ఉచ్చు బిగుస్తోంది!
ABN , Publish Date - Sep 18 , 2025 | 02:23 AM
రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్నమద్యం ముడుపుల కేసు వ్యవహారం జిల్లాలోని వైసీపీ నేతల్లోనూ గుబులు రేపుతోంది. కోర్టుకు సిట్ సమర్పించిన 3వ చార్జిషీట్‌లో వైసీపీకి చెందిన దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి పేరును ప్రస్తావించింది. అందులోనే పొదిలి కేంద్రంగా నగదు పంపిణీ జరిగినట్లు, ఆమొత్తం ఒంగోలులో వైసీపీ వలంటీర్లకు అందినట్లు పేర్కొనడం ఆందోళన పెరగటానికి కారణమైంది.
మద్యం స్కాం 3వ చార్జిషీట్‌లో దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి పేరు ప్రస్తావన
పొదిలి కేంద్రంగా నగదు పంపిణీ అయినట్లు గుర్తింపు
(ఆంధ్రజ్యోతి, ఒంగోలు): రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్నమద్యం ముడుపుల కేసు వ్యవహారం జిల్లాలోని వైసీపీ నేతల్లోనూ గుబులు రేపుతోంది. కోర్టుకు సిట్ సమర్పించిన 3వ చార్జిషీట్‌లో వైసీపీకి చెందిన దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి పేరును ప్రస్తావించింది. అందులోనే పొదిలి కేంద్రంగా నగదు పంపిణీ జరిగినట్లు, ఆమొత్తం ఒంగోలులో వైసీపీ వలంటీర్లకు అందినట్లు పేర్కొనడం ఆందోళన పెరగటానికి కారణమైంది. ప్రధానంగా మద్యం ముడుపుల డబ్బు పంపిణీలో కీలకంగా ఉన్న ఏ38 చెవిరెడ్డి గత ఎన్నికల్లో ఒంగోలు లోక్‌సభ నుంచి పోటీచేసి ఉన్నారు. దీంతో ఈ వ్యవహారం జిల్లాలోని నాటి వైసీపీ అభ్యర్థుల మెడకు కూడా చుట్టుకునే అవకాశం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ ముడుపుల కేసు దర్యాప్తు చేపట్టిన సిట్ అధికారులు 3వ చార్జిషీట్‌ను రెండురోజుల క్రితం విజయవాడ ఏసీబీ కోర్టులో సమర్పించారు. అందులో ఈ అక్రమ సంపాదనను గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు అనుకూలంగా ఓట్ల కొనుగో లుకు వెచ్చించారన్న అంశాన్ని స్పష్టంగా పేర్కొన్నారు.
హైదరాబాద్ నుంచి తాడేపల్లికి అక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు డబ్బు పంపిణీ జరిగినట్లు గుర్తించారు. అందులో 38వ నిందితునిగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పాత్ర కీలకమని కూడా పేర్కొన్నారు. గత ఎన్నికల్లో చెవిరెడ్డి ఒంగోలు లోక్‌సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీచేసి క్యాంపెయిన్‌లో కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో గత ఎన్నికల ప్రచార సమయంలో ఎన్టీఆర్ జిల్లాలో పోలీసులకు దొరికిన డబ్బు ఎన్నికల అనంతరం తమవేనని ఒంగోలు ప్రాంతానికి చెందిన వ్యాపారి ప్రద్యుమ్న అధికారులకు తెలిపారు. ఆయన చెవిరెడ్డి అనుచరుడన్న విషయాన్ని తదనంతరం సిట్ అధికారులు బయటపెట్టారు. ఆ విషయంతో ఈ కేసులో జిల్లాకు సంబంధించి ఎలాంటి అంశాలు వెలుగు చూస్తాయోనన్న ఆందోళన వైసీపీ నేతల్లో గతంలోనే ఆరంభమైంది.
బూచేపల్లి పేరు ప్రస్తావనతో గుబులు
సిట్ అధికారులు కోర్టుకు సమర్పించిన 3వ చార్జిషీట్‌లో దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి పేరును ప్రస్తావించారు. అంతేగాక పొదిలి కేంద్రంగా మద్యం ముడుపుల డబ్బు ఓట్ల కొనుగోలుకు సరఫరా అయినట్లు కూడా పేర్కొన్నారు. అప్పట్లో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పొదిలి సమీపంలో తన క్యాంపు ఆఫీసును ప్రారంభించి అక్కడి నుంచే ఒంగోలు లోక్‌సభలో తన ఎన్నికల వ్యూహాన్ని నడిపిన విషయం విదితమే. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కృష్ణ వ్యాలీ అపార్ట్‌మెంట్ నివాసి, ఈ కేసులో 34వ నిందితునిగా ఉన్న వెంకటేష్‌నాయుడు నివాసం నుంచి నగదు తాడేపల్లికి చేరి అక్కడి నుంచి జిల్లాకు వచ్చినట్లుగా చార్జిషీట్‌లో పేర్కొన్నారు.
అలా వచ్చిన కొంత నగదును ఒంగోలులో వైసీసీ వలంటీర్లకు అందజేసినట్లు కూడా సిట్ స్పష్టం చేసింది. అలాగే పొదిలి కేంద్రంగా వ్యవహారం సాగినట్లు కూడా పేర్కొనటం విశేషం. 2024 ఏప్రిల్ 21, 22 తేదీలలో కేసులో 35వ నిందితునిగా ఉన్న చెవిరెడ్డి అనుచరుడు బాలాజీకుమార్ యాదవ్, చెవిరెడ్డి పొదిలిలో కలుసుకున్నట్లు పేర్కొన్నారు. అక్కడి నుంచే వివిధ నియోజకవర్గాలలో ఓటర్లను మభ్యపెట్టేందుకు ఈ మద్యం ముడుపుల డబ్బు సరఫరా జరిగిందన్న అనుమానాన్ని చార్జిషీట్‌లో వ్యక్తం చేశారు. సదరు బాలాజీకుమార్ యాదవ్ అక్కడి నుంచే దర్శి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలో ఉన్న బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డితో మాట్లాడినట్లు స్పష్టంగా పేర్కొన్నారు. మద్యం ముడుపుల డబ్బును ఓటర్లకు చేర్చే అంశాన్నే బూచేపల్లితో ఆయన చర్చించినట్లు పేర్కొన్నారు. అయితే ఏ నియోజకవర్గానికి డబ్బు పంపే అంశాన్ని మాట్లాడారనేది ఈ చార్జిషీట్‌లో స్పష్టం చేయలేదు. ఒంగోలు వచ్చిన డబ్బును వైసీపీ వలంటీర్లకు అందజేసినట్లు మాత్రమే పేర్కొన్న సిట్ అధికారులు పొదిలిలో తిష్టవేసి ఓటర్లకు అందజేసేందుకు డబ్బును పంపారని పేర్కొంటూ ఆ సమయంలో బూచేపల్లితో మాత్రమే మాట్లాడారని పేర్కొనడం విశేషం.
దృష్టిపెంచిన సిట్
ముడుపుల డబ్బు ఓట్ల కొనుగోలుకు వినియోగించడం, సరఫరా చేయడంలో కీలకంగా అనుమానిస్తున్న చెవిరెడ్డి చుట్టే దర్యాప్తు సాగుతోంది. ఆ సమయంలో ఆయన ఒంగోలు లోక్‌సభ నుంచి పోటీలో ఉండటం, ఇక్కడికే ఈ డబ్బు ఎక్కువగా వచ్చినట్లు వారు గుర్తించడం, పొదిలి నుంచి పంపిణీ జరిగినట్లుగా ప్రాథమిక ఆధారాలు లభించటంతో ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు జిల్లా వ్యవహారాలపై మరింత దృష్టి సారించినట్లు తెలిసింది. దీంతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ముఖ్యంగా ఒంగోలు లోక్‌సభ పరిధిలో చెవిరెడ్డి ద్వారా ఈ ముడుపులు ఏయే నియోజకవర్గాలకు అందాయన్న అంశంపై సిట్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిసింది.
అంతేగాక అందులో ప్రత్యక్ష పాత్ర ఎవరెవరికి ఉందన్న అంశంపై కూడా దర్యాప్తు చేపట్టారు. పొదిలి కేంద్రంగా డబ్బు పంపిణీ జరిగిందని, ఆ సందర్భంలో బూచేపల్లితో వారు సంభాషించినట్లు 3వ చార్జిషీట్‌లో పేర్కొనడంతో మున్ముందు దర్యాప్తులో మరెన్ని అంశాలు వెలుగులోకి వస్తాయనేది చర్చనీయాంశంగా మారింది. అప్పట్లో చెవిరెడ్డి ఒంగోలు లోక్‌సభ పరిధిలోని కొన్ని నియోజకవర్గాల ఎన్నికల వ్యవహారాలపై పూర్తి ఆధిపత్యాన్ని చెలాయించారు. వైపాలెంలాంటి నియోజకవర్గంలో అనేక అంశాలపై వివాదాస్పదంగా వ్యవహరించి పోలీసు కేసుల్లో కూడా ఉన్నారు. దీంతో రానున్న రోజుల్లో బూచేపల్లి వ్యవహారం ఏ మలుపు తిరుగుతుంది? అప్పట్లో పోటీచేసిన మరికొందరు వైసీపీ అభ్యర్థుల వ్యవహారం కూడా చార్జిషీట్‌లోకి ఎక్కుతుందా? అన్న అనుమానాలు వైసీపీ నేతల్లోనే కాక యావత్తు ప్రజానీకంలోనూ వ్యక్తమవుతున్నాయి.