తీరనున్న ప్రజల దాహార్తి
ABN , Publish Date - Jul 14 , 2025 | 11:17 PM
అత్యంత కరువు పీడిత ప్రాంతం పొదిలి మండలమని చెప్తారు. తీవ్రమైన వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో చెరువులు, కుంటలు, వంకలుల, వాగులు ఒట్టిపోయాయి. భూగర్భ జలాలు అడుగంటాయి.
చిరకాల కల నెరవేరుతుండడంతో ఆనందం
తాగునీటి కష్టాలను తొలగిస్తున్న ప్రజా ప్రభుత్వం
చకచకా జరుగుతన్న పైపులైన్ నిర్మాణ పనులు
గత వైసీపీ పాలనలో సమ్మర్ స్టోరేజీ నిర్మాణంపై నిర్లక్ష్యం
పొదిలి, జూలై 14 (ఆంధ్రజ్యోతి) : అత్యంత కరువు పీడిత ప్రాంతం పొదిలి మండలమని చెప్తారు. తీవ్రమైన వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో చెరువులు, కుంటలు, వంకలుల, వాగులు ఒట్టిపోయాయి. భూగర్భ జలాలు అడుగంటాయి. కనీసం వాడుక నీటికీ ప్రజలు ఇబ్బంది పడుతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. 40ఏళ్ల కిందట ఏర్పాటు చేసిన రక్షితనీటి పథకం పెరిగిన జనాభాకు అనుకూలంగా అవసరాలు తీర్చలేకపోతోంది. దీంతో తాగునీటిని సైతం కొనుక్కొని తాగాల్సిన దుస్థితి ఏర్పడింది. పెద్దచెరువును సమ్మర్ స్టోరేజీ ట్యాంక్‌గా మార్చి దర్శి వద్ద ఉన్న సాగర్ కుడి కాలువ నుంచి పైపులైన్ ద్వారా పెద్దచెరువును నింపాలనే ప్రతిపాదనలు ఏళ్లయినా కార్యరూపం దాల్చలేదు. సాగర్ జలాలు పెద్ద చెరువులో నింపితే పొదిలి మండల ప్రజల దాహార్తి తీర్చడంతోపాటు భుగర్భ జలాలు కూడా పెరిగి వాడుక నీటికి సైతం ఇబ్బందులు ఉండవని ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో గత వైసీపీ పాలనలో రూ.50కోట్ల అంచనాతో పైపులైన్ నిర్మాణ పనులకు పానలా ఆమోదం లభించింది. ఎన్నికలకు ముందు జగన్‌రెడ్డి మార్కాపురంలో వర్చువల్ పద్ధతిలో సమ్మర్ స్టోరేజ్ ప్రాజెక్టుకు ప్రారంభ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. టెండర్ల ప్రక్రియ పూర్తి కావడంతో పనులు దక్కించుకున్న నిర్మాణ సంస్థ వెంటనే పైపులైన్ నిర్మాణ పనులు చేపట్టింది. రూ.10కోట్ల మేర పనులు చేసింది. దానికి సంబంధించి బిల్లులు చేసే సమయంలో ఆర్ధిక అనుమతులు ఇవ్వకపోవడంతో బిల్లుల చెల్లింపు నిలిచిపోయింది. కేవలం ఎన్నికల ముందు లబ్ధి కోసమే వైసీపీ నేతలు ప్రచార ఆర్భాటంగా ఈ పనులు ప్రారంభించారే తప్ప ప్రజల కష్టాలను తీర్చడానికి కాదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పనులు పూర్తికాకుండా ఏదో గొప్ప ఘనత సాధించినట్లు వైసీపీ నేతలు విజయోత్సవాలు కూడా చేసుకున్నారు. తీరా ఆర్థిక అనుమతులు లేవనే విషయం బైటకు పొక్కడంతో జగన్‌రెడ్డి ప్రారంభ డ్రామా అంతా మోసమని తెలిసిపోయింది. అంతే కాకుండా నిర్మాణ పనులు వెనువెంటనే ఆగిపోయాయి. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి సమ్మర్‌స్టోరేజీ నిర్మాణ పనులపై ప్రత్యేక దృష్టి సారించారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కాకుండా, పొదిలిలో సమ్మర్ స్టోరేజీ పనులకు ఆర్థిక అనుమతి ఇవ్వకుండా జగన్‌రెడ్డి ప్రజలను మోసగించిన తీరును ఆయన ఎండగట్టారు. అదే క్రమంలో పనులు చేపట్టి పొదిలి ప్రజల నీటి కష్టాలు తీరుస్తామని హామీ ఇచ్చిన కందుల ఆ మేరకు ఆర్థిక అనుమతులు వచ్చేలా ఎంతగానో కృషి చేశారు. ఎట్టకేలకు ప్రభుత్వం నుంచి ఆర్థిక అనుమతులు వచ్చాయి. దీంతో పైపులైన్ నిర్మాణ పనులను నిర్మాణ సంస్థ పునఃప్రారంభించింది. రాత్రింబవళ్లు పనులను భారీ యంత్రాలతో చేస్తున్నారు. పైపులైన్‌లు అమర్చే ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. ఇప్పటి వరకు 60శాతంపైగా పనులు పూర్తి అయ్యాయి. పైపులైన్ నిర్మాణ పనుల తరువాత చెరువులో ట్యాంక్ నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు నిర్మాణ సంస్థ తెలిపింది. సమ్మర్ స్టోరేజీ నిర్మాణం పూర్తి అయితే చిన్న చెరువుకు సాగర్ జలాలతో నింపుతారు. పట్టణ జనాభాతోపాటు మండలంలోని అన్ని గ్రామాలకు తాగునీరు సమృద్ధిగా అందించే వీలు కలుగుతుంది. ఎన్నోఏళ్ల కల సాకారమవుతుండడంతో మండల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.