మెప్మా చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
ABN , Publish Date - Nov 27 , 2025 | 02:16 AM
పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)లో అవినీతికి పాల్పడిన వారి చుట్టూ ఉచ్చుబిగుస్తోంది. ఇప్పటికే పీడీ శ్రీహరి ఆధ్వర్యంలో ఏడుగురు సభ్యులతో విచారణ ప్రారంభమైంది. ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన వరుస కథనాలకు కలెక్టర్ కూడా స్పందించారు. విచారణకు కమిటీని ఏర్పాటు చేశారు.
అవినీతి, అక్రమాలపై విచారణకు జేసీ చైర్మన్‌గా కమిటీ నియామకం
సభ్యులుగా జడ్పీ సీఈవో, డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్
రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ఆదేశం
రాష్ట్ర కార్యాలయం నుంచి ఐదుగురితో మరో కమిటీని నియమించిన మిషన్ డైరెక్టర్
ఒంగోలు కార్పొరేషన్, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి) : పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)లో అవినీతికి పాల్పడిన వారి చుట్టూ ఉచ్చుబిగుస్తోంది. ఇప్పటికే పీడీ శ్రీహరి ఆధ్వర్యంలో ఏడుగురు సభ్యులతో విచారణ ప్రారంభమైంది. ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన వరుస కథనాలకు కలెక్టర్ కూడా స్పందించారు. విచారణకు కమిటీని ఏర్పాటు చేశారు. జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ చైర్మన్‌గా, డీఆర్‌డీఏ పీడీ నారాయణ, జిల్లా పరిషత్ సీఈవో చిరంజీవిని సభ్యులుగా నియమించారు. రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. మెప్మాలో కొందరు ఆర్పీలు బోగస్ గ్రూపులు సృష్టించి కోట్లు దండుకున్నారు. దీంతో బాధిత మహిళలు రోడ్డెక్కారు. ఈ బాగోతంలో ఆర్పీలతో కార్యాలయంలోని సీవోలు, సీఎంఎంలు, బ్యాంకు లింకేజీ అధికారి, బ్యాంకర్లు కుమ్మక్కైన విషయం ఆంధ్రజ్యోతి వెలుగులోకి తెచ్చింది. దీంతో స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కూడా స్పందించారు. ఒంగోలు మెప్మాలో జరిగిన అవినీతిపై విజిలెన్స్ విచారణ చేయించాలని ఆయన పురపాలక శాఖ మంత్రి నారాయణను కలిసి కోరారు. ఈనేపథ్యంలో కలెక్టర్ పి.రాజాబాబు మెప్మాలో అవినీతిపై దృష్టి సారించారు. విచారణకు కమిటీని నియమించారు.
రాష్ట్ర కార్యాలయ అధికారులతో మరో కమిటీ
మెప్మా మిషన్ డైరెక్టర్ బి.సునీల్‌కుమార్‌రెడ్డి ఒంగోలు కార్యాలయంలో చోటుచేసుకున్న బాగోతంపై రాష్ట్ర కార్యాలయంలో పనిచేస్తున్న ఐదుగురు అధికారులతో మరో కమిటీని నియమించారు. వీరు గురువారం నుంచి విచారణ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఆర్పీలతోపాటు బాధిత పొదుపు సభ్యులు ఉదయం 10.30 గంటలకు మెప్మా కార్యాలయానికి హాజరు కావాలని అధికారులు సమాచారం ఇచ్చారు. దీంతో బోగస్ గ్రూపులతో పెద్దఎత్తున గోల్‌మాల్ చేసిన ఆర్పీలతోపాటు వారికి సహకరించిన మెప్మా సిబ్బందిలో వణుకు మొదలైంది.