వాన కురిసే.. కాడి కదిలే
ABN , Publish Date - Aug 31 , 2025 | 12:02 AM
ప్రుస్తుతం కురుస్తున్న వర్షాలకు భూములు పదు నెక్కడంతో మండలంలోని రైతులు కాడి మేడి పట్టి సేద్యం పనులు ముమ్మరం చేశారు. ఇప్పటికే పలువురు రైతులు సొంత భూముల్లో మిరప నార్లు పోసుకున్నారు. కొందరు షేడ్ నెట్లలో నార్లు పోయించారు.
ముమ్మరంగా వ్యవసాయ పనులు
విస్తృతంగా మిర్చి సాగు
మరో వైపు పత్తి తీత
తెరపి ఇవ్వగానే అపరాలకు సిద్ధం
పెద్ద దోర్నాల, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి) : ప్రుస్తుతం కురుస్తున్న వర్షాలకు భూములు పదు నెక్కడంతో మండలంలోని రైతులు కాడి మేడి పట్టి సేద్యం పనులు ముమ్మరం చేశారు. ఇప్పటికే పలువురు రైతులు సొంత భూముల్లో మిరప నార్లు పోసుకున్నారు. కొందరు షేడ్ నెట్లలో నార్లు పోయించారు. 40 రోజులు దాటడంతో ప్రధాన పొలంలో నాటేందుకు సిద్ధమయ్యారు. నిన్న, మొన్నటి వరకు వర్షాలు లేక రైతులు దిగాలు పడ్డారు. నారు ఏతకు వచ్చినా వర్షాలు కురవలేదు. బోరుబావుల్లో నీరు అడుగంటింది. ఏమి చేయాలో పాలు పోలేదు. సొంత భూముల్లో నార్లు పెంచిన రైతులు మరి కొన్నిరోజులు వేచి చూసే అవకాశం ఉంది. కానీ షేడ్ నెట్లలో పెంచిన నారు 45 రోజులు దాటితే యజమానులు నారు పోషణ చర్యలు పట్టించుకోరు.దీంతో చాలా మంది రైతులు ఆందోళన చెందారు. ఈలోగా వర్షాలు కురవడంతో నాట్లు వేస్తున్నారు.దీంతో కూలీలకు కూడా పనులు లభించడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరో ప్రక్క వేసవిలో, జూన్‌లో సాగు చేసిన పత్తి తీతలకు వచ్చింది. దాంతో వ్యవసాయ పనులు ఊపందకున్నాయి. ఇప్పటికైతే ఆలస్యంగా ఖరీఫ్ సీజను పూర్తి స్థాయిలో సాగు అవుతుంది. మండలంలో 700 ఎకరాల్లో పత్తి సాగవగా, 3,500ఎకరాల్లో మిరప సాగయ్యే అవకా శం ఉందని రైతులు చెప్తున్నారు. మినుము 600ఎకరాలు, మొక్కజొన్న 800, ఆముదం 400, జొన్న 500 ఎక రాలు, శనగ 100ఎకరాల్లో సాగయ్యే అవకాశం ఉంది.