Share News

మెప్మాలో మళ్లీ రచ్చ

ABN , Publish Date - Nov 23 , 2025 | 02:51 AM

ఒంగోలులోని మెప్మా కార్యాలయంలో మరోసారి రచ్చ మొదలైంది. పొదుపు సభ్యులకు తెలియకుండా బ్యాంకుల ద్వారా రుణాలు పొందిన ఓ ఆర్పీ వాటిని బ్యాంకులకు చెల్లించకపోవడంతో తమకు నోటీసులు వస్తున్నాయంటూ బాఽధితులు రోడ్డెక్కారు.

మెప్మాలో మళ్లీ రచ్చ

రుణాల పేరుతో మోసం చేసిన ఆర్పీని తొలగించాలి

ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలి

కేశవస్వామిపేటకు చెందిన పొదుపు సభ్యుల డిమాండ్‌

ఒంగోలు కార్పొరేషన్‌, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): ఒంగోలులోని మెప్మా కార్యాలయంలో మరోసారి రచ్చ మొదలైంది. పొదుపు సభ్యులకు తెలియకుండా బ్యాంకుల ద్వారా రుణాలు పొందిన ఓ ఆర్పీ వాటిని బ్యాంకులకు చెల్లించకపోవడంతో తమకు నోటీసులు వస్తున్నాయంటూ బాఽధితులు రోడ్డెక్కారు. కేశవస్వామిపేటలోని పద్నాలుగు గ్రూపులకు చెందిన యానాది సామాజికవర్గం మహిళలు తమకు న్యాయం చేయాలని కోరారు. ఒంగోలు మెప్మాలో పనిచేస్తున్న కొల్లాబత్తిన దివ్యశాంతిని తమ సంఘ బాధ్యతల నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. శనివారం ఆ సంఘ సభ్యులు విలేకరులతో మాట్లాడారు. తమ గోడును వెల్లబోసుకున్నారు. ఆర్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్న దివ్యశాంతి తమ పేర్లతో 14 బోగస్‌ పొదుపు సంఘాలను తయారు చేశారని తెలిపారు. ఒక్కో గ్రూపులో ఐదారుగురు పేర్లతో తమకు తెలియకుండా రుణాలు తీసుకున్నట్లు వారు వెల్లడించారు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో బ్యాంకుల నుంచి నోటీసులు అందేవరకు తమకు విషయం తెలియదన్నారు. దీనిపై అప్పట్లో పీడీ శ్రీహరిని కలిసి ఫిర్యాదు చేసి న్యాయం చేయాలని కోరినట్లు తెలిపారు. పీడీ ముందు ప్రతినెలా బ్యాంకులకు తానే రుణం సొమ్ము చెల్లిస్తానని చెప్పి ఆర్పీ ఒప్పందం చేసుకున్నారని, నేటికీ ఎలాంటి చెల్లింపులు లేకపోవడంతో బ్యాంకు వాళ్లు ఇంకా తమ ఇళ్లకు వస్తున్నారని తెలిపారు. ఇదేవిషయమై అనేకసార్లు పీడీని కలిసి విన్నవించుకున్నప్పటికీ విచారణ చేస్తున్నామంటూ తమను మభ్యపెడుతూ వస్తున్నారని వారు వాపోయారు. ఎనిమిది నెలలు అయినా కనీస చర్యలు తీసుకోకుండా ఇప్పుడు ఆర్పీకి అనుకూలంగా మాట్లాడుతున్నారన్నారు. ఆర్పీ దివ్యశాంతిని తమ సమాఖ్య నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. తమపేరుతో పొందిన రుణం మొత్తాన్ని బ్యాంకులకు ఆమె చేతనే కట్టించి తమను రుణవిముక్తులను చేయాలని వారు కోరారు. దీనిపై మిషన్‌ డైరెక్టర్‌, కలెక్టర్‌ విచారణ చేయించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

Updated Date - Nov 23 , 2025 | 02:51 AM