రహదారి అద్దంలా.. మార్జిన్ అధ్వానంగా!
ABN , Publish Date - Sep 03 , 2025 | 01:13 AM
: నిత్యం వందలాది గ్రానైట్ లారీలు తిరిగే చెన్నుపల్లి-అనంతవరం రోడ్డు మార్జిన్ కష్టాలతో వాహనచోదకులను అవస్థలపాలు చేస్తోంది.
బల్లికురవ, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): నిత్యం వందలాది గ్రానైట్ లారీలు తిరిగే చెన్నుపల్లి-అనంతవరం రోడ్డు మార్జిన్ కష్టాలతో వాహనచోదకులను అవస్థలపాలు చేస్తోంది. రోడ్డు మాత్రం బాగున్నా మార్జిన్ మాత్రం గోతులతో నిండి ఉంది. దీంతో నిత్యం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బల్లికురవ మండల పరిధిలోని చెన్నుపల్లి అనంతవరం అర్‌అండ్‌బీ రోడ్డులో ఉన్న వేమవరం, మురికిపూడి, తాతపూడి గ్రామాల మధ్య తారు రోడ్డు బాగున్న సైడు మార్జిన్ మాత్రం అధ్వానంగా తయారైంది. ఈ రోడ్డుపై నిత్యం వందలాది గ్రానైట్ వాహనాలు, నేషనల్ హైవేకు వెళుతుంటాయి. ఈ రహదారిని గతంలోనే కొంత భాగం డబుల్ రోడ్డుగా అభివృద్ధి చేయగా మరికొంత భాగంలో ఉన్న సింగిల్ రోడ్డుకు పూర్తిస్థాయిలో తారు వేశారు. రోడ్డు అభివృద్ధి పరిచినా మార్జిన్‌లను చేపట్టలేదు. దీంతో వాహనాలు రోడ్డు దిగితే దిగబడి పోతున్నాయి. చిన్నపాటి వర్షం కురిసినా వాహనాలు రాకపోకలు నిలిచి పోతున్నాయి. ఎదురెదురుగా రెండు వాహనాలు వస్తే వాహనచోదకులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. లోడుతో వెళ్లే వాహనాలు సైడుకు దిగే వీలు లేకపోవటంతో ప్రమాదాల బారిన పడుతున్నాయి. ఈ రోడ్డులో కొందరు రైతులు తమ పంట పొలాల్లోని నల్ల మట్టిని రోడ్డు మార్జిన్‌లో కట్టలా వేయటంతో వర్షాలు కురిస్తే రోడ్డు మెత్త బురదమయం అవుతోంది. వేమవరం గ్రామంలో ఉన్న గ్రానైట్ ఫ్యాక్టరీల నుంచి వెళ్లే వాహనాలు ప్రతిరోజూ రోడ్డు మార్జిన్‌లో కురుకుపోతున్నాయి. సంబంధిత అధికారులు వెంటనే వేమవరం నుంచి తాతపూడి వరకు ఉన్న రోడ్డు మార్జిన్‌లను అభివృద్ధి పరచాలని వాహనదారులు కోరుతున్నారు.