మెప్మాలో ‘వేటు’ మొదలు
ABN , Publish Date - Dec 24 , 2025 | 11:01 PM
పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా)లో అవినీతికి పాల్పడిన అధికారులపై వేటు మొదలైంది. ఈ మేరకు జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీహరిని తొలగించారు.
మొదటగా పీడీ శ్రీహరిని బాధ్యతల నుంచి తొలగింపు
ఇన్‌చార్జి పీడీగా బాపట్ల పీడీ ఆనంద్ సత్యపాల్ నియామకం
మరికొందరిపై సస్పెన్షన్‌కి ఉత్తర్వులు సిద్ధమైనట్లు సమాచారం
అవినీతి ఆర్పీలు, సీవోలు, ఇతర సిబ్బందిలో కలవరం
ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్
ఒంగోలు కార్పొరేషన్, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి) : పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా)లో అవినీతికి పాల్పడిన అధికారులపై వేటు మొదలైంది. ఈ మేరకు జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీహరిని తొలగించారు. ఆయన స్థానంలో బాపట్ల జిల్లా పీడీ ఆనంద్ సత్యపాల్‌ను నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే పీడీ శ్రీహరిని సస్పెండ్ చేశారా? మాతృశాఖకు బదిలీ చేశారా? అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఆయనకు ఎలాంటి బాధ్యతలు అప్పగించకుండా గాలిలో ఉంచినట్లు సమాచారం. పొదుపు సభ్యుల పేరుతో బోగస్ గ్రూపులు తయారు చేసిన ఆర్పీల అవినీతి బాగోతంపై ఆంధ్రజ్యోతి వరుస కథనాలు ప్రచురించింది. కొందరు ఆర్పీలు బ్యాంకు అధికారులతో కుమ్మక్కై కోట్లు దోచుకున్నారు. ఒంగోలులోని మంగమూరు రోడ్‌లోని ఓ బ్యాంకు, కర్నూలు రోడ్‌లోని మరో జాతీయ బ్యాంకు, పీడీసీసీ బ్యాంకు టౌన్ బ్రాంచ్‌లలో, గాంధీరోడ్‌లోని మరో బ్యాంకు శాఖలో బోగస్ గ్రూపులతో రుణాలు తీసుకున్నట్లు సమాచారం. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీగా బోగస్ గ్రూపులతో రూ.కోట్లు దోచుకోగా, అప్పట్లో ఆంధ్రజ్యోతి వరుస కథనాలు ప్రచురించడంతో ఐదుగురు ఆర్పీలను సస్పెండ్ చేశారు. ఆ తర్వాత వారిలో కొందరిని ప్రస్తుత పీడీగా ఉన్న శ్రీహరి విధుల్లోకి తీసుకోవడంపైనా అనుమానాలు తలెత్తాయి. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మంగమూరు రోడ్‌లోని ఓ బ్యాంకులో తెలుగు మహిళలుకొందరు తమ పలుకుబడి ఉపయోగించి పలు బోగస్ గ్రూపులకు సహకరించినట్లు సమాచారం. వీటన్నిటిపై విచారణ జరిగింది. అవినీతికి పాల్పడిన ఆర్పీల నుంచి పీడీ భారీగానే వసూలు చేయడం, రుణాల మంజూరుకు లాగిన్‌లో అనుమతులు ఇవ్వకుండా బేరసారాలు చేయడాన్ని ఆంధ్రజ్యోతి బయటపెట్టింది. ఈ క్రమంలో కలెక్టర్ రాజాబాబు జేసీ గోపాలకృష్ణ చైర్మన్‌గా జడ్పీ సీఈవో చిరంజీవి, డీఆర్‌డీఏ పీడీ నారాయణలు రెండు వారాలపాటు విచారణ చేశారు. విచారణ నివేదికను కలెక్టర్‌కు అంద జేయగా, ఆయన మెప్మా ఎండీకి అందజేసినట్లు సమాచారం. మొదటగా పీడీ శ్రీహరిని బాధ్యతల నుంచి తప్పించి, సత్యపాల్‌ను ఇన్‌చార్జి పీడీగా నియమిం చారు. అవినీతిలో కీలకంగా వ్యవహరించిన ఆర్పీలు, సీవోలు, మరికొందరు సిబ్బందిపైనా సస్పెన్షన్ వేటుపడనున్నట్లు సమాచారం. అందిన సమాచారం మేరకు 15 మందిని విధుల నుంచి తొలగిస్తూ ఉత్వర్వులు సిద్ధమైనట్లు తెలిసింది.