ట్రంకురోడ్డు విస్తరణ 80 అడుగులే!
ABN , Publish Date - Sep 07 , 2025 | 02:25 AM
ఒంగోలు నగరంలో కీలకమైన ప్రధాన రహదారి ట్రంకు రోడ్డు విస్తరణ దాదాపు ఖరారైంది. నాలుగు నెలలుగా వాయిదా పడుతూ వచ్చిన ఈ అంశం ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. మాస్టర్ ప్లాన్ ప్రకారం 100 అడుగులకు విస్తరించాలని అధికారులు తొలుత భావించగా వ్యాపారుల నుంచి అభ్యంతరాలు ఎదురయ్యాయి.
12న కౌన్సిల్ సమావేశంలో ఆమోదం
హైకోర్టును ఆశ్రయించిన వ్యాపారులు
వారు అడిగినవన్నీ ఇచ్చేందుకు కార్పొషన్ అధికారులు సిద్ధం
త్వరలో పనులు ప్రారంభం
ఒంగోలు కార్పొరేషన్, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి) : ఒంగోలు నగరంలో కీలకమైన ప్రధాన రహదారి ట్రంకు రోడ్డు విస్తరణ దాదాపు ఖరారైంది. నాలుగు నెలలుగా వాయిదా పడుతూ వచ్చిన ఈ అంశం ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. మాస్టర్ ప్లాన్ ప్రకారం 100 అడుగులకు విస్తరించాలని అధికారులు తొలుత భావించగా వ్యాపారుల నుంచి అభ్యంతరాలు ఎదురయ్యాయి. వారితో అనేకసార్లు అటు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఇటు కార్పొరేషన్ అధికారులు చర్చించినా ఫలితం కన్పించలేదు. రోడ్డు విస్తరణపై తమ అభ్యంతరాలు తెలియజేస్తూ ఇటీవల వ్యాపారులు హైకోర్టును ఆశ్రయించారు. తమకు అన్యాయం జరగకుండా 2013 రీసెటిల్మెంట్ యాక్ట్ ప్రకారం న్యాయం చేయాలని కోరారు. అయితే వ్యాపారులు అడిగినవన్నీ ఇచ్చేందుకు తాము సిద్ధమని నగరల పాలక సంస్థ అధికారులు కోర్టుకు తెలియజేశారు. అందుకు అనుగుణంగా కార్పొరేషన్ అధికారులు చర్యలు చేపట్టారు. రోడ్డును 80 అడుగులకే విస్తరించాలని నిర్ణయించారు.
వ్యాపారులకు నష్టం వాటిల్లకుండా చర్యలు
ట్రంకు రోడ్డును 100 అడుగులకు విస్తరిస్తే 125 షాపులు పూర్తిగా కోల్పోనున్నారు. ప్రస్తుతం 80 అడుగులకు మాత్రమే పరిమితం చేస్తున్నందున 73 షాపులు పూర్తిగా పోయే అవకాశం ఉంది. పూర్తిస్థాయిలో షాపులు కోల్పోయిన వారికి స్థానిక పాత మార్కెట్ వద్ద కొత్తవి నిర్మించి ఇవ్వనున్నారు. వారికి నాలుగు రెట్లు టీడీఆర్ బాండ్‌లు.. 2003, 2013 బిల్డింగ్ యాక్ట్, రీసెటిల్మెంట్ ప్రకారం తొలగించిన భనాల నిర్మాణాల ఖర్చును కూడా నగరపాలక సంస్థే ఇవ్వనున్నట్లు తెలిసింది. ఒకవైపు నగర అభివృద్ధితోపాటు, మరోవైపు వ్యాపారుల ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు చర్యలు చేపట్టారు. త్వరితగతిన ట్రంకు రోడ్డు విస్తరణ చేస్తే భవిష్యత్ తరాలకు మరింత ప్రయోజనకరంగా ఉంటుందని ప్రజలు ఎదురుచూస్తున్నారు.
ఈనెల 12 కౌన్సిల్‌లో ఆమోదం?
కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో ట్రంకురోడ్డు విస్తరణ అంశం పలుమార్లు వాయిదా పడింది. అదేసమయంలో ఎమ్మెల్యే దామచర్ల కూడా స్వయంగా వ్యాపారులతో సమావేశమై సహకరించాలని, నగర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరారు. కానీ వ్యాపారుల నుంచి ఒకవైపు స్పష్టమైన నిర్ణయం రాకపోవడం, మరోవైపు కొందరు కోర్టును ఆశ్రయించడంతో వాయిదా పడింది. ఇకపై ట్రంకురోడ్డు విస్తరణ పనులు వాయిదా పడకుండా త్వరితగతిన చేపట్టేందుకు 100 అడుగులు కాకుండా 80 అడుగులకే విస్తరించేందుకు అధికారులు సిద్ధమైనట్లు తెలిసింది. ఆ ప్రతిపాదనకు ఈ నెల 12న జరిగేకార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో ఆమోద ముద్ర పడనుంది.