Share News

పెనుగాలుల బీభత్సం

ABN , Publish Date - May 06 , 2025 | 11:06 PM

మండలంలో మంగళవారం సాయంత్రం వీచిన ఉరుములు, మెరుపులతో కూడిన పెనుగాలల బీభత్సానికి బొప్పాయి తోటలు నేలకొరిగాయి. దీంతో రూ.2 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కలుజువ్వలపాడు పంచాయతీలోని ఓబాయిపల్లి, లక్ష్మక్కపల్లి, కొండారెడ్డిపల్లెలో ఎక్కువుగా బొప్పా యి తోటలు నేలకొరిగాయి.

పెనుగాలుల బీభత్సం
మార్కాపురం పట్టణంలో కురుస్తున్న వాన..

నేలకొరిగిన బొప్పాయి తోటలు

రూ.2 కోట్ల మేర నష్టం

తర్లుపాడు, మే 6 (ఆంధ్రజ్యోతి) : మండలంలో మంగళవారం సాయంత్రం వీచిన ఉరుములు, మెరుపులతో కూడిన పెనుగాలల బీభత్సానికి బొప్పాయి తోటలు నేలకొరిగాయి. దీంతో రూ.2 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కలుజువ్వలపాడు పంచాయతీలోని ఓబాయిపల్లి, లక్ష్మక్కపల్లి, కొండారెడ్డిపల్లెలో ఎక్కువుగా బొప్పా యి తోటలు నేలకొరిగాయి. ఓబాయిలపల్లె గ్రామానికి చెందిన ఉడుముల శ్రీదేవి, అన్నపురెడ్డి చెంచులక్ష్మి, అన్నపురెడ్డి చిన్నమ్మ, వెన్నా వెంకటరెడ్డి, యక్కంటి వెంకట సుబ్బారెడ్డి, గంటా వెంకటేశ్వరరెడ్డి, పలువురి బొప్పాయి తోటలు నేలకొరిగాయి. ఓబాయిపల్లెలో సుమారు 60 ఎకరాలు, కొండారెడ్డిపల్లెలో 30, లక్ష్మక్కపల్లెలో 20 ఎకరాలు, దాదాపుగా 200 ఎకరాల్లో బొప్పాయి తోటలు దెబ్బతిన్నట్లు రైతులు పేర్కొన్నారు. ఆరుగాలం శ్రమించి పంట చేతికొచ్చే దశలో పెనుగాలలు, ఉరుములతో చిన్నపాటి వర్షానికి తోటలు పూర్తిగా దెబ్బతినటంతో రైతన్నలు లబోదిబోమంటున్నారు. ఎకరాకు దాదాపుగా రూ.లక్షకు పైగా పెట్టుబడి పెట్టినట్లు రైతులు తెలిపారు. దెబ్బతిన్న బొప్పాయి తోటలకు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. బొప్పాయి తోటలను ఉద్యాన శాఖ అధికారులు పరిశీలించి ప్రభుత్వం నుంచి అందేలా చర్యలు తీసుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు.

ధ్వంసమైన తోటల పరిశీలన

మార్కాపురం రూరల్‌ : మండలంలోని గజ్జలకొండ గ్రామ పరిధిలో సోమవారం సాయంత్రం వీచిన ఈదు రు గాలులకు బొప్పాయి చెట్లు ధ్వంసమయ్యాయి. ధ్వంసమైన బొప్పాయి చెట్లను మంగళవారం వ్యవసాయాధికారి శ్రీనివాసులు, ఉద్యానవన శాఖ అదికారి రమేష్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ పరిధిలో 15 మంది రైతులకు చెందిన బొప్పాయి తోట మొత్తం 38 ఎకరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని తెలిపారు. ఈదురు గాలులకు పడిపోయిన బొప్పాయి తోటలను పరిశీలించినట్లు తెలిపారు. పూర్తిగా నష్టపోయిన బొప్పాయి రైతులకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందించేందుకు వివరాలను సంబంధిత ఉన్నతాధికారులకు పంపించడం జరుగుతుందని తెలిపారు. అధికారుల వెంట గ్రామ సహాయకులు నవీన్‌, సౌజన్య, రైతులు ఉన్నారు.

Updated Date - May 06 , 2025 | 11:06 PM