Share News

పారిశుధ్యంలో అవినీతి కంపు

ABN , Publish Date - Dec 02 , 2025 | 02:00 AM

నగర పరిశుభ్రత, సుందరీకరణలో పారిశుధ్య విభాగం పాత్ర కీలకమైనది. అయితే ఆ విభాగంలోని 3వ డివిజన్‌ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ తీరుతో అవినీతి కంపుకొడుతోంది. టీ దుకాణాల నుంచి ఆసుపత్రుల వరకు వసూళ్లకు పాల్పడటంపై విమర్శలు వినిపిస్తున్నాయి.

పారిశుధ్యంలో అవినీతి కంపు
ఇన్‌స్పెక్టర్‌ బాధ్యతలు నిర్వర్తించే ప్రాంతంలో అధ్వానంగా పారిశుధ్యం

అర్హత లేకపోయినా ఆ పోస్టులో చెలామణి

టీ దుకాణాల నుంచి హాస్పిటల్స్‌ వరకూ కప్పం కట్టాలి

కార్మికులను ఏరియాలు మార్చి డబ్బులు డిమాండ్‌

ఒంగోలు కార్పొరేషన్‌ శానిటేషన్‌లో వసూల్‌ రాజా

ఒంగోలు కార్పొరేషన్‌, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి) : నగర పరిశుభ్రత, సుందరీకరణలో పారిశుధ్య విభాగం పాత్ర కీలకమైనది. అయితే ఆ విభాగంలోని 3వ డివిజన్‌ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ తీరుతో అవినీతి కంపుకొడుతోంది. టీ దుకాణాల నుంచి ఆసుపత్రుల వరకు వసూళ్లకు పాల్పడటంపై విమర్శలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి వైసీపీ హయాంలో చెత్తపై పన్ను వసూలు విధానం అమలులో ఉండగా ప్రజా ప్రభుత్వం వచ్చాక రద్దుచేసింది. కమర్షియల్‌ వేస్ట్‌ కింద ఆసుపత్రుల నుంచి మాత్రమే రూ.3వేల వరకు వసూలు చేస్తున్నారు. అందుకు సంబంధించి కచ్ఛితంగా రసీదు ఇవ్వాల్సి ఉంది. కానీఇక్కడ మూడో డివిజన్‌ శాని టరీ ఇన్‌స్పెక్టర్‌ మాత్రం అవకాశాన్నిస్వలాభానికి వాడేయడంతో ఆ డివిజన్‌ ప్రజలు అల్లాడిపోతు న్నారు. గతంలో అనేక ఆరోపణలు ఎదుర్కొన్నప్పటికీ పాలకవర్గంలోని ఓ పెద్ద ఆశీస్సులతో ఆయన బరితెగిస్తున్నారు. శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ అర్హత లేకపోయినా ఆయనకు ఆ పోస్టు ఇవ్వడంపై ఇప్పటికే ఆరోపణలు ఉన్నప్పటికీ చర్యలు కరువయ్యాయి. గతంలో ఆయన పనితీరు, అవినీతి బాగోతంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కమిషనరు వెంకటేశ్వరరావు పలుమార్లు హెచ్చరికలు జారీ చేశారు. మూడుసార్లు మెమోలు ఇచ్చారు. అయినప్పటికీ ఆయన తీరు మారకపోవడం, ప్రత్యేకించి పారిశుధ్యం మెరుగు కన్నా పైసలు వసూళ్లపైనే దృష్టి సారించడం ఇప్పడు శానిటేషన్‌ విభాగంలోనూ చర్చనీయాంశమైంది.

ఆయన రూటే సప‘రేటు’

మంగమూరురోడ్డు, బాలాజీనగర్‌, నిర్మల్‌నగర్‌, లాయర్‌పేట, గద్దలగుంట, అంజయ్య రోడ్‌, లాయర్‌పేట ఎక్స్‌టెన్షన్‌, వీఐపీ రోడ్డు, మామిడిపాలెం, కొణిజేడు బస్టాండ్‌, రాజాపానగల్‌ రోడు, గాంధీరోడ్‌, పప్పుబజారు శానిటేషన్‌ బాధ్యలు చూస్తున్న ఇన్‌స్పెక్టర్‌, ఆయనతోపాటు మరో శానిటరీ సెక్రటరీ తీరుతో ఆయా ప్రాంతాల ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. రోడ్డుపై కాగితం తీయాలన్నా కాసులు ముట్టజెప్పాల్సి వస్తోంది. ప్రతిరోజూ మరుగు కాలువల్లో పూడికతీసి, ఆ తర్వాత వాటిని తొలగించాల్సిన బాధ్యత శానిటరీ సిబ్బందిపైన ఉంది. కానీ కాలువల్లో పూడిక మాత్రమే తొలగించి, ఆతర్వాత చెత్తను తీయడానికి డబ్బులు డిమాండ్‌ చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. స్థానిక గాంధీ రోడ్‌లోని ఇందిరాగాంధీ బొమ్మ ఎదురు వీధిలో పది రోజులు క్రితం కాలువ పనులు చేపట్టారు. ఆ క్రమంలో కొన్ని తాగునీటి పైపులు దెబ్బతిన్నాయి. దీంతో పది రోజులుగా ఆ ప్రాంతంలోని నివాసాలకు మురుగునీరు సరఫరా అవుతోంది. మరోవైపు కాలువల్లోని మురుగునీరు రోడ్లపైన పారుతోంది. ఆ విషయాన్ని పలువురు సదరు ఇన్‌స్పెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లగా.. ఆ పని మాది కాదు, ఇంజనీరింగ్‌ వారికి చెప్పుకోవాలంటూ దురుసుగా మాట్లాడినట్లు సమాచారం. ఇదిలాఉండగా పాలకవర్గంలో ముఖ్యులైన డిప్యూటీ మేయర్‌ షాపు ముందు చెత్త ఉందంటూ చిర్రుబుర్రులాడి ఏకంగా రూ.200 పెనాల్టీ విధించి తన ప్రతాపాన్ని ప్రదర్శించారు. గాంధీ రోడ్డులోని ఓ స్వీటు దుకాణంలో కవర్లు ఉన్నాయంటూ దాడులు చేశారు. షాపు యజమాని ప్రభుత్వ నిబంధనలకు లోబడి మాత్రమే కవర్లు వినియోగిస్తున్నామని చెప్పినా వినిపించుకోకుండా బెదిరింపులకు పాల్పడటంపై షాపు యజమానులు అసహనం వ్యక్తం చేశారు. ఆయనంటే దుకాణదారులు హడలిపోతున్నారు.

గతంలోనూ అవినీతి ఆరోపణలు

చెత్తపై సంపాదనకు అలవాటుపడిన సదరు శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ గత వైసీపీ హయాంలో ఆ పార్టీతో అంటకాగారు. కనీస విద్యార్హత లేకపోయినా ఆయనకు శానిటరీ ఇన్‌స్పెక్టర్‌గా పోస్టింగ్‌ ఇచ్చారు. ప్రజా ప్రభుత్వం వచ్చాక పాలకవర్గ పెద్ద ఆశీస్సులతో తిరిగి అదేపోస్టులో నియమితులైన ఆయన తన ప్రవర్తనను మార్చుకోలేదు. వసూళ్లపర్వం ఆపలేదు. దీంతో పలుమార్లు ఫిర్యాదులు రావడం, విచారణలో అవన్నీ వాస్తవాలని తెలియడంతో కమిషనర్‌ ఆ ఇన్‌స్పె క్టర్‌కు డంపింగ్‌ యార్డు వద్ద పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. అయితే ఏమైందో ఏమో రెండు, మూడు రోజుల్లోనే ఆయన తిరిగి డివిజన్‌ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌గా విధుల్లో చేరారు.

ఎమ్మెల్యే చెప్పారంటూ. ఏరియాలు మార్పు

గతంలో మహిళలను వేధించడం, దుకాణాల వద్ద వసూళ్లకు పాల్పడటం, యూజర్‌ చార్జీలు తొలగించినా ఇంకా చెత్తపైన పన్ను విధించడం ఆయనకు అలవాటుగా మారింది. ఈ ఆరోపణలతో పలుమార్లు అధికారుల ఆగ్రహానికి గురైన ఆయన తాజాగా ఎమ్మెల్యే పేరుతో సిబ్బందినే బెదిరిస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి నగరంలో ఏ డివిజన్‌లోనూ కార్మికులకు స్థానమార్పిడి జరగలేదు. కానీ ఈ ఇన్‌స్పెక్టర్‌ మాత్రం గతంలో పనిచేస్తున్న వారిని ఇతర ఏరియాలకు మారుస్తున్నారు. అదేమని అడిగితే కీలక ప్రజాప్రతినిధి చెప్పారు అని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం. అదేసమయంలో ఆయనకు ఎలాగోలా చెబుతాను. ఎంతో కొంత డబ్బులు నాకు ఇవ్వండి అంటూ వసూలు చేస్తున్నట్లు కొందరు కార్మికులు ఆరోపిస్తున్నారు. దీంతో ఆ ఇన్‌స్పెక్టర్‌ వద్ద పనిచేయలేమంటూ వారు గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఇప్పటికైనా ఆయన తీరుపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కార్పొరేషన్‌ అధికారులపై ఉంది.

Updated Date - Dec 02 , 2025 | 02:00 AM