Share News

నిందితుడిపై దాడి చేసిన వ్యక్తి అరెస్ట్‌

ABN , Publish Date - Aug 13 , 2025 | 10:41 PM

హత్య కేసులో విచారణకు హాజరై తిరిగి స్వగ్రామానికి వెళ్తున్న నిందితుడిపై దాడి చేసిన వ్యక్తిని పట్టణ పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేశారు. స్థానిక ఎస్‌డీపీవో కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ డాక్టర్‌ యు.నాగరాజు ఆ కేసు వివరాలు వెల్లడించారు.

నిందితుడిపై దాడి చేసిన వ్యక్తి అరెస్ట్‌
మాట్లాడుతున్న డీఎస్పీ నాగరాజు, పక్కన సీఐ, ఎస్సెలు

వివరాలు వెల్లడించిన డీఎస్పీ నాగరాజు

పాత కక్షల నేపథ్యంలో ఘటన

మార్కాపురం, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి) : హత్య కేసులో విచారణకు హాజరై తిరిగి స్వగ్రామానికి వెళ్తున్న నిందితుడిపై దాడి చేసిన వ్యక్తిని పట్టణ పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేశారు. స్థానిక ఎస్‌డీపీవో కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ డాక్టర్‌ యు.నాగరాజు ఆ కేసు వివరాలు వెల్లడించారు. ముండ్లమూరు మండలం ఈదర గ్రామానికి చెందిన బండి బాపిరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి 2018లో పాతకక్షల నేపథ్యంలో కిస్టిపాటి వెంగళరెడ్డి అతని కుమారుడు కొండారెడ్డిపై కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో కొండారెడ్డి చనిపోయాడు. దీంతో బాపిరెడ్డి కుటుంబ సభ్యులపై హత్య కేసు నమోదైంది. ఈ కేసులో విచారణ నిమిత్తం ఈ నెల 11వ తేదీన బాపిరెడ్డి మార్కాపురం ఆరో అదనపు జిల్లా కోర్టుకు హాజరయ్యాడు. అనంతరం గ్రామంలో కక్షల నేపథ్యంలో ప్రస్తుతం నివాసముంటున్న కడప జిల్లా బి.మఠం మండలం జౌకుపల్లి గ్రామానికి వెళ్తేందుకు ఆర్టీసీ బస్టాండ్‌కు చేరుకున్నాడు. అక్కడ మైదుకూరు వెళ్లే బస్సు ఎక్కాడు. హత్య కేసులో సాక్షులను ఇప్పటికే బెదిరించి ఎవరూ ముందుకురాకుండా చేశాడని బాపిరెడ్డిపై వెంగళరెడ్డి కక్ష పెంచుకున్నాడు. శిక్ష పడినా, పడకపోయినా ఎలాగైనా మట్టుబెట్టాలని యోచించాడు. కేసు వాయిదాకు వెళ్లి తిరుగు ప్రయాణమైన బాపిరెడ్డిని అనుసరించి ముఖానికి గుడ్డకట్టుకుని బస్సులోకి ఎక్కిన వెంగళరెడ్డి.. పొట్లంలోని కారాన్ని బాపిరెడ్డి కళ్లలో చల్లాడు. తర్వాత కత్తితో పొడవబోగా బాపిరెడ్డి తప్పించుకున్నాడు. కొంతదూరం వెంబడించిన వెంగళరెడ్డి బస్టాండ్‌ సమీపంలో కత్తిని పారవేసి పారిపోయాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పట్టణ పోలీసులు వెంగళరెడ్డి కోసం గాలింపు మొదలు పెట్టారు. ఈ క్రమంలో ఈ నెల 12న కార్‌ స్టాండ్‌ సమీపంలో వెంగళరెడ్డి ఉన్నట్లు సమాచారం రావడంతో సీఐ సుబ్బారావు సూచనల మేరకు ఎస్సై సైదుబాబు సిబ్బందితో కలిసి వెళ్లి అరెస్ట్‌ చేశారు. దాడి కేసులో వెంగళరెడ్డిని బుధవారం కోర్టులో హజరుపర్చడంతో న్యాయాధికారి రిమాండ్‌ విధించారు. నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్న పోలీసు సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. సమావేశంలో సీఐ పి.సుబ్బారావు, టౌన్‌, రూరల్‌ ఎస్సైలు ఎం.సైదుబాబు, అంకమ్మరావులు పాల్గొన్నారు.

Updated Date - Aug 13 , 2025 | 10:41 PM