Share News

వారి నిర్లక్ష్యం.. వీరికి శాపం

ABN , Publish Date - Aug 05 , 2025 | 01:24 AM

గత వైసీపీ హయాంలో ఒంగోలు కార్పొరేష న్‌లో ఇష్టారాజ్య పాలన నడిచింది. నగర పాలక సంస్థ ఖజానాకు ప్రధాన ఆదాయ వనరు అయిన రెవెన్యూలో అలవిమాలిన నిర్లక్ష్యం కొనసాగింది. ఊరచెరువులోని దామోదరం సంజీ వయ్య కూరగాయల మార్కెట్‌ వైపు కనీసం కన్నెత్తి చూడకపోవడంతో భారీగా బకాయిలు పేరుకుపోయాయి.

వారి నిర్లక్ష్యం.. వీరికి శాపం
మాట్లాడుతున్న ఆర్‌ఐలు శ్రీను, కల్యాణి

వైసీపీ హయాంలో కార్పొరేషన్‌ రెవెన్యూ విభాగం ఇష్టారాజ్యం

రూ.12కోట్ల మేర పేరుకుపోయిన కూరగాయల మార్కెట్‌ షాపుల అద్దెలు

దొరకని లీజుదారుల అడ్రస్‌లు... వసూళ్లకు కొత్త తలనొప్పులు

గత ఆర్‌ఐల నిర్లక్ష్యంపై చర్యలు శూన్యం

ఒంగోలు, కార్పొరేషన్‌, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి) : గత వైసీపీ హయాంలో ఒంగోలు కార్పొరేష న్‌లో ఇష్టారాజ్య పాలన నడిచింది. నగర పాలక సంస్థ ఖజానాకు ప్రధాన ఆదాయ వనరు అయిన రెవెన్యూలో అలవిమాలిన నిర్లక్ష్యం కొనసాగింది. ఊరచెరువులోని దామోదరం సంజీ వయ్య కూరగాయల మార్కెట్‌ వైపు కనీసం కన్నెత్తి చూడకపోవడంతో భారీగా బకాయిలు పేరుకుపోయాయి. ప్రస్తుతం అధికారుల లెక్క ప్రకారం రూ.12 కోట్ల వరకూ అద్దెలు రావాల్సి ఉంది. కార్పొరేషన్‌ షాపుల అద్దె బకాయిలపై సోమవారం ఆంధ్ర జ్యోతి ప్రచురించిన ‘అలా వదిలేశారు’ కథనంపై అధికారులు స్పందించారు. వసూళ్లకు రంగంలోకి దిగారు. మొండి బకాయిదా రులకు హెచ్చరికలు జారీచేయడంతోపాటు, పెద్ద మొత్తంలో బాకీ ఉండి అద్దెలు చెల్లించని దుకాణాలకు తాళాలు వేశారు. గత ప్రభుత్వంలో కార్పొరేషన్‌ రెవెన్యూ యంత్రాంగం నిర్లక్ష్యంతో నేడు భారీగా బకాయిలు పేరుకుపోయాయి. వాటి వసూలుకు వెళ్లిన ప్రస్తుత రెవెన్యూ అధికారులకు కొత్త తలనొప్పులు ఎదురవుతున్నాయి. కూరగాయల మార్కెట్‌లో 500కుపైగా షాపులు ఉండగా అందులో వందలోపు మాత్రమే అద్దెకు తీసుకున్న అసలైన వ్యాపారులు ఉన్నారు. మిగిలిన వాటిలో బినామీలు, సబ్‌ లీజుదారులు తిష్ఠవేశారు. మరికొందరు తాము షాపులను కొనుక్కున్నామని సమాధానమిస్తున్నారు. మరికొంతమంది ఇంత పెద్దమొత్తంలో బాకీలతో తమకేమి సంబంధం, కావాలంటే ఖాళీ చేస్తామని తేల్చిచెబుతున్నారు. అత్యధిక శాతం షాపుల్లో కార్పొరేషన్‌ రికార్డుల్లో పేర్లు ఉన్న వారు లేకపోగా, కనీసం వారి అడ్రస్‌లు కూడా దొరకని పరిస్థితి ఉంది. దీంతో షాపుల అద్దెల వసూలు అధికారులకు సమస్యగా మారింది.

లెక్కల్లేవ్‌.. పత్రాల్లేవ్‌..!

కార్పొరేషన్‌ రెవెన్యూ సెక్షన్‌కు సంబంధించిన ప్రధానమైన అద్దెల చెల్లింపులకు లెక్కలు.. పత్రాలు లేవని సమాచారం. ముఖ్యంగా కొంతమంది తాము అద్దెలు కట్టామని సమాధానమిస్తున్నారు. మరి కొందరు బినామీలు మాత్రం తమకు సంబంధం లేదని, లీజుదారుడికి నెలనెలా అద్దెలు చెల్లిస్తున్నామని వెల్లడిస్తున్నారు. అయితే గడిచిన ఐదేళ్లలో ఎవరు ఎంత అద్దెలు కట్టారు? ఏ నెలలో చెల్లించారు అన్నదానిపై స్పష్టత కొరవడింది. దుకాణ యజమానులు అద్దెలు చెల్లిస్తే ఆ డబ్బులు ఏమయ్యాయో కూడా తెలియని పరిస్థితి ఉంది. అయితే ఆ వివరాలపై ప్రస్తుత రెవెన్యూ సెక్షన్‌ సిబ్బంది పరిశీలన చేయగా, పూర్తిస్థాయిలో సమాచారం లభించలేదని తెలిసింది. వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు రెవెన్యూ సెక్షన్‌ కసరత్తు చేస్తుండగా, అందుకు సంబంధించిన పలు చెల్లింపులకు ఆధారాలు దొరకలేదని సమాచారం.

గత ఆర్‌ఐల నిర్లక్ష్యంపై చర్యలు నిల్‌

నాటి వైసీపీ పెద్దల ఆశీసులతోఐదేళ్లు ఆడుతూ.. పాడుతూ ఆర్‌ఐలుగా పనిచేసిన వారు అందిన కాడికి దోచుకున్నారు. ఆపై కార్పొరేషన్‌ ఆదాయ వనరులపై నిర్లక్ష్యం చూపారు. దుకాణ యజమానులను చూసీచూడనట్లు వదిలేశారనే ఆరోపణలూ ఉన్నాయి. వారి నిర్లక్ష్యం కారణంగా నేడు కేవలం ఊరచెరువు మార్కెట్‌లోనే రూ.12 కోట్ల మేర బకాయిలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతవరకు వారిపై ఎలాంటి చర్యలు లేకపోవడం, ఆ బకాయిల వసూలు బాధ్యత ప్రస్తుత రెవెన్యూ సిబ్బందిపై పడటంతో వారి పని మరింత కష్టంగా మారింది. మరోవైపుసాధారణ పౌర సేవలకు మరింత ఆటంకం ఎదురవుతుంది. దీంతో రోజువారీ రెవెన్యూ సేవలు ఆలస్యమవుతున్నాయి. అయితే ఇంత పెద్ద మొత్తంలో బకాయిలు పేరుకుపోవడానికి కారణం అయిన సిబ్బందిపై కనీసం చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.

అద్దెలు చెల్లించని షాపులకు తాళాలు

కార్పొరేషన్‌ షాపుల అద్దెల బకాయిలపై ఆంధ్రజ్యోతి సోమవారం ప్రచురించిన ‘అలా వదిలేశారు’ కథనంపై కమిషనర్‌ కె.వెంకటేశ్వరరావు సీరియస్‌గా దృష్టి సారించారు. బకాయిల వసూళ్లకు రెవెన్యూ విభాగం అధికారులను రంగంలోకి దింపారు. దీంతో ఆర్‌వో, ఆర్‌ఐలు మార్కెట్‌లో వ్యాపారులతో మాట్లాడారు. అద్దెలు చెల్లించాలని కోరారు. దీర్ఘకాలికంగా పేరుకుపోయిన అద్దె బకాయిలపై నోటీసులు జారీచేయడంతోపాటు, త్వరితగతిన చెల్లించాలని తెలిపారు. ఇదిలాఉండగా పెద్ద మొత్తంలో బాకీ ఉన్న షాపులకు తాళాలు వేశారు. అద్దెలు చెల్లించకుంటే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆర్‌వో భాస్కర్‌తోపాటు, ఆర్‌ఐలు కల్యాణి, శంకరశెట్టి శ్రీను, క్రాంతికుమార్‌, నిరూప్‌ పాల్గొన్నారు.

Updated Date - Aug 05 , 2025 | 01:25 AM