దూసుకొస్తున్న దిత్వా
ABN , Publish Date - Nov 30 , 2025 | 01:17 AM
జిల్లాపై దిత్వా తుఫాన్ ప్రభావం చూపే అవకాశం ఉంది. వాతావరణ శాఖ ఆమేరకు స్పష్టంగా తెలియజేస్తోంది. తుఫాన్ వల్ల ఆది, సోమవారాల్లో ఓ మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆ ప్రభావం శనివారం నుంచే కనిపిస్తోంది. జిల్లాలో చలి తీవ్రత పెరిగింది.
నేడు, రేపు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు
ప్రభావం చూపనున్న తుఫాన్
మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరిక
ఇప్పటికే పెరిగిన చలి తీవ్రత
జిల్లాకు ఆరెంజ్ అలర్ట్
యంత్రాంగం అప్రమత్తం
ఒంగోలు, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): జిల్లాపై దిత్వా తుఫాన్ ప్రభావం చూపే అవకాశం ఉంది. వాతావరణ శాఖ ఆమేరకు స్పష్టంగా తెలియజేస్తోంది. తుఫాన్ వల్ల ఆది, సోమవారాల్లో ఓ మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆ ప్రభావం శనివారం నుంచే కనిపిస్తోంది. జిల్లాలో చలి తీవ్రత పెరిగింది. రెండు రోజుల క్రితం శ్రీలంకను ముంచెత్తిన దిత్వా తుఫాన్ ప్రస్తుతం తమిళనాడు తీరాన్ని అతలాకుతలం చేస్తోంది. శనివారం రాత్రికి చెన్నై-పుదుచ్చేరి మధ్య కేంద్రీకృతమై ఉన్న తుఫాన్ ఆదివారం తీరానికి మరింత దగ్గరగా రావచ్చని సమాచారం. అది రాష్ట్రంపై ప్రభావం చూపుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తమిళనాడుకు సమీపంలో ఉన్న తిరుపతి, నెల్లూరు జిల్లాలపై తీవ్రంగా, మన జిల్లాపై ఒక మోస్తరుగా చూపే అవకాశం ఉంది. ఈమేరకు వాతావరణ శాఖ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్‌ను జారీచేసింది. అంటే ఆది, సోమవారాల్లో జిల్లాలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచిస్తోంది. ఈ పరిస్థితుల్లో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరికలు కూడా అందాయి. తదనుగుణంగా యంత్రాంగం చర్యలకు సిద్ధమైంది. కాగా జిల్లాలో శనివారం తుఫాన్ ప్రభావం కనిపించింది. పగటిపూట వర్షం కురవకపోయినప్పటికీ చాలా ప్రాంతాల్లో చలి తీవ్రత, గాలి పెరిగింది. దిత్వా తుఫాన్ జిల్లాపై అధిక ప్రభావం చూపితే తీవ్రంగా నష్టపోతామన్న ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. చేతికి వస్తున్న దశలో ఉన్న ఖరీఫ్ పంటలు దెబ్బతినడంతోపాటు రబీ సాగు మరింత జాప్యమవుతుందని ఆందోళన చెందుతున్నారు.