రగడ.. రాద్ధాంతం
ABN , Publish Date - Sep 10 , 2025 | 01:37 AM
ఒంగోలులో వినాయక విగ్రహ నిమజ్జన ఊరేగింపులో పోలీసులపై వైసీపీ మూక దాడి వ్యవహారం సరికొత్త మలుపు తిరిగింది. అది చివరకు పోలీసులు వర్సెస్ లాయర్ల మధ్య వివాదంలా మారింది. ఆదివారం వినాయక విగ్రహం ఊరేగింపు సందర్భంగా కర్నూల్ రోడ్డు ప్లైఓవర్ వద్ద విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ ఎస్సై, కానిస్టేబుల్‌పై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు.
నిమజ్జన ఊరేగింపులో పోలీసులపై వైసీపీ మూకల దాడి
ఆపై డీఎస్పీ ఆఫీసులో హోంగార్డుపై దౌర్జన్యం
చుండూరి రవితోపాటు ముగ్గురు లాయర్లపై కేసు
కోర్టు విధులను బహిష్కరించి నిరసనకు సిద్ధం
పోలీసులు, న్యాయవాదుల మధ్య కోల్డ్‌వార్
ఒంగోలు క్రైం, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి) : ఒంగోలులో వినాయక విగ్రహ నిమజ్జన ఊరేగింపులో పోలీసులపై వైసీపీ మూక దాడి వ్యవహారం సరికొత్త మలుపు తిరిగింది. అది చివరకు పోలీసులు వర్సెస్ లాయర్ల మధ్య వివాదంలా మారింది. ఆదివారం వినాయక విగ్రహం ఊరేగింపు సందర్భంగా కర్నూల్ రోడ్డు ప్లైఓవర్ వద్ద విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ ఎస్సై, కానిస్టేబుల్‌పై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకొన్న నేపథ్యంలో వైసీపీ ఒంగోలు నియో జకవర్గ ఇన్‌చార్జి చుండూరి రవితోపాటు ముగ్గురు న్యాయవాదులు డీఎస్పీ కార్యాల యానికి వెళ్లారు. కార్యాలయం గేటు నెట్టుకుంటూ అడ్డువచ్చిన హోంగార్డుపై దౌర్జన్యం చేశారు. వెంటనే డీఎస్పీ కల్పించుకుని సీరియస్ కావడంతో వెనక్కి తగ్గారు. కాగా పోలీసు విధులను అటంకపరిచి హోంగార్డుపై దౌర్జన్యం చేసిన విషయమై ఒంగోలు టూటౌన్ పోలీసు స్టేషన్‌లో చుండూరి రవితోపాటు ముగ్గురు న్యాయవాదులపై కేసు నమోదు చేశారు. దీంతో మంగళవారం ఒంగోలు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించి నగరంలో ర్యాలీ చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే బార్ అసోసియేషన్ నేతలు కల్పించుకుని జిల్లా ప్రధాన న్యాయాధికారి భారతితో మాట్లాడదామని చెప్పారు. ఒంగోలు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బొడ్డు భాస్కరరావు నేతృత్వంలో జిల్లా న్యాయాధికారిని కలిసి వినతిపత్రం అందజేశారు. న్యాయవాదులపై పెట్టిన కేసులను ఎత్తివేయించాలని కోరారు. దీంతో ఒంగోలు డీఎస్పీ ఆర్.శ్రీనివాసరావును పిలిపించి లాయర్లపై నమోదు చేసిన కేసుల గురించి జిల్లా న్యాయాధికారి భారతి చర్చించారు. ఈ సందర్భంగా కేసు నమోదు చేయాల్సిన పరిస్థితులను డీఎస్పీ వివరించినట్లు తెలిసింది. అయితే లాయర్లపై నమోదైన కేసులో ఒంగోలు టూటౌన్ పోలీసులు 41 సీఆర్పీసీ ప్రకారం నోటీసులు కూడా జారీ చేశారు.
పోలీసులపై దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసు
ట్రాఫిక్ ఎస్సై, కానిస్టేబుల్‌పై దాడిచేసిన వైసీపీ కార్యకర్తలపై ఒంగోలు తాలూకా పోలీసు స్టేషన్‌లో హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ దాడికి పాల్పడిన స్థానిక కూచిపూడి వీధికి చెందిన 13 మందిని పోలీసులు గుర్తించి వారిలో ఏడుగురిని అరెస్టు చేశారు. వారిని న్యాయాధికారి ఎదుట సోమవారం హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారు. మరో 50 మందికిపైగా దాడిలో పాల్గొన్నట్లు పోలీసులు తేల్చారు.