ధర మాయ!
ABN , Publish Date - Sep 24 , 2025 | 01:38 AM
పొగాకు మార్కెట్‌లో వ్యాపారులు మాయాజాలం ప్రదర్శిస్తున్నారు. నిన్నమొన్నటి వరకూ ధరలు దిగ్గోసి రైతులను దగా చేసిన వారు ఇప్పుడు సరికొత్త ఎత్తుగడ వేస్తున్నారు. రానున్న సీజన్‌లో పొగాకు సాగును పెంచే విధంగా రైతులకు ఆశల వల విసురుతున్నారు. మార్కెట్ ముగింపు దశలో ధరలు పెంచి మురిపిస్తున్నారు.
పొగాకు సాగు పెంచేందుకు వ్యాపారుల పన్నాగం
ఆరంభం నుంచి సిండికేట్
ధరలు దిగ్గోసి కొనుగోలు
భారీగా నష్టపోయిన రైతులు
సాగుకు దూరంగా ఉండాలని నిర్ణయం
ఇప్పుడు వ్యాపారుల సరికొత్త ఎత్తుగడ
మార్కెట్ ముగింపు దశలో ధరలు పైపైకి..
మేలు రకం కిలోకు రూ.65 పెంపు
సాగుదారుల్లో కొత్త ఆశలు
మళ్లీ పెరుగుతున్న పొలాల కౌలు ధరలు, బ్యారన్‌ల అద్దెలు
పొగాకు మార్కెట్‌లో వ్యాపారులు మాయాజాలం ప్రదర్శిస్తున్నారు. నిన్నమొన్నటి వరకూ ధరలు దిగ్గోసి రైతులను దగా చేసిన వారు ఇప్పుడు సరికొత్త ఎత్తుగడ వేస్తున్నారు. రానున్న సీజన్‌లో పొగాకు సాగును పెంచే విధంగా రైతులకు ఆశల వల విసురుతున్నారు. మార్కెట్ ముగింపు దశలో ధరలు పెంచి మురిపిస్తున్నారు. ఈ ఏడాది పొగాకు కొనుగోళ్ల ప్రారంభం నుంచి మార్కెట్‌లో వ్యాపారులు వ్యవహరించిన తీరుతో తీవ్రంగా నష్టపోయిన రైతులు రానున్న సీజన్‌లో పంట సాగుకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. దీంతో పొలాల కౌలు, బ్యారన్‌ల అద్దెలు భారీగా తగ్గాయి. రైతులు మూడొంతుల పొగాకు విక్రయించుకున్నాక వ్యాపారులు ఓ పన్నాగం ప్రకారం మేలురకాన్ని కిలోకు రూ.65 పెంచి కొనుగోలు చేస్తూ రైతులు పునరాలోచనలో పడేలా చేస్తున్నారు. ఆ ప్రభావంతో పొలాల కౌలు, బ్యారెన్‌ల అద్దె క్రమంగా పెరుగుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే తీవ్రంగా నష్టపోక తప్పదని రైతులను బోర్డు అధికారులు హెచ్చరిస్తున్నారు. సాగు విస్తీర్ణం పెంచొద్దని కోరుతున్నారు.
కొండపి, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి) : పొగాకు రైతులు ప్రస్తుత సీజన్‌లో భారీగా నష్టపోయారు. పెట్టుబడి ఖర్చులకు అనుగుణంగా ధరలు లభించకపోవడంతో ఆర్థికంగా చితికిపోయారు. పచ్చాకు ముఠా కూలీలకు కూడా డబ్బులు చెల్లించలేక నానా ఇబ్బందులు పడ్డారు. పొగాకు సాగు వద్దు బాబోయ్... అని కాడి కింద వేసే దశలో వ్యాపారులు మాయాజాలం ప్రదర్శిస్తున్నారు. పండించిన దానిలో మూడొంతుల పొగాకు తక్కువ ధరకు అమ్ముకున్నాక ఇప్పుడు ధరలు పెంచి కొనుగోలు చేస్తూ పొగాకు రైతుల మెడలకు ఉరితాళ్లు తయారు చేసే పన్నాగాన్ని ప్రారంభించారు. గడచిన పంట కాలానికి దక్షిణాదిలోని ఎస్‌ఎల్‌ఎస్, ఎస్‌బీఎస్ నేలలున్న 11 వేలం కేంద్రాల పరిధిలో 104.60 మిలియన్ కిలోల పంట ఉత్పత్తికి బోర్డు అనుమతించింది. రైతులు 158.60 మిలియన్ కిలోల పంట పండించినట్లు బోర్డు అంచనా వేసింది. అందులో ఇప్పటి వరకూ 105.82 మిలియన్ కేజీల పొగాకును వేలం కేంద్రాల్లో వ్యాపారులు కొనుగోలు చేశారు. రైతుల వద్ద ఇంకా 52.78 మిలియన్ కిలోలు నిల్వ ఉంటుందని బోర్డు అధికారులు భావిస్తున్నారు.
వేలం ప్రారంభం నుంచి ధరలు దిగ్గోత
ఈ ఏడాది పొగాకు కొనుగోళ్లు మార్చి మొదటి వారం నుంచి మొదలయ్యాయి. ప్రారంభంలో మేలురకం పొగాకు కిలోకు రూ.280 వ్యాపారులు ఇచ్చారు. మీడియం గ్రేడ్ కిలోకు రూ.240 చెల్లించారు. లోగ్రేడ్ రకం పొగాకును అసలు కొనుగోలు చేయలేదు. మేలు రకానికి ప్రారంభ ధర కొద్దిరోజులు కొనసాగింది. మీడియం, లోగ్రేడ్‌లను కనీసం కిలో రూ.250 చొప్పున అయినా కొనుగోలు చేస్తారని రైతులు ఆశించారు. అయితే మేలు రకాన్ని నాలుగు నెలలపాటు కిలో రూ.240 నుంచి రూ.280 మధ్య వ్యాపారులు కొనుగోలు చేశారు. రైతులకు కిలోకు సరాసరి రూ.250 లభించింది. ఒక దశలో కిలోకు ఒకటి, రెండు రూపాయలు కొన్ని కంపెనీలు పెంచినప్పటికీ వ్యాపారులు సిండికేట్ అయి ధర పెంచిన కంపెనీ బయ్యర్‌లపై ఒత్తిడి చేసి తిరిగి తగ్గించేలా చేశారు. మీడియం, లోగ్రేడ్ ధరలు కిలో రూ.240 నుంచి క్రమంగా దిగజారాయి. ప్రస్తుతం కిలో రూ.80 నుంచి రూ.120 మధ్య నడుస్తున్నాయి. మూడు నెలల క్రితం లోగ్రేడ్ రకం పొగాకును రైతులు వేలం కేంద్రానికి తీసుకురావడం, వ్యాపారులు కొనుగోలు చేయకపోవడంతో తిరిగి ఇళ్లకు తీసుకెళ్లడం చేశారు. దీంతో విసుగు చెంది పలు వేలం కేంద్రాల ఎదుట రోడ్డుపైౖ బైఠాయించి నిరసనలు కూడా తెలిపారు. అయినా వ్యాపారులు కొనుగోలు చేయకపోగా లోగ్రేడ్ ధరలను మరింత దిగ్గోశారు.
పొగాకు సాగు తగ్గింపు దిశగా రైతులు
పండించిన పొగాకుకు గిట్టుబాటు ధరలు లేక నష్టపోవడంతో రైతులు రానున్న సీజన్‌లో సాగును తగ్గించాలన్న నిర్ణయానికి వచ్చారు. బోర్డు అధికారులు కూడా రాబోయే పంట కాలంలో రైతులు సాగు తగ్గించుకోవాలని సూచనలు చేశారు. ఈక్రమంలో పొలాల కౌలు ధరలు, బ్యారన్‌ల అద్దె రేట్లు సగానికిపైగా పడిపోయాయి. ఈదశలో పొగాకు వ్యాపారులు రైతుల్లో కొత్త ఆశలు రేకెత్తించే ప్రయత్నాలను ప్రారంభించారు.
ఆఖరులో మేలు రకం ధర పెంచి ఆశలు
పక్షం రోజులుగా వ్యాపారుల సిండికేట్ బ్రేక్ అయ్యింది. మేలు రకం పొగాకు ధర కిలోకు రూ.65 పెంచి కొనుగోలు చేస్తున్నారు. వేలం ప్రారంభంలో కిలోకు రూ.280 మించకుండా సీలింగ్ పెట్టి కొనుగోలు చేసిన కంపెనీలు పక్షం రోజులుగా ధరలు పెంచుకుంటూ పోతున్నాయి. ప్రస్తుతం కిలో రూ.346కు కొనుగోలు చేస్తున్నాయి. తమ వద్ద ఉన్న పొగాకు దాదాపు విక్రయించుకున్న దశలో మేలు రకానికి ధరలు పెంచడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఇది రాబోయే పంట కాలానికి పొగాకు సాగును ప్రోత్సహించడానికి వ్యాపారులు వేసిన పన్నాగంగా అభిప్రాయపడుతున్నారు. తిరిగి పక్షం రోజులుగా పొగాకు కౌలు ధరలు, బ్యారన్‌ల అద్దెలు పెరుగుతున్నా యని రైతులు అంటున్నారు.