కక్షిదారులే స్వయంగా పరిష్కారం
ABN , Publish Date - Jul 10 , 2025 | 10:56 PM
కక్షిదారులు తమ సమస్యలను తామే పరిష్కరించుకొనే అవకాశాన్ని కల్పించే వినూత్న ప్రక్రియ మధ్యవర్తిత్వం అని జిల్లా ప్రధాన న్యాయాధికారి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ ఏ భారతి చెప్పారు.
మధ్యవర్తిత్వ ప్రయోగంతో వినూత్నంగా ముందుకు
ఒంగోలులో 1కే రన్‌ను ప్రారంభించిన జిల్లా న్యాయాధికారి భారతి
ఒంగోలు కలెక్టరేట్, జూలై 10 (ఆంధ్రజ్యోతి) : కక్షిదారులు తమ సమస్యలను తామే పరిష్కరించుకొనే అవకాశాన్ని కల్పించే వినూత్న ప్రక్రియ మధ్యవర్తిత్వం అని జిల్లా ప్రధాన న్యాయాధికారి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ ఏ భారతి చెప్పారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం 1కే రన్‌ను భారతి ప్రారంభించారు. తొలుత న్యాయసేవాధికారి సంస్థ ఏర్పాటు చేసిన మీడియేషన్ టూ నేషన్ స్టాల్ కూడా ఆమె చేతుల మీదుగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయాధికారి భారతి మాట్లాడుతూ ఒక తటస్థ వ్యక్తికి, తన ప్రత్యేక వ్యక్తికి సంధాన నైపుణ్యాన్ని ఉపయోగించేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. మధ్యవర్తిత్వం మీద కక్షిదారులకు, సామాన్య ప్రజలకు అవగాహన కల్పించేందుకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. ఏడో అదనపు జిల్లా న్యాయమూర్తి టి.రాజావెంకటాద్రి మాట్లాడుతూ జిల్లాలో 59 మంది మీడియేటర్లను నియమించామన్నారు. వీరి ద్వారా వివిధ స్థాయిల్లో ఉన్న వ్యాజ్యాల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తారని తెలిపారు. ర్యాలీలో న్యాయవాదులతోపాటు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు. అనంతరం చర్చి సెంటర్‌లో న్యాయవాదులుతో మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు జిల్లా న్యాయమూర్తులు టి. రాజ్యలక్ష్మీ, ఎ. పూర్ణిమ, పి. లలిత, జి. దీన, కే శైలజ, సీనియర్ సివిల్ న్యాయమూర్తులు ఎస్. హేమలత, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి షేక్ ఇబ్రహీం షరీఫ్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బొడ్డు భాస్కరరావు, ఒంగోలు డీఎస్పీ ఆర్. శ్రీనివసరావు, సీనియర్ న్యాయవాదులు ఉడతా రవికుమార్, సిరిగిరి సరళ, దేవకుమారి, విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.