దిత్వా ముప్పు తప్పింది!
ABN , Publish Date - Dec 02 , 2025 | 01:57 AM
జిల్లాకు దిత్వా తుఫాన్ ముప్పుతప్పింది. చిరుజల్లులకే పరిమితమైంది. దీంతో ప్రజానీకం, అధి కార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. తుఫాన్ ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలతోపాటు పెనుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
చిరుజల్లులకే పరిమితమైన తుఫాన్
ఊపిరిపీల్చుకున్న ప్రజలు, యంత్రాంగం
మంగు వాతావరణంపై రైతుల ఆందోళన
ఒంగోలు, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి) : జిల్లాకు దిత్వా తుఫాన్ ముప్పుతప్పింది. చిరుజల్లులకే పరిమితమైంది. దీంతో ప్రజానీకం, అధి కార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. తుఫాన్ ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలతోపాటు పెనుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ప్రజలు ప్రత్యేకించి రైతులు కలవరం చెందారు. అధికార యంత్రాంగం అప్రమత్తమై నష్టనివారణ చర్యలు చేపట్టింది. జిల్లా అంతటా శనివారం రాత్రి నుంచి వాతావరణంలో మార్పు వచ్చింది. అన్ని ప్రాంతాల్లోనూ చలి తీవ్రత పెరగడంతోపాటు అక్కడ క్కడా జల్లులు కురిశాయి. ఆదివారం కూడా అలాంటి వాతావరణమే నెలకొంది. సోమవారం ఉదయానికి పరిస్థితిలో మార్పు వచ్చింది. తుఫాన్ ప్రభావం పూర్తిగా తగ్గిపోయింది. దిత్వా ముప్పు తప్పినప్ప టికీ ప్రస్తుత వాతావరణం మాత్రం ఆందోళన కరంగా ఉన్నట్లు రైతులు భావిస్తున్నారు. జిల్లా అంతటా చల్లటి వాతావరణంతో చిరుజల్లులు పడుతున్నాయి. ఇలాంటి వాతావరణమే మరో రెండు, మూడురోజులు కొనసాగే అవకాశం ఉంది. బుధవారం వరకు అక్కడక్కడా ఒక మోస్తరు జల్లులు పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఈ తరహా వాతావ రణం పంటలపై తీవ్ర ప్రతికూలత చూపనుంది. వరి, పత్తి, మిర్చి, కంది, మొక్కజొన్న, పొగాకు, శనగ ఇతరత్రా అన్ని పంటలపైనా తెగుళ్లు, పురుగుల దాడి పెరగనుంది. ఇప్పటికే అలాంటి పరిస్థితి పలుచోట్ల కనిపిస్తోంది. తాజా వాతావరణంతో మరింత అధికమవుతుం దని రైతులు ఆందోళన చెందుతున్నారు.