గోదావరి జలాలతో పశ్చిమం ప్రకాశమే
ABN , Publish Date - Nov 30 , 2025 | 01:19 AM
కృష్ణానది వరద జలాల ఆధారంగా జిల్లాలోని పశ్చిమప్రాంత సాగు, తాగునీటి అవసరాల కోసం నిర్మిస్తున్న వెలిగొండ ప్రాజెక్టుకు గోదావరి నీరు కూడా అందనుంది. దాని ఆయకట్టుతోపాటు ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం వివిధ వనరుల కింద ఉన్న ఆయకట్టు స్థిరీకరణ, లక్షలాది ఎకరాల మెట్ట భూములకు సాగునీటి సౌకర్యం కలగనుంది.
వెలిగొండ ప్రాజెక్టుకు నీటి గ్యారెంటీ
పోలవరం-నల్లమల సాగర్ పఽథకంతో తరలించి మూడు భాగాలుగా నిర్మాణం
సమగ్ర ప్రాజెక్టు రిపోర్ట్ కోసం టెండర్లు పిలిచిన ప్రభుత్వం
వెలిగొండ ఆయకట్టుతోపాటు ఉమ్మడి జిల్లా పరిధిలో
లక్షలాది ఎకరాలకు ఉపయుక్తం
తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు హామీ
ఆశలు రేకెత్తిస్తున్న సీఎం తాజా నిర్ణయం
కృష్ణానది వరద జలాల ఆధారంగా జిల్లాలోని పశ్చిమప్రాంత సాగు, తాగునీటి అవసరాల కోసం నిర్మిస్తున్న వెలిగొండ ప్రాజెక్టుకు గోదావరి నీరు కూడా అందనుంది. దాని ఆయకట్టుతోపాటు ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం వివిధ వనరుల కింద ఉన్న ఆయకట్టు స్థిరీకరణ, లక్షలాది ఎకరాల మెట్ట భూములకు సాగునీటి సౌకర్యం కలగనుంది. భవిష్యత్ తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు నీటి లభ్యత గ్యారెంటీ లభించనుంది. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రతిపాదించిన పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు ఇందుకు ఉపయుక్తం కానుంది. అందుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్)ను సిద్ధం చేసేందుకు టెండర్‌ను కూడా పిలవడంతో ఉమ్మడి జిల్లా ప్రజల్లో ఆశలు రేకెత్తుతున్నాయి.
ఒంగోలు, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి) : వెలిగొండకు గోదావరి జలాలు అందనున్నాయి. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టును మార్చి పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టును అమలులోకి తీసుకురావాలని సీఎం నిర్ణయించారు. దాదాపు మూడు దశాబ్దాల క్రితం వెలిగొండ ప్రాజెక్టుకు ఆనాటి, ప్రస్తుత సీఎం చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేయగా నిర్మాణం కొనసాగుతూనే ఉంది. ప్రజాప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టితో వచ్చే ఏడాది ఆగస్టుకు తొలి దశ పూర్తి చేయడమే లక్ష్యంగా పనులు సాగుతున్నాయి. అయితే వెలిగొండ ప్రాజెక్టుకు నికర జలాలు లేవు. కృష్ణానది వరద జలాల ఆధారంగా దీనిని నిర్మిస్తున్నారు. అంటే కృష్ణా నదిలో ఎగువ ప్రాంతంలో భారీవర్షాలు కురిసి వరదలు వస్తే ఆ సమయంలో వరద నీటిని వెలిగొండకు మళ్లించే విధంగా ప్రాజెక్టును రూపకల్పన చేశారు. మొత్తం 4.46 లక్షల ఎకరాల ఆయకట్టులో 3.36 లక్షల ఎకరాల ఆయకట్టు నీరు వాడుకునే వారిలో 90 శాతం మంది పశ్చిమ ప్రాంతంలోనే ఉన్నారు.
సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి
పోలవరం-నల్లమల సాగర్ (వెలిగొండ రిజర్వాయర్) ప్రాజెక్టును అమలు చేయాలని సీఎం చంద్రబాబునాయుడు ఆలోచన. దానికి అనుగుణంగా డీపీఆర్ కోసం సంబంధిత అధికారులు టెండర్లు పిలిచారు. దీంతో వెలిగొండ ప్రాంత ప్రజల్లోనే కాక మొత్తం ఉమ్మడి జిల్లా రైతులు, ప్రజానీకంలో ఆశలు రేకెత్తుతున్నాయి. తాజా ప్రతిపాదన ప్రకారం పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టును మూడు భాగాలుగా నిర్మించనున్నారు. తొలుత పోలవరం నుంచి రోజుకు 200 టీఎంసీలు గోదావరి నీటిని కాలువ ద్వారా కృష్ణానదిపై ప్రకాశం బ్యారేజీ ఎగువన ఉన్న త్రివేణి సంగమం దగ్గరకు తరలిస్తారు. రెండో భాగంలో అక్కడి నుంచి పల్నాడు జిల్లాలోని బొల్లాపల్లి ప్రాంతంలో ప్రతిపాదిత రిజర్వాయర్‌కు, మూడో భాగంలో రిజర్వాయర్ నుంచి నల్లమల సాగర్‌కు తరలిస్తారు. అలా ఏటా 200 టీఎంసీలు గోదావరి వరద నీటిని తరలించేలా దాదాపు రూ.58,700 కోట్లతో మూడు దశల్లో పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయించింది. డీపీఆర్ కోసం రూ.9.10 కోట్లతో సంబంధిత అధికారులు టెండర్లను పిలిచారు. వాటి ఖరారు, డీపీఆర్ సిద్ధం చేయడం, కేంద్రం నుంచి సాంకేతిక అనుమతులు తీసుకురావడం వంటి పనులు వచ్చే ఏప్రిల్‌కు పూర్తి చేయాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదనతో వెలిగొండ ప్రాజెక్టుకు కృష్ణానది నీరేకాక గోదావరి నీరు కూడా అందనుంది.
ప్రయోజనమిలా..
ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం సుమారు 4.42 లక్షల ఎకరాల సాగర్ ఆయకట్టు ఉంది. దీంతోపాటు 72 వేల ఎకరాలు కృష్ణా, పశ్చిమడెల్టా (కొమ్మమూరు) కాలువ ఆయకట్టు.. రాళ్లపాడు, మోపాడు, కంభం చెరువు వంటి ఐదు మధ్యతరహా ప్రాజెక్టులు, చిన్న నీటి చెరువుల కింద కలిపి మరో లక్షా 75 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందక రైతులు అవస్థలు పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని దాదాపు 2,400 ఆవాసాలలోని 40 లక్షల మంది ప్రజానీకంలో సగం మందికి తాగునీటి సౌకర్యం లేదు. వెలిగొండ ప్రాజెక్టు ఆధారంగా ఇటీవల రూ.1,290 కోట్లతో పశ్చిమప్రాంత ప్రజలకు జేజేఎం కింద భారీ రక్షిత తాగునీటి పథక నిర్మాణం చేపట్టగా రామతీర్థం, గుండ్లకమ్మ రిజర్వాయర్ల ఆధారంగా ఇతర ప్రాంతాల వారికి జేజేఎం కింద ప్రాజెక్టులు రూపకల్పన చేశారు. దొనకొండ పారిశ్రామిక కారిడార్, కనిగిరితో పాటు పశ్చిమాన సీబీజీ ప్లాంట్లు, ఎంఎస్‌ఎంఈ పార్కులు కదులుతుండగా వాటికి కూడా అదనంగా నీరు అవసరం. ఇలాంటి సమయంలో ప్రభుత్వం తాజాగా ప్రతిపాదించిన పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు ద్వారా 200 టీఎంసీల గోదావరి నీటిని తరలించే ఆలోచన ఉమ్మడి జిల్లా మొత్తానికి ఉపయుక్తం కానుంది.