Share News

ఉరుకులు.. పరుగులు

ABN , Publish Date - Jul 29 , 2025 | 01:31 AM

సాగునీటి అవసరాలకు సాగర్‌ జలాలొస్తున్నాయి. దీంతో ఇరిగేషన్‌ శాఖ అధికారులు ఉరుకులు, పరుగులు పెట్టాల్సి వస్తోంది. గత అనుభవాల దృష్ట్యా ఊహించిన దాని కన్నా చాలా ముందుగానే ఈ ఏడాది సాగర్‌ నీటి విడుదల జరిగింది. ఈనేపథ్యంలో కాలువల్లో చేపట్టిన పనులపై ఆ శాఖ అధికారులు గందరగోళ పడుతున్నారు.

ఉరుకులు.. పరుగులు
దర్శి డివిజన్‌లోని సాగర్‌ ప్రధాన కాలువ 101 మైలు వద్ద ఇంకా పని పెండింగ్‌లో ఉండటంతో నీరు గుండ్లకమ్మలోకి వెళ్లకుండా గేట్లు అమర్చుతున్న అధికారులు

ముందుగానే సాగర్‌ నీటి సరఫరా

ఇప్పటికే డ్యామ్‌ నుంచి విడుదల

తొలుత బుగ్గవాగుకు, అనంతరం జిల్లాలోకి..

నేడు ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత

చాలాచోట్ల సాగుతున్న కాలువల మరమ్మతులు

ప్రధానమైనవి పూర్తికి కసరత్తు

గందరగోళానికి గురవుతున్న అధికారులు

సాగునీటి అవసరాలకు సాగర్‌ జలాలొస్తున్నాయి. దీంతో ఇరిగేషన్‌ శాఖ అధికారులు ఉరుకులు, పరుగులు పెట్టాల్సి వస్తోంది. గత అనుభవాల దృష్ట్యా ఊహించిన దాని కన్నా చాలా ముందుగానే ఈ ఏడాది సాగర్‌ నీటి విడుదల జరిగింది. ఈనేపథ్యంలో కాలువల్లో చేపట్టిన పనులపై ఆ శాఖ అధికారులు గందరగోళ పడుతున్నారు. మేజర్లు, మైనర్‌ల మరమ్మతులు ఎలా ఉన్నా కనీసం ప్రధాన, బ్రాంచి కాలువల్లో పనులు అయినా పూర్తి చేయాలని చూస్తున్నారు. అయితే ఐదారు మాసాల క్రితం వచ్చిన రాష్ట్ర ప్రకృతి విపత్తుల ఫండ్‌ (ఎస్‌డీఎంఎఫ్‌) కింద చేపట్టిన పనులు తప్ప ఇటీవల ఆపరేషన్‌ అండ్‌ మెయింటినెన్స్‌ (ఓఅండ్‌ఎం) కింద మంజూరైన పనులు చేయడం సాధ్యం కాక తలపట్టుకుంటున్నారు.

ఒంగోలు, జూలై 28 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి జిల్లాలో సుమారు 4.34 లక్షల ఎకరాల ఆయకట్టు సాగర్‌ కాలువల పరిధిలో ఉంది. అందులో బాపట్ల జిల్లాలోనిది 1.71 లక్షల ఎకరాలు కాగా, మిగిలినది ప్రస్తుత ప్రకాశం జిల్లాలోనిది. ఉమ్మడి జిల్లాలో సుమారు మూడు లక్షల ఎకరాల్లో సాగర్‌ నీటి ఆధారంగా పంటలు వేస్తున్నారు. మిగిలిన లక్షా 34వేల ఎకరాలలో వర్షాధారంగానే సాగు చేస్తారు. ఏటా సాగర్‌ నీటి ఆధారంగా సాగు చేసే మూడు లక్షల ఎకరాల్లో సుమారు లక్ష ఎకరాల్లో మాగాణి, మిగిలిన రెండు లక్షల్లో ఆరుతడి పంటలు ఉంటాయి. గత ఏడాది సుమారు 2.75 లక్షల ఎకరాల్లో సాగు చేయగా 85వేల ఎకరాల్లో వరి, మిగిలిన లక్షా 90వేల ఎకరాల్లో ఆరుతడి పంటలు వేశారు. ఈ ఏడాది అంతకన్నా మించి సాగయ్యే అవకాశం ఉంది. కృష్ణా నది ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలతో వరద నీరు ఈనెల తొలిపక్షం నాటికే రాష్ట్రంలోని కీలక రిజర్వా యర్లు అయిన శ్రీశైలం, సాగర్‌లకు చేరుతుండటాన్ని గమనించిన రైతులు విస్తారంగా పంటల సాగుకు సిద్ధమవుతున్నారు.

పెండింగ్‌లో మరమ్మతు పనులు

డ్యామ్‌లలో పుష్కలంగా నీరు చేరి, సాగుకు రైతులు సిద్ధంగా ఉన్నా ఆ నీటిని పొలాలకు చేర్చే విషయంపై ఇరిగేషన్‌ శాఖ అధికారులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. అందుకు ప్రస్తుతం సాగర్‌ కాలువలకు జరుగుతున్న మర మ్మతులే కారణం. సాగర్‌ కాలువల్లో సక్రమంగా నీటి సరఫరా కోసం ఏటా పూడికతీత, జంగిల్‌ తొలగింపు, కట్టలు పటిష్టపర్చడం, తూములు, షట్టర్ల మరమ్మతులు చేస్తుండాలి. అయితే గత వైసీపీ పాలనలో ఆ పనులను పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో జిల్లాలో చాలాచోట్ల కాలువలు దెబ్బతిని అధ్వానంగా మారాయి. ఇతర జిల్లాల్లో కూడా ఇలాంటి పరిస్థితే ఉండటాన్ని గుర్తించిన కూటమి ప్రభుత్వం గత ఏడాది అక్టోబరులో ఎస్‌డీఎంఎఫ్‌ కింద కొంత మేర, ఇటీవల ఓఅండ్‌ఎం కింద మంజూరైన పనులు చాలాచోట్ల నాల్గో వంతు కూడా పూర్తి కాలేదు. కొన్ని అసలు ప్రారంభమే కాలేదు. ప్రత్యేకించి గత అక్టోబరులో ఎస్‌డీఎంఎఫ్‌ కింద జిల్లాలోని దర్శి ఈఈ పరిధిలో రూ.5కోట్లు, ఏబీసీ పరిధిలో రూ.2కోట్లు మంజూరు కాగా చీమకుర్తి డివిజన్‌ అధికారుల నిర్లక్ష్యంతో ఆ ప్రాంతానికి ఒక్క రూపాయి కూడా రాలేదు. ఆ డివిజన్‌కు ఇటీవల ఓఆండ్‌ఎం కింద రూ.5.50 కోట్లు మంజూరు చేశారు. దీంతో చీమకుర్తి డివిజన్‌లో కాలువల మరమ్మతుల పనులు చాలా పెండింగ్‌ ఉన్నాయి.

నెల ముందుగానే..

జిల్లాకు నీరు తొలుత వచ్చే దర్శి డివిజన్‌లో అధిక పనులు గతేడాది మంజూరు కావడంతో అవి మూడొంతులు పూర్తిచేశారు. నిజానికి ఏటా సాగర్‌ నీరు జిల్లాకు తాగునీటికి ఆగస్టు ఆఖరులో, సాగుకు సెప్టెంబరులో ఇస్తారు. ఈ ఏడాది కూడా అధికారులు అలాగే అడిగారు. దర్శి ప్రాంతంలో పూర్తిగా, చీమకుర్తి డివిజన్‌లో అధిక భాగం పనులు పూర్తిచేసేలా చర్యలు చేపట్టారు. అయితే ఈ ఏడాది ముందుగానే ప్రాజెక్టులు నిండటంతో వారం క్రితమే సాగర్‌ డ్యామ్‌ నుంచి కుడికాలువకు నీటిని విడుదల చేశారు. సోమవారం విడుదల పరిమాణం పెంచారు. ఆ నీరు పల్నాడు జిల్లా బుగ్గవాగుకు తొలుత చేరి నాలుగు రోజుల్లో మన జిల్లాకు వస్తుంది. అలాగే సాగర్‌ డ్యామ్‌ నిండుకుండలా ఉండటంతో ప్రాజెక్టు గేట్లను మంగళవారం ఎత్తనున్నారు. దీంతో కుడికాలువకు నీటి సరఫరా మరింత పెరుగుతుంది. తొలుత సాగర్‌ నీటితో తాగునీటి చెరువులు నింపి కొనసాగింపుగా సాగుకు కూడా వాడుకోవాలని పైస్థాయి నుంచి జిల్లా అధికారులకు సంకేతాలు వచ్చాయి. దీంతో దర్శి డివిజన్‌లో ప్రధాన కాలువల్లో ముగింపు దశలో ఉన్న పనులను త్వరగా పూర్తిచేసేలా అక్కడి అధికారులు పరుగులు తీస్తున్నారు. అయితే ఓబీసీ పరిధిలో చీమకుర్తి డివిజన్‌లో ఎక్కువ పనులు పెండింగ్‌లో ఉండటంతో ఏమి చే యాలో అర్థంకాక ఇక్కడి ఆందోళన చెందుతున్నారు. ఎగువ నుంచి వచ్చే నీటిని ఆపే అవకాశం ఉండదు కనుక అవసరం ఉన్న మేర ప్రధాన కాలువల ద్వారా తీసుకొని తొలుత రామతీర్థం నింపి తర్వాత చెరువులకు ఇచ్చే యోచన చేస్తున్నారు.

Updated Date - Jul 29 , 2025 | 01:31 AM