మహానాడుకు కదులుతున్న శ్రేణులు
ABN , Publish Date - May 25 , 2025 | 11:12 PM
కడపలో జరగనున్న తెలుగుదేశం పార్టీ మహానాడుకు జిల్లా నుంచి ఆపార్టీ శ్రేణులు పెద్దఎత్తున తరలివెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈనెల 27నుంచి 29 వరకూ మూడు రోజులపాటు మహానాడు నిర్వహిస్తున్న విషయం విదితమే.
నేటి రాత్రికే కడప చేరుకోనున్న ముఖ్యనేతలు
ఇప్పటికే అక్కడ ఏర్పాట్లలో కొందరు
ముగింపు రోజున బహిరంగ సభకు
పశ్చిమం నుంచి భారీగా సమీకరణ
ఒంగోలు, మే 25 (ఆంధ్రజ్యోతి) : కడపలో జరగనున్న తెలుగుదేశం పార్టీ మహానాడుకు జిల్లా నుంచి ఆపార్టీ శ్రేణులు పెద్దఎత్తున తరలివెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈనెల 27నుంచి 29 వరకూ మూడు రోజులపాటు మహానాడు నిర్వహిస్తున్న విషయం విదితమే. తొలి రెండు రోజులు ప్రతినిధుల సభ, మూడోరోజైన ఈనెల 29న ముగింపు సందర్భంగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు. సాధారణంగా మహానాడు ఎక్కడ జరిగినా టీడీపీ శ్రేణులు జిల్లా నుంచి పెద్దసంఖ్యలోనే హాజరవుతుంటారు. ఈసారి కడపలో ఏర్పాటు చేయడంతో మరింత ఎక్కువ సంఖ్యలో వెళ్లనున్నారు.
ఏర్పాట్లలో జిల్లా నేతలు
తొలి రెండు రోజులు జరిగే ప్రతినిధుల సభకు నియోజకవర్గ, మండల స్థాయి ముఖ్య నాయకులు హాజరు కావాల్సి ఉంది. దీంతో ఎమ్మెల్యేలు, ఆయా నియోజకవర్గాల ఇన్‌చార్జిలు, ఇతర ముఖ్య నాయకులు సోమవారం రాత్రికే కడప నగరానికి చేరుకోనున్నారు. మరోవైపు మహానాడు నిర్వహణకు 19 కమిటీలను ఏర్పాటు చేసిన టీడీపీ అధిష్ఠానం... వాటిలో జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులను నియమించింది. దీంతో ఆ బాధ్యతల్లో ఉన్న కొందరు కడప చేరి ఆయా పనుల్లో నిమగ్నమయ్యారు. జిల్లాకు చెందిన యువనేత, మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్యను రెండు కమిటీల్లో నియమించగా నాలుగైదు రోజులుగా అక్కడే ఉండి ఏర్పాట్లలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. కనిగిరి, గిద్దలూరు శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, ముత్తుముల అశోక్‌రెడ్డి సోమవారం ఉమ్మడి జిల్లాకు చెందిన రాష్ట్రమంత్రి గొట్టిపాటి రవికుమార్‌తో కలిసి కడపలోని ఏర్పాట్లలో పాల్గొన్నారు.
భారీగా జన సమీకరణ
మహానాడు ముగింపు రోజైన 29వ తేదీన కడప శివారులో భారీ బహిరంగ సభను టీడీపీ నిర్వహిస్తోంది. దానికి కూడా జిల్లా నుంచి పార్టీ శ్రేణులు భారీగానే తరలి వెళ్లనున్నారు. కడప జిల్లాకు సమీప ప్రాంతాలుగా జిల్లాలోని కనిగిరి, గిద్దలూరు నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ నియోజకవర్గాలతోపాటు అక్కడికి దగ్గరగా ఉండే మార్కాపురం, వైపాలెం, దర్శిల నుంచి కూడా బహిరంగ సభకు భారీగానే జనసమీకరణ జరుగుతోంది. సగటున ఒక్కో నియోజకవర్గం నుంచి 5 వేల నుంచి 7వేల మంది వరకూ బహిరంగ సభకు వెళ్లేలా వాహనాలు, ఇతర ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. తూర్పుప్రాంతంలో ఉన్న ఒంగోలు, కొండపి, సంతనూతలపాడు నియోజకవర్గాల నుంచి ప్రతినిఽధుల సభకు ఒక్కో మండలం నుంచి ఒక బస్సును నాయకులు ఏర్పాటు చేశారు. మరికొందరు సొంత వాహనాల్లో తరలివెళ్లనున్నారు. చివరి రోజు సభకు కూడా ఈ ప్రాంతం నుంచి పెద్ద సంఖ్యలోనే వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.