కదంతొక్కిన ఎర్రదండు
ABN , Publish Date - Aug 24 , 2025 | 01:40 AM
ఒంగోలులో మూడు రోజులపాటు జరుగుతున్న సీపీఐ 28వ రాష్ట్ర మహాసభలు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆపార్టీ శ్రేణులు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించాయి. జిల్లాతోపాటు రాష్ట్రవ్యాప్తంగా తరలి వచ్చిన వేలాది మంది శనివారం మధ్యాహ్నానికే నగరానికి చేరుకున్నారు.
ఉత్సాహంగా సీపీఐ 28వ రాష్ట్ర మహాసభలు ప్రారంభం
ఎరుపెక్కిన ఒంగోలు
ఆకర్షణీయంగా కళాకారుల ప్రదర్శనలు
రెడ్ షర్ట్‌లతో వలంటీర్ల క్రమశిక్షణ
నగర ప్రజలను ఆకర్షించిన ర్యాలీ
అగ్రభాగాన నిలిచిన రాష్ట్ర నేతలు
సురవరం మృతితో అగ్రనేత రాజా పర్యటన రద్దు
మతోన్మాద పార్టీలను నిలువరించేందుకు ఉద్యమించాలని పిలుపు
ఎర్రజెండా రెపరెపలతో ఒంగోలు ఎరుపెక్కింది. సీపీఐ రాష్ట్ర మహాసభల సందర్భంగా వేలాది మంది ఆ పార్టీ శ్రేణులు నగరంలో కదం తొక్కాయి. ఎర్రజెండాలు చేబూని డప్పు నృత్యాలు, కోలాటాలు, కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలతో ఒకవైపు.. క్రమశిక్షణతో యువ కమ్యూనిస్టు కార్యకర్తలు జెండాలు చేతపట్టి చేసిన మార్చ్‌ఫాస్టుతో మరోవైపు నగరం హోరెత్తింది.
ఒంగోలు, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి) : ఒంగోలులో మూడు రోజులపాటు జరుగుతున్న సీపీఐ 28వ రాష్ట్ర మహాసభలు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆపార్టీ శ్రేణులు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించాయి. జిల్లాతోపాటు రాష్ట్రవ్యాప్తంగా తరలి వచ్చిన వేలాది మంది శనివారం మధ్యాహ్నానికే నగరానికి చేరుకున్నారు. స్థానిక నెల్లూరు బస్టాండ్ సెంటర్‌లోని మునిసిపల్ గ్రౌండ్స్ నుంచి మధ్యాహ్నం మూడున్నర గంటలకు ర్యాలీ ప్రారంభమైంది. కలెక్టరేట్, చర్చి సెంటర్, ట్రంకురోడ్డు, పాత మార్కెట్, బాపూజీ కాంప్లెక్స్, అద్దంకి బస్టాండు, కర్నూలు రోడ్డు కూరగాయాల మార్కెట్ మీదుగా సాగింది. ముందు భాగాన కళాకారుల నృత్యాలు, 28వ రాష్ట్ర మహాసభలకు సూచికగా 28 మంది యువ కమ్యూనిస్టులు జెండాలు చేబూనగా వందలాది మంది మహిళలు సీపీఐ జెండాలు, ఎర్ర గొడుగులతో వారిని అనుసరించారు. ఆ వెనుక ప్రముఖులు బ్యానర్ పట్టుకొని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ, రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, ఇతర ముఖ్య నేతలు రావుల వెంకయ్య, ముప్పాళ్ల నాగేశ్వరరావు, సత్యనారాయణమూర్తి, జల్లి విల్సన్, జి.ఈశ్వరయ్య, అక్కినేని వనజ, సినీనటుడు మాదాల రవి, జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ తదితరులు నడిచారు. వారి వెనుక వివిధ జిల్లాల నుంచి వచ్చిన వేలాది మంది ర్యాలీలో సాగారు. దాదాపు గంటన్నరపాటు సాగిన ర్యాలీ నగరవాసులను విశేషంగా ఆకర్షించింది. ఇటీవల కాలంలో ఈ స్థాయిలో కమ్యూనిస్టులు ర్యాలీ నిర్వహించిన పరిస్థితి లేకపోగా నగర ప్రజల్లో ఇంతమంది కమ్యూనిస్టు కార్యకర్తలు ఉన్నారా? అన్న చర్చ సాగింది. కాగా ర్యాలీ అనంతరం కొత్త మార్కెట్ సమీపంలోని మైదానంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అధ్యక్షతన భారీ బహిరంగ సభ నిర్వహించారు.
సురవరం సుధాకర్‌రెడ్డికి నివాళులు
పార్టీ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ, జాతీయ కార్యవర్గసభ్యులు, అఖిల భారత రైతు సంఘం ప్రధాన కార్యదర్శి రావుల వెంకయ్య, అక్కినేని వనజ, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మాట్లాడుతూ దేశంలో మతోన్మాద శక్తులను అడ్డుకునేందుకు కమ్యూనిస్టు కార్యకర్తలు పోరాడాలని పిలుపునిచ్చారు. ఇదిలాఉండగా పూర్వపు ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి శుక్రవారం రాత్రి ఆకస్మికంగా మృతిచెందడంతో కొంత విషాదంలో ఆ పార్టీశ్రేణులు ఉన్నప్పటికి ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. బహిరంగ సభలో పాల్గొనాల్సిన సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా పర్యటన మాత్రం రద్దయింది. బహిరంగ సభలో ఆయన ముఖ్యఅతిఽథిగా పాల్గొనాల్సి ఉండగా సురవరం మృతితో హైదరాబాద్‌లోనే రాజా ఆగిపోయారు. కాగా సురవరం మృతికి బహిరంగ సభావేదికపై నుంచి నేతలు శ్రద్ధాంజలి ఘటించారు. సురవరం చిత్రపటానికి డాక్టర్ కె.నారాయణ, ఇతర ముఖ్యనేతలు పూలమాలలు వేసి నివాళులర్పించగా సభకు హాజరైన వేలాదిమంది రెడ్ సెల్యూట్ అంటూ నినదించారు. ఆది, సోమవారాల్లో నగర పరిధిలోని ఎస్‌జీవీఎస్ ఫంక్షన్ హాలులో సీపీఐ ప్రతినిధుల సభలు జరగనున్నాయి. ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షుడు చంద్రనాయక్ నేతృత్వంలో వివిధ ప్రాంతాలకు చెందిన కళాకారులు ఆలపించిన విప్లవ గీతాలు ఉత్తేజపరిచాయి.