Share News

వ్యసనాలకు బానిసలై చోరీలు

ABN , Publish Date - Dec 13 , 2025 | 02:24 AM

చెడు వ్యసనాలకు బానిసలైన వారు పగటిపూట తాళాలు వేసిన ఇళ్లను ఎంచుకొని రాత్రి సమయాలలో వాటిని పగులగొట్టి బంగారు వస్తువులను చోరీ చేసి జల్సాలు చేస్తున్న ఇరువురు దొంగలను స్థానిక పోలీసులు అరెస్టు చేశారు.

వ్యసనాలకు బానిసలై చోరీలు
స్వాధీనం చేసుకున్న సొత్తును చూపిస్తున్న డీఎస్పీ నాగరాజు

ఇద్దరు దొంగల అరెస్టు

బంగారు నగలు స్వాధీనం

వివరాలు వెల్లడించిన డీఎస్పీ నాగరాజు

గిద్దలూరు టౌన్‌, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): చెడు వ్యసనాలకు బానిసలైన వారు పగటిపూట తాళాలు వేసిన ఇళ్లను ఎంచుకొని రాత్రి సమయాలలో వాటిని పగులగొట్టి బంగారు వస్తువులను చోరీ చేసి జల్సాలు చేస్తున్న ఇరువురు దొంగలను స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి సుమారు 14 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలను, చోరీకి ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ యు.నాగరాజు, అర్బన్‌ సీఐ సురేష్‌ తెలిపారు. చీరాల నవాబ్‌పేటలో వెల్డింగ్‌ పని చేసుకునే సయ్యద్‌ అఫ్రోజ్‌, కడప జిల్లా మైదుకూరుకు చెందిన వెల్డింగ్‌ పని చేసుకునే సుంకర ఖాదర్‌బాషా చెడు వ్యసనాలకు లోనై చోరీలు చేయడం, ఆ డబ్బుతో జల్సాలు చేయడం అలవాటు చేసుకున్నారు. కొంతకాలంగా ఇరువురూ గిద్దలూరులో నివాసం ఉంటూ చోరీలు చేయడం ప్రారంభించారు. ఒక కారును కొనుగోలు చేసి చోరీలకు ఆకారును ఉపయోగించేవారు. ఈక్రమంలో గత నెల 23వ తేదీన దొడ్డంపల్లికి వెళ్లి పి.రమణారెడ్డి అనే వ్యక్తి ఇంటి తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఇరుగుపొరుగు వారు తాళం వేసి ఉన్న ఇంట్లో వస్తున్న శబ్దాలు గమనించి కేకలు వేయడంతో దొంగలు పరుగు తీసి తమ వెంట తెచ్చుకున్న కారులో పారిపోయారు. కారు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేసి వారిరువురిని అదుపులోకి తీసుకుని విచారించారు. గతంలో 50కి పైగా చోరీలు చేసి శిక్షలు కూడా అనుభవించినట్లు విచారణలో తెలుసుకున్నారు. పట్టణంలోని రాజానగర్‌, కొంగళవీడు, కేఎ్‌సపల్లె గ్రామాలలో కూడా చోరీలు చేసినట్లు గుర్తించారు. దొంగిలించిన బంగారు వస్తువులను వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు. మార్కాపురం డీఎస్పీ నాగరాజు శుక్రవారం సాయంత్రం ఇరువురు దొంగల వివరాలను విలేకరుల సమావేశంలో వెల్లడించారు. నిందితుల నుంచి రూ.14 లక్షల విలువైన బంగారు సరుడు, చైన్‌, నల్లపూసల దండ, ఉంగరాలు, రాళ్ల కమ్మలు, డిజైన్‌ కమ్మలు, బుట్టకమ్మలు, చెంపసరాలు, ముక్కుపుడకలు, ఇతర వస్తువులను, కారును స్వాధీనం చేసుకుని తెలిపారు. ఇరువురు దొంగలను అరెస్టు చేశామని, వారిని కోర్టులో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ తెలిపారు. అతి తక్కువ కాలంలో దొంగలను గుర్తించి పట్టుకుని పోయిన సొత్తును రికవరీ చేసిన అర్బన్‌ సీఐ సురేష్‌, సిబ్బందిని ఎస్పీ అభినందించినట్లు డీఎస్పీ వివరించారు.

Updated Date - Dec 13 , 2025 | 02:25 AM