తెరపిచ్చిన వర్షం
ABN , Publish Date - May 21 , 2025 | 01:04 AM
జిల్లాలో మూడు రోజులపాటు కురిసిన వర్షం మంగళ వారం తెరపి ఇచ్చింది. వారం రోజులుగా అక్కడక్కడ అడపాదడపా జల్లులు పడుతుండగా శుక్రవారం రాత్రి నుంచి ఒక మోస్తరు నుంచి భారీగానే వాన కురిసింది. తూర్పు, దక్షిణ ప్రాంతంలో ప్రభావం అధికంగా ఉంది.
మూడు రోజుల్లో 21.0 మి.మీ సగటు వర్షపాతం
తూర్పు, దక్షిణ ప్రాంతంలో భారీగానే కురిసిన వాన
సగం పంచాయతీల్లో నిలిచిన ఉపాధి పనులు
ఒంగోలు, మే 20 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో మూడు రోజులపాటు కురిసిన వర్షం మంగళ వారం తెరపి ఇచ్చింది. వారం రోజులుగా అక్కడక్కడ అడపాదడపా జల్లులు పడుతుండగా శుక్రవారం రాత్రి నుంచి ఒక మోస్తరు నుంచి భారీగానే వాన కురిసింది. తూర్పు, దక్షిణ ప్రాంతంలో ప్రభావం అధికంగా ఉంది. శుక్రవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు మూడు రోజుల వ్యవధిలో 21.0 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. ఒంగోలు, కొత్తపట్నం, కొండపి, సింగరాయకొండ, టంగుటూరు, జరుగుమల్లి, సంతనూతలపాడు, చీమకుర్తిలలో భారీవర్షం కురిసింది. దర్శి, కనిగిరి నియోజకవర్గాల్లోని పలుచోట్ల ఒక మోస్తరుగా పడింది. తూర్పు, దక్షిణ ప్రాంతంలో మంగళవారం ఉదయానికి 24 గంటల వ్యవధిలో అధికంగానే వర్షం కురిసింది. జిల్లాలో ఈ సమయంలో సగటున 7.0 మి.మీ వర్షపాతం నమోదు కాగా కొండపి మండలంలో 52.8, కొత్తపట్నంలో 32.6, జరుగుమల్లిలో 17.20, ఎస్‌ఎన్‌పాడులో 16.4, తాళ్లూరులో 14.8, ఒంగోలులో 14.8, పొన్నలూరులో 13.4, ఎన్‌జీపాడులో 13.0, మద్దిపాడులో 11.8, సింగరాయకొండలో 11.60 మి.మీ నమోదైంది.
చల్లబడిన వాతావరణం
ఒంగోలు, కొండపి, సంతనూతలపాడు నియోజకవర్గాల్లోని పలు మండలాల్లో ఈ మూడు రోజుల్లో భారీ వర్షమే పడింది. అది కూడా ముసుర పట్టి కురవడంతో సాధారణ జనజీవనానికి తీవ్ర ఆటంకం ఏర్పడింది. అయితే మంగళవారం పగటిపూట వర్షం తెరపివ్వడంతోపాటు రోజంతా మబ్బులు పట్టి ఉన్నాయి. దీంతో వర్షం లేకుండా వాతావరణం చల్లగా ఉండటంతో ప్రజానీకం ఊరట చెందింది. రోజువారీ పనులు సాఫీగా సాగాయి. అయితే ముమ్మరంగా సాగుతున్న ఉపాధి హామీ పథకం పనులకు మాత్రం తీవ్ర ఆటంకం కలిగింది. జిల్లాలో 729 గ్రామ పంచాయతీల్లో రోజువారీ 2.20 లక్షల మంది కూలీలు పనులకు వస్తుండగా మూడు రోజులు ముసురుపట్టిన వర్షాలతో పనులు ఆగాయి. మంగళవారం కూడా జిల్లాలో ఇంచుమించు సగం పంచాయతీల్లో పనులు నిలిచిపోయాయి. అధికారవర్గాల సమాచారం ప్రకారం జిల్లాలో మంగళవారం 384 పంచాయతీల్లో లక్షా 14వేల మంది మాత్రమే కూలీలు హాజరు కాగా 345 పంచాయతీల్లో పనులు నిలిచిపోయాయి.