పోటెత్తిన అర్జీదారులు
ABN , Publish Date - Nov 04 , 2025 | 12:42 AM
ఒంగోలులో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం)కు అర్జీదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తమ సమస్యలను అధికారుల వద్ద ఏకరువు పెట్టారు. రెండు వారాల అనంతరం మీకోసం కార్యక్రమం కలెక్టర్ రాజాబాబు ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో నిర్వహించారు.
రెండు వారాల అనంతరం ‘మీ కోసం’
సమస్యలను ఏకరువుపెట్టిన ప్రజలు
వ్యక్తిగత, భూ, ఇతర సమస్యలపై వినతులు
ఒంగోలు కలెక్టరేట్, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): ఒంగోలులో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం)కు అర్జీదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తమ సమస్యలను అధికారుల వద్ద ఏకరువు పెట్టారు. రెండు వారాల అనంతరం మీకోసం కార్యక్రమం కలెక్టర్ రాజాబాబు ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో నిర్వహించారు. ఉదయం 10 గంటలకే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు అర్జీలను చేతితో పట్టుకొని క్యూలైన్లో నిల్చున్నారు. రెండు వారాల క్రితం దీపావళి పండుగ కావడంతో ప్రభుత్వ సెలవు కాగా, గత వారం మొంథా తుఫాన్ ప్రభావంతో మీకోసం కార్యక్రమాన్ని రద్దు చేశారు. ఈ నేపథ్యంలో అర్జీదారులు తమ సమస్యలను కలెక్టర్ రాజాబాబు, జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణకు చెప్పుకునేందుకు తరలివచ్చారు. ప్రధానంగా వ్యక్తిగత సమస్యలతోపాటు భూములు, సర్వేలో లోపాలు, గ్రామ పంచాయతీల్లో వివిధ రకాల సమస్యలపై వినతులు అధికంగా వచ్చాయి. వీటిపై స్పందించిన కలెక్టర్ రాజాబాబు మాట్లాడుతూ ఆయా సమస్యలను సకాలంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పుకోకుండా వారు సంతృప్తి చెందేలా సేవలు సేవలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేశు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు పార్థసారఽథిజాన్సన్, విజయజ్యోతి, మాధురితోపాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.