దీంతో పాత కాలం నాటి మహల్ బావిపై మోటా ర్లు ఏర్పాటు చేసుకుని గ్రామంలోని గృహాలకు తాగునీటికి వినియోగించు కుంటున్నారు. ఇదేగ్రామంలోని మరో రెండు పురాతన బావులపై పదుల సంఖ్యలో మోటార్లు ఏర్పాటు చేసుకొని అన్ని గృహాలకు నీటిని వినియోగిస్తున్నారు. కాలం ఎంత మారినా నేటికీ తాము బావుల నీటినే ప్రధానంగా వినియోగించు కుంటున్నామన్నారు. ప్రభుత్వం పురాతన బావులను మరింత అభివృద్ధి పరిస్తే శుద్ధి కలిగిన తాగునీరు భూమి నుంచి వస్తుందని ప్రజలు తెలిపారు. పురాతన బావులను చూస్తే తమ పెద్దలు కూడా గుర్తుకు వస్తారని మండు వేసవిలో సైతం బావులలో నీరు పుష్కలంగా ఉంటుందని వారు తెలిపారు. వైద్య అరోగ్యశాఖ అధికారులు సైతం బావుల నీరు స్వచ్ఛంగా ఉందని చెబుతున్నారని వారు గుర్తు చేస్తున్నారు. గ్రామాలలో ఇప్పుడు పురాతన కాలం నాటి బావులు అరకొరగా ఉన్నాయని వినియోగంలో ఉన్న బావులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ముక్తేశ్వరం గ్రామ ప్రజలు అంటున్నారు. తమ గ్రామంలో రక్షిత మంచినీటి పథకం ఇంతవరకు ఏర్పాటు చేయలేదని వారు అంటున్నారు. పాత కాలం నాటి బావులు ఉండడంతో ప్రజలు మంచినీటి ట్యాంకుల గురించి కూడా అలోచించచడం లేదని తెలిపారు. ప్రభుత్వం వెంటనే పురాతన బావులను మరింత ఎత్తు పెంచి చుట్టుతా ఫెన్సింగ్ ఏర్పాటు చేసి పూడిక తీయించి ప్రజలకు మరింత ఉపయెగపడే చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.