‘సహకారం’ లేదిక్కడ!
ABN , Publish Date - Jun 07 , 2025 | 01:08 AM
జిల్లా సహకార శాఖలో సంక్షోభం నెలకొంది. గతంలో డీసీవోగా పనిచేసిన అధికారి అనేక అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో విచారణ చేయించి అతనిని కలెక్టర్ ప్రభుత్వానికి సరెండర్ చేశారు. అనంతరం మొత్తం జిల్లాలోని సహకార రంగ సంస్థలను పర్యవేక్షించే అధికారి (డీసీవో)గా కలెక్టర్ ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించిన అధికారిణిని ఆ శాఖ కమిషనర్ అసలు గుర్తించ లేదు.
కలెక్టర్ నియమించిన ఇన్‌చార్జి డీసీవోను గుర్తించని ఆ శాఖ కమిషనర్
సిబ్బందికి రెండు నెలలుగా నిలిచిపోయిన జీతాలు
ప్రభుత్వం మారినా మారని తీరు
తనను ఇన్‌చార్జి బాధ్యతల నుంచి తప్పించమని కోరుతున్న ఇందిరాదేవి
ఆ శాఖలో అంతా గందరగోళం
డీసీసీబీ వ్యవహారంలోనూ ఉన్నతాధికారుల విచిత్ర వైఖరి
జిల్లా సహకార శాఖలో సంక్షోభం నెలకొంది. గతంలో డీసీవోగా పనిచేసిన అధికారి అనేక అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో విచారణ చేయించి అతనిని కలెక్టర్ ప్రభుత్వానికి సరెండర్ చేశారు. అనంతరం మొత్తం జిల్లాలోని సహకార రంగ సంస్థలను పర్యవేక్షించే అధికారి (డీసీవో)గా కలెక్టర్ ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించిన అధికారిణిని ఆ శాఖ కమిషనర్ అసలు గుర్తించ లేదు. దీంతో ఆర్థిక వ్యవహారాలు చూసే అవకాశం సదరు అధికారిణికి లేకుండా పోయింది. ఫలితంగా జిల్లా సహకార శాఖ కార్యాలయ సిబ్బందికి రెండు నెలలుగా జీతాలు నిలిచిపోయాయి. వచ్చే నెలలో కూడా వస్తాయో లేదో తెలియని పరిస్థితి నెలకొంది.
ఒంగోలు, జూన్ 6 (ఆంధ్రజ్యోతి) : సాధారణంగా జిల్లా పాలన వ్యవహారాలలో అంతిమ నిర్ణయం కలెక్టర్లదే. ఆయా శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులపై పర్యవేక్షణ వారి పరిధిలోనే ఉంటుంది. ఆశించిన మేర పనితీరు లేని వారిని ప్రభుత్వానికి సరెండర్ చేసి మరొకరికి ఆ బాధ్యతలను అప్పగించే అధికారం కలెక్టర్లకు ఉంటుంది. అలాంటి సందర్భంలో కలెక్టర్ సిపార్సును గౌరవించి సదరు అధికారికి రాష్ట్రశాఖ కార్యాలయం తరఫున అవసరమైన గుర్తింపు ఇచ్చి పనిచేసేలా ఉన్నత స్థాయి అధికారులు వ్యవహరిస్తారు. అయితే జిల్లా సహకార శాఖ విషయంలో జరిగిన వ్యవహారం అందుకు భిన్నంగా ఉంది. గతంలో ఇక్కడ డీసీవోగా పనిచేస్తున్న శ్రీనివాస రెడ్డి పనితీరు పట్ల జిల్లాకు చెందిన పలువురు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ సంబంధిత మంత్రి అచ్చెన్నాయుడు, ఇతర ఉన్నత స్థాయి పెద్దలకు ఫిర్యాదులు చేశారు. జిల్లాకు చెందిన మంత్రి డాక్టర్ డీఎస్‌బీవీ స్వామి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రధానంగా అందులో ఉన్నారు. మరోవైపు డీసీసీబీ వ్యవహారంలోనూ ఇతర కొన్ని అంశాల్లోనూ డీసీవో శ్రీనివాసరెడ్డి వ్యవహరశైలిపై కలెక్టర్ అన్పారియా కూడా అసంతృప్తితో ఉన్నారు. ఆ సమయంలో ఉన్నత స్థాయి నుంచి డీసీవోపై తమకు వస్తున్న ఫిర్యాదుల విషయమై కలెక్టర్‌ను వివరణ కోరడంతో పాటు తగు చర్యలకు సూచించారు. ఈ నేపథ్యంలో డీసీవో శ్రీనివాసరెడ్డిని కలెక్టర్ ప్రభుత్వానికి సరెండ్ చేశారు. అది మార్చి ఆఖరులో జరిగింది. సాధారణంగా ఇలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు కలెక్టర్ సిఫార్సును సంబంధిత శాఖ కమిషనర్ ఆమోదించి ఆస్థానంలో మరొక అధికారిని నియమిస్తారు. అలాంటి చర్య ఒకట్రెండ్రోజుల్లో జరిగిపోవాలి. కానీ ఇక్కడ డీసీవో విషయంలో ఉన్నత స్థాయి అధికారుల నుంచి స్పందన లేదని సమాచారం. శ్రీనివాసరెడ్డిని కలెక్టర్ సరెండర్ చేస్తూ కమిషనర్‌కు లిఖితపూర్వకంగా పంపిన అనంతరం ఆయన ఇక్కడ రిలీవ్ కాగా ఆ స్థానంలో ఎవరినీ రాష్ట్ర అధికారులు నియమించలేదు.
రెండు వారాల తర్వాత నిమాయకం
దాదాపు రెండు వారాలపాటు డీసీవో పోస్టు ఖాళీగానే ఉంది. దీంతో శాఖాపరమైన పనులు కంటుపడకుండా ఉండేందుకు డీఎల్‌సీవో కేడర్‌లో పీడీసీసీ బ్యాంకులో ఓఎస్‌డీగా పనిచేస్తున్న ఇందిరాదేవిని ఏప్రిల్ 15న కలెక్టర్ అన్సారియా ఇన్‌చార్జి డీసీవోగా పూర్తి అదనపు బాధ్యతల్లో నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అలా ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించేందుకు అర్హత డీఎల్‌సీవో కేడర్ వారికే ఉండగా అలాంటి వారు జిల్లాలో ముగ్గురు మాత్రమే పనిచేస్తున్నారు. వారిలో ఒకరు పి.రాజశేఖర్ కాగా ఆయన డీసీఏవోపాటు ఒంగోలు డివిజనల్ అధికారిగా ఇన్‌చార్జి బాధ్యతల్లో ఉన్నారు. అంతేకాక ఆయనపై పలు ఫిర్యాదులు, ఆరోపణలు ఉన్నాయి. ఇక మార్కాపురం డీసీసీవో ఒకరు కాగా, డీసీసీబీలో ఓఎస్‌డీగా ఇందిరాదేవి మరొకరు. ఒంగోలులో అందుబాటులో ఉండటంతో ఆమెవైపు కలెక్టర్ మొగ్గుచూపినట్లు సమాచారం. ఇందిరాదేవిని ఇన్‌చార్జి డీసీవోగా నియమించిన కలెక్టర్ ఆ విషయాన్ని సహకారశాఖ ఉన్నతాధికారులకు తెలియజేశారు.
డీసీవోకు లాగిన్ ఇవ్వకుండా..
సాధారణంగా ప్రభుత్వంలో ఇలా కలెక్టర్లు చేస్తే తక్షణం ఉన్నత స్థాయి నుంచి ఆమోదం లభిస్తుంది. అయితే సహకార శాఖ కమిషనరేట్ నుంచి అందుకు విరుద్ధంగా జరిగింది. తొలుత డీసీవోగా ఉన్న శ్రీనివాసరెడ్డిని సరెండర్ చేసినప్పుడే మరొకరిని ఆ స్థానంలో రాష్ట్ర సహకార అధికారులు మరొకరిని నియమించాలి. అది చేయకపోగా ఇక్కడ ఇన్‌చార్జీ డీసీవోగా ఇందిరాదేవిని నియమించి రాటిఫికేషన్ (ఽధ్రువీకరణ) కోసం కమిషనర్‌కు పంపితే అందుకు కూడా అంగీకారం ఇంతవరకు తెలుపలేదు. దీంతో ఇన్‌చార్జీ డీసీవో ఇందిరాదేవికి ఆర్థిక పరమైన, ఇతర అంశాలలో పూర్తిగా పనిచేసే అవకాశం లేకుండాపోయింది. కీలకమైన జిల్లా అధికారులకు ఉండే సీఎఫ్‌ఎంఎస్‌లో ఆమెను ధ్రువీకరించకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల డీసీవోలు కలిసి ఉండే సీఎఫ్‌ఎంఎస్ లాగిన్ కూడా సమస్యలు ఎదురై ఇతర జిల్లాల అధికారుల విధులకు కొంత ఆటంకం ఏర్పడినట్లు సమాచారం. దానిని గుర్తించి ఆ లాగిన్ నుంచి ఒంగోలు డీసీవోను తప్పించి ఇతర జిల్లాలకు ఇబ్బందులు లేకుండా చేసిన ఉన్నతాధికారులు ఇక్కడ మాత్రం పట్టించుకోకుండా వదిలేశారు.
గతంలోనూ ఇదే వైఖరి
గతంలో పీడీసీసీ బ్యాంకుపై విచారణ సమయంలోనూ రాష్ట్ర సహకారశాఖ అధికారులు ఇలాగే వ్యవహరించారు. అప్పట్లో కలెక్టర్ సిఫార్సులకు అనుగుణంగా బ్యాంకు సీఈవోను బదిలీ చేయడం, విచారణాధి కారుల నియామకం, ఇతర చర్యల్లోనూ మీనమేషాలు లెక్కించారు. చివరకు సీఎం జోక్యం చేసుకుంటే కాని కదల్లేదు.
జీతాలు నిలిచి ఇబ్బందుల్లో ఉద్యోగులు
నిజానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల డీసీవోలు ఉండే లాగిన్ నుంచి ఒంగోలు డీసీవోను తప్పించడం కూడా నిబంధనలకు విరుద్ధమని చెప్తున్నారు. ఆ విషయం అలా ఉంచితే ఇక్కడ ఇన్‌చార్జి డీసీవోగా కలెక్టర్ నియమించిన ఇందిరాదేవిని ధ్రువీకరించకుండా ఆ శాఖ కమిషనరేట్ వ్యవహరిస్తున్న తీరుతో జిల్లాలో సమస్య ఏర్పడింది. ఇందిరాదేవిని ధ్రువీకరించక సీఎఫ్‌ఎంఎస్‌లో ఆమె పేరు చేరకపోవడంతో చివరకు డీసీవో కార్యాలయ ఉద్యోగులు, సిబ్బందికి కూడా జీతాలు నిలిచిపోయాయి. రెండు నెలల జీతాలు ఆగిపోగా వచ్చేనెల పరిస్థితి కూడా అలాగే ఉండవచ్చని తెలుస్తోంది. ఈ మొత్తం పరిస్థితికి ప్రధాన కారణం డీసీవో శ్రీనివాసరెడ్డిని సరెండర్ చేయడం పట్ల కమిషనరేట్ అధికారులు గుర్రుగా ఉండటమేనని తెలుస్తోంది. అయితే వారికి ఇష్టం లేకపోయినా కలెక్టర్ సిఫార్సులకు అనుగుణంగా చర్యలు తీసుకోవాల్సి ఉండగా అందుకు వారు విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఈ మొత్తం వ్యవహారంలో తీవ్ర ఒత్తిడికి గురవుతున్న ఇన్‌చార్జి డీసీవో ఇందిరాదేవి తన అనారోగ్య కారణాలు, పని ఒత్తిడి దృష్ట్యా ఇన్‌చార్జి బాధ్యతల నుంచి తప్పించాలని కోరుతున్నట్లు సమాచారం. ఆ మేరకు అటు సహకార శాఖ కమిషనర్‌కు, ఇటు కలెక్టర్‌కు తన అభ్యర్థలను ఇచ్చిట్లు తెలుస్తోంది. మొత్తం మీద జిల్లాలో సహకార సంస్థలు సంక్షోభంలో పడకుండా పర్యవేక్షించాల్సిన జిల్లా సహకార శాఖే గందరగోళంలో పడింది.