Share News

వైద్యుడు లేడు.. సిబ్బంది లేరు..

ABN , Publish Date - Oct 08 , 2025 | 01:26 AM

అద్దంకి తాలూకాలో మొట్టమొదటిగా 58 సంవత్సరాల క్రితం బొమ్మనంపాడులో పశువైద్యశాల ఏర్పాటు చేశారు.

వైద్యుడు లేడు.. సిబ్బంది లేరు..

అద్దంకి, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి) : అద్దంకి తాలూకాలో మొట్టమొదటిగా 58 సంవత్సరాల క్రితం బొమ్మనంపాడులో పశువైద్యశాల ఏర్పాటు చేశారు. అప్పట్లో అద్దంకి తాలూకా మొత్తం మీద బొమ్మనంపాడులో మాత్రమే పశువైద్యశాల ఉంది. అనంతరం పలు చోట్ల పశువైద్యశాల ఏర్పాటు చేశారు. ఆ తరువాత అద్దంకి పట్టణంలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌ స్థాయి పశువైద్యశాల ఏర్పాటు చేసినా వైద్యశాలకు తీసుకొచ్చిన పశువులకు మాత్రమే వైద్యం చేస్తారు. దీంతో అద్దంకి మండలంలోని మిగిలిన అన్ని గ్రామాలకు బొమ్మనంపాడు పశువైద్యశాల నుండే వైద్యం అందాల్సి ఉంది. అన్ని మండలాలలో మూడు, నాలుగు చొప్పున పశువైద్యశాలలు ఉన్నా అద్దంకి మండలం మొత్తానికి ఒకే ఒక పశువైద్యశాల ఉంది. అయితే ప్రస్తుతం బొమ్మనంపాడు పశువైద్యశాలలో ఉండాల్సిన వైద్యుడు, వెటర్నరీ అసిస్టెంట్‌, అటెండర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇతర ప్రాంతాల నుంచి నియమించినా ఎప్పుడు వస్తారో, ఎప్పుడు వెళ్తారో కూడా తెలియని పరిస్థితి ఉంది. రోజులో ఒక గంట పాటు ఎవరో ఒకరు వచ్చి వెళ్తుంటారని గ్రామస్థులు, రైతులు తెలిపారు. దీంతో ఎప్పుడూ తాళాలు వేసి దర్శనమిస్తోంది. పశుపోషకులు తప్పనిసరి పరిస్థితులలో ప్రైవేటు వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అద్దంకి మండలంలో మొత్తం 26 గ్రామపంచాయతీలు ఉండగా అధికారిక లెక్కల ప్రకారం గొర్రెలు, మేకలు, గేదెలు ఇతర పశువులు 73 వేల వరకు ఉన్నాయి. ఇక కోళ్లు సుమారు 13 వేల వరకు ఉన్నాయి. అద్దంకి పట్టణం మినహా మిగిలిన అన్ని గ్రామాలకు బొమ్మనంపాడు పశువైద్యశాల నుండే వైద్యం అందాల్సి ఉంది. అదనంగా కనీసం మరో రెండు, మూడు పశువైద్యశాలలు ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే ప్రస్తుతం కొత్త పశువైద్యశాలల ఏర్పాటు పరిస్థితి అటుంచితే ఉన్న ఒక్క పశు వైద్యశాలలో కూడా అటు వైద్యుడు కానీ, సిబ్బంది కానీ లేకపోవడం గమనార్హం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి బొమ్మనంపాడు పశు వైద్యశాలలో ఖాళీగా ఉన్న వైద్యుడు, సిబ్బంది పోస్టులను భర్తీ చేయడంతో పాటు అదనంగా పశువైద్యశాలలు ఏర్పాటు చేయాలని పశుపోషకులు కోరుతున్నారు. పుష్కరకాలం క్రితం బొమ్మనంపాడులో నిర్మించిన పశువైద్యశాల భవనం నిర్మాణ పనులు అర్ధాంతరంగా నిలిచాయి. దీంతో శిథిలావస్థకు చేరిన పాత పశువైద్యశాలలోనే వైద్యం అందించాల్సిన పరిస్థితి.

Updated Date - Oct 08 , 2025 | 01:26 AM