Share News

వేధిస్తున్న ఇంజనీరింగ్‌ అధికారుల కొరత

ABN , Publish Date - Jun 19 , 2025 | 11:10 PM

దర్శి పంచాయతీరాజ్‌శాఖ కార్యాలయంలో ఇంజనీరింగ్‌ అధికారుల కొరత తీవ్రంకావటంతో పనులు కుంటుపడుతున్నాయి. ఎంతోకాలంగా ఇంజనీరింగ్‌ అధికారుల కొరత కొనసాగుతోంది. దీంతో రోడ్ల అభివృద్ధి పనులు, మరమ్మతుల పనులు సకాలంలో పూర్తికావటంలేదు.

వేధిస్తున్న ఇంజనీరింగ్‌ అధికారుల కొరత
దర్శి పంచాయతీరాజ్‌ శాఖ కార్యాలయం

కుంటుపడుతున్న పనులు

దర్శి పంచాయతీరాజ్‌శాఖ దుస్థితి

దర్శి, జూన్‌ 19(ఆంధ్రజ్యోతి): దర్శి పంచాయతీరాజ్‌శాఖ కార్యాలయంలో ఇంజనీరింగ్‌ అధికారుల కొరత తీవ్రంకావటంతో పనులు కుంటుపడుతున్నాయి. ఎంతోకాలంగా ఇంజనీరింగ్‌ అధికారుల కొరత కొనసాగుతోంది. దీంతో రోడ్ల అభివృద్ధి పనులు, మరమ్మతుల పనులు సకాలంలో పూర్తికావటంలేదు. పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు, నిర్వాహకులు ఇంజనీరింగ్‌ అధికారులు సకాలంలో అందుబాటులోకి రాకపోవటంతో ఇబ్బందులు పడుతున్నారు.

దర్శి పంచాయతీరాజ్‌శాఖ సబ్‌డివిజన్‌ పరిధిలో దర్శి, కురిచేడు, దొనకొండ, తాళ్ళూరు, ముండ్లమూరు మండలాలు ఉన్నాయి. ఐదుగురు ఏఈలు ఉండాల్సి ఉండగా, ఎంతోకాలంగా ఇద్దరు మాత్రమే ఉన్నారు. మిగిలిన మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దర్శి, కురిచేడు, దొనకొండ మండలాల్లో ఒక ఏఈ పర్యవేక్షణలో పనులు జరుగుతున్నాయి. తాళ్ళూరు, ముండ్లమూరు మండలాల్లో మరో ఏఈ పర్యవేక్షణలో పనులు జరుగుతున్నాయి. పంచాయతీరాజ్‌ శాఖ పనులతో పాటు జడ్పీ పనులు కూడా వీరే నిర్వహించాల్సి ఉంది.

గతంలో జడ్పీ పనుల నిర్వహణకు ప్రత్యేక ఏఈ ఉండేవారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జడ్పీ పనులు నిర్వహించే ప్రత్యేక ఏఈలను తొలగించి వీరికే అప్పగించారు. దీంతో రెండు శాఖల పనులు ఈ ఇరువురు ఇంజనీరింగ్‌ అధికారులు నిర్వహించాల్సి రావటంతో పనిభారం అధికమైంది. దీంతో ఇంజనీరింగ్‌ అధికారులు వర్క్‌ఇన్‌స్పెక్టర్లపైన ఆధారపడాల్సి వస్తుంది. ఇంజనీరింగ్‌ అధికారుల కొరతతో పనులు భారం ఎక్కువై సకాలంలో పూర్తి చేయలేకపోతున్నారు. ఇదే అదునుగా కొంతమంది సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ముందుగా పర్సెంటేజీలు ఇచ్చిన కాంట్రాక్టర్ల పనులనుచేస్తూ మిగిలిన వారి పనులను జూప్యం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతోకాలంగా అధ్వానంగా ఉన్న రోడ్ల మరమ్మతుల పనులు చేట్టారు. ఉన్నతాధికారులు ఈ విషయాన్ని గుర్తించి ఇంజనీరింగ్‌ అధికారుల కొరతను భర్తీచేసి పనులన్నీ సకాలంలో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Jun 19 , 2025 | 11:10 PM