మార్కాపురం జిల్లాలో శ్రీశైలం ప్రతిపాదన లేదు
ABN , Publish Date - Aug 31 , 2025 | 02:40 AM
శ్రీశైలాన్ని మార్కాపురం జిల్లాలో కలపాలన్న ప్రతిపాదన ప్రభుత్వం వద్ద లేదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
మంత్రి డాక్టర్ శ్రీబాలవీరాంజనేయ స్వామి
పుణ్యక్షేత్రంపై దుష్ప్రచారం చేయొద్దని సూచన
టంగుటూరు (కొండపి), ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి) : శ్రీశైలాన్ని మార్కాపురం జిల్లాలో కలపాలన్న ప్రతిపాదన ప్రభుత్వం వద్ద లేదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. శనివారం ఆయన టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలోని పశ్చిమప్రాంతంలో ఉన్న మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి, దర్శి నియోజకవర్గాలను కలిపి మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటుకు ప్రతిపాదించామని మంత్రి చెప్పారు. ఇందుకు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుంటుందన్నారు. అయితే కొంతమంది వ్యక్తిగత ప్రయోజనాల కోసం రెండు జిల్లాల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలు ఈవిషయాన్ని గుర్తించి ఎలాంటి ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి ఊహాగానాలను మీడియాలో, సోషల్ మీడియాలో ప్రచారం చేయవద్దని సూచించారు.