ఆక్రమణ చెరలో చెరువు అలుగు
ABN , Publish Date - May 27 , 2025 | 11:29 PM
అలనాటి పెద్దలు ముందుచూపుతో వ్యవహరించి అనేక ప్రజా ప్రయోజన కార్యక్రమాలు చేపట్టారు. ఆఖరికి ఆంగ్లేయులు కూడా మనకు అవసరమైన కొన్ని మంచి పనులు చేశారు. ఆ కోవలోదే మార్కాపురం చెరువు.
కూలిన చప్టా
చెత్తాచెదారంతో ప్రజలకు రోగాలు
మార్కాపురం వన్‌టౌన్, మే 27 (ఆంధ్రజ్యోతి) : అలనాటి పెద్దలు ముందుచూపుతో వ్యవహరించి అనేక ప్రజా ప్రయోజన కార్యక్రమాలు చేపట్టారు. ఆఖరికి ఆంగ్లేయులు కూడా మనకు అవసరమైన కొన్ని మంచి పనులు చేశారు. ఆ కోవలోదే మార్కాపురం చెరువు. ఈ చెరువుకు ఉన్న అలుగులు కూడా ఎంతో ప్రాముఖ్యమైనవి. మార్కాపురం చెరువుకు నీరు అధికమైతే బయటకి వెళ్లడానికి 8వ వార్డు రేడియో స్టేషన్ సమీపంలో ఒక అలుగు, రైల్వే స్టేషన్ రోడ్డులోని పారిశ్రామిక వాడ వద్ద మరో అలుగును ఏర్పాటు చేశారు. విశాలమైన ఈ అలుగుల ద్వారా చెరువు పూర్తి స్థాయిలో నిండినప్పుడు నీరు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మైదన ప్రాంతంలో ప్రవహించేది. కాలక్రమేణా భూబకాసురుల కళ్లు చెరువు అలుగు, కట్టలపై పడ్డాయి. దీంతో విశాలమైన చెరువు అలుగు కట్టలు మాయమై అలుగు చిన్న మురుగు కాలువలా నిలబడింది. రేడియో స్టేషన్ వద్దనున్న అలుగును పూర్తి స్థాయిలో ఆక్రమించారు. 1976 వచ్చిన తుఫాన్‌కు అలుగు పైనుంచి నీరు ప్రవహించి ఆ ప్రాంతం అంతా నీట మునిగింది. దీంతో అధికారులు అలుగు సమీపంలో ఒక చప్టా నిర్మించారు. కొండ రాళ్లు, గుండ్లకమ్మ ఇసుకతో కట్టిన ఆ చప్టా ఒకవైపు కూలిపోయి ప్రమాదకరంగా మారింది. నిత్యం వేలాది వాహనాలు రైల్వే స్టేషన్, ఒంగోలు తదితర ప్రాంతాలకు ఈ చప్టా మీదుగానే వెళుతుంటాయి. దీనికి తోడు అలుగు పటిష్టం చేయడానికి రాళ్లగోడ నిర్మించి రివిట్‌మెంట్ వేశారు. కాలక్రమేణా ఆక్రమణదారులు వాటిపై నిర్మాణాలు వేసుకుని శాశ్వత భవనాలు నిర్మించుకున్నారు. తొలుత ఆ స్థలంలో 4 రాళ్లు పేర్చి కుప్పలు వేస్తారు. పశువులను కట్టివేసి పశువుల కొట్టంగా మారుస్తారు. అనంతరం రేకుల షెడ్లు వేసి ఇప్పుడు పక్కా భవనాలు వేశాశారు. రేడియో స్టేషన్ నుంచి చిన్నమసీద్ వరకు ఉన్న అలుగు కట్టలపై నిర్మాణాలు చేపట్టారు. మేము తక్కువేమీ కాదని, ఇటీవల ఆ ప్రాంతంలో మరోవైపు అలుగు కట్టను పూడ్చి ఆటోస్టాండ్, జీప్ స్టాండ్ ఏర్పాటు చేసుకున్నారు. దీంతో అలుగు కట్ట మ రింత కుంచించుకు పోయింది. ఇరిగేషన్ అధికారులు చూసిచూడనట్లు వ్యవహరిస్తుండటంతో ఆక్రమణలు రోజురోజుకు పెరుగుతున్నాయి. పారిశ్రామికవాడ సమీపంలోని అలుగు కూడా ఆక్రమణలతో నిండింది. దానిపై కూడా నివాసాలు ఏర్పరుచుకున్నారు. ఇప్పటికైనా ఇరిగేషన్ అధికారులు స్పందించి అలుగులోని ఆక్రమణలు తొలగించి చెత్తా చెదారానికి మారుపేరుగా నిలిచిన మార్కాపురం చెరువు అలుగును శుభ్రం చేయాలని ప్రజలు కోరుతున్నారు.