Share News

పా‘పాల’ భైరవులు

ABN , Publish Date - May 08 , 2025 | 01:51 AM

దర్శిప్రాంతంలో కల్తీపాల తయారీ విచ్చలవిడిగా జరుగుతోంది. డబ్బాశతో కొందరు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. అత్యంత ప్రమాదకరమైన రసాయనాలతో కల్తీపాలను తయారు చేస్తున్నారు. వాటిని సాధారణ పాలలో కలిపి విక్రయిస్తున్నారు.

పా‘పాల’ భైరవులు

దర్శి ప్రాంతంలో విచ్చలవిడిగా కల్తీపాల తయారీ

యూరియా, ప్రమాదకరమైన రసాయనాల వినియోగం

రూ.100 ఖర్చుతో 10 లీటర్లు

ప్రజల ప్రాణాలతో చెలగాటం

అరకొర దాడులకే ఆహార భద్రత అధికారులు పరిమితం

ఇటీవల పోలీసుల ముమ్మర తనిఖీలు

దర్శిప్రాంతంలో కల్తీపాల తయారీ విచ్చలవిడిగా జరుగుతోంది. డబ్బాశతో కొందరు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. అత్యంత ప్రమాదకరమైన రసాయనాలతో కల్తీపాలను తయారు చేస్తున్నారు. వాటిని సాధారణ పాలలో కలిపి విక్రయిస్తున్నారు. అసలుకు, కల్తీకి తేడా తెలుసుకోలేని విధంగా కనికట్టు ప్రదర్శిస్తున్నారు. దర్శి నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల్లో ఇలా కల్తీపాలు తయారు చేస్తున్న వారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ ఆహార భద్రత అధికారులు మొద్దు నిద్రపోతున్నారు. ఈనేపథ్యంలో పోలీసులు ఒకడుగు ముందుకేశారు. కొద్దిరోజుల క్రితం డెయిరీ ఫాంలను తనిఖీ చేశారు. అక్రమార్కులపై త్వరలో చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. దీంతో కల్తీపాల తయారీదారుల వెన్నులో వణుకు మొదలైంది.

దర్శి, మే 7 (ఆంధ్రజ్యోతి): దర్శి ప్రాంతంలో కల్తీపాల తయారీ కుటీర పరిశ్రమగా మారింది. తక్కువ పెట్టుబడితో అనతికాలంలోనే కోటీశ్వరులు కావాలన్న ఉద్దేశంతో కొంతమంది ఈ వ్యవహారాన్ని సాగిస్తున్నారు. వీటిని కొందరు ప్రైవేటు డెయిరీలకు పోస్తుండగా, మరికొందరు నేరుగా ప్రజలకు విక్రయిస్తున్నారు. విషయం తెలియని ప్రజలు ఆ పాలను తాగి రోగాలను కొనితెచ్చుకుంటున్నారు. అడ్డుకోవాల్సిన ఆహార భద్రతాశాఖ అధికారులు ఆవైపు కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది. దర్శి, ముండ్లమూరు, తాళ్లూరు మండల్లాలోని పలు గ్రామాల్లో కల్తీపాల తయారీ జోరుగా జరుగుతోంది. తాళ్లూరు మండలంలో గతంలో ఒక వ్యక్తి రెండు గేదెలు మాత్రమే పెట్టుకొని రోజుకు 200 లీటర్ల పాలు శీతల కేంద్రానికి పంపేవారు. దర్శిలో మరో వ్యక్తి ఇంటిలోనే కల్తీపాలు తయారుచేసి పాలశీతల కేంద్రా నికి సరఫరా చేస్తూ పట్టుబడ్డాడు. కల్తీపాల తయారీ కోసం నెలకు 30 టన్నుల పాలపొడి హైదరాబాద్‌ నుంచి ఇక్కడికి వస్తున్నట్లు సమాచారం. అక్రమా ర్కులు తయారుచేసిన కల్తీపాలను దర్శి పట్టణంలోని ఒక పాలశీతల కేంద్రం ముమ్మరంగా కొనుగోలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం ల్యాక్టోమీటర్‌ వినియోగించి పాలను తనిఖీ చేసి స్వచ్ఛమైనవని నిర్ధారించి కొనుగోలు చేయాలి. అలాచేస్తే పెద్దగా లాభాలు రావు. కల్తీపాలు తక్కువ ధరకు కొనుగోలు చేసినందున కంపెనీకి ముమ్మరంగా లాభాలు వస్తున్నాయి. దీంతో ఓ పాల శీతల కేంద్రం నిర్వాహకులు అక్రమార్కులకు అడ్వాన్సులు ఇచ్చి కల్తీపాల తయారీని ప్రోత్సహిస్తున్నట్లు సమాచారం.

కల్తీపాల తయారీదారులపై చర్యలు తీసుకోవా ల్సిన ఆహార భద్రత శాఖ అధికారులు ఆరునెలలకు ఒకసారి అరకొర తనిఖీలకు పరిమితమవుతున్నారు. కల్తీపాలు తయారుచేస్తున్న వ్యక్తులు, వాటిని సేకరి స్తున్న పాల శీతల కేంద్రాల నిర్వాహకులు ఆహార భద్ర తశాఖ అధికారులకు ముడుపులు చెల్లిస్తూ అక్రమ వ్యాపారాన్ని నిరాటంకంగా కొనసాగిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో అధికారులు తనిఖీ చేసిన ప్రతిసారీ వందల లీటర్ల కల్తీపాలు పట్టుబడ్డాయి. ఆ పాలు తయారుచేస్తున్న అక్రమార్కులపై పెద్దగా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. కొంతమందికి నామమాత్రపు జరిమానాలు విధించి మిన్నకుండిపోతున్నారు. దీంతో కొంతకాలం మౌనంగా ఉంటున్న అక్రమార్కులు ఆతర్వాత యఽథాతథంగా కల్తీపాలను తయారు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజలు స్వచ్ఛమైన పాలు ఎక్కడ దొరుకుతాయో అర్థంకాక సతమతమవుతున్నారు. అక్రమార్కులతో వాస్తవంగా గేదెలు పెంచుకొని స్వచ్ఛమైన పాలు విక్రయించే వ్యాపారులకు కూడా మచ్చ పడుతోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అక్రమ వ్యాపారం గురించి పట్టించుకున్న నాథుడు లేడు. ఎవరి ఇష్టంవచ్చినట్లు వారు ప్రజల సొమ్మును దోచుకోవడంతోపాటు, వారి ఆరోగ్యంతో కూడా చెలగాటం ఆడారు. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమాలకు అడ్డుపడుతుందని ప్రజలు ఎంతో నమ్మకంతో ఉన్నారు.

కల్తీపాల తయారీ ఇలా..

గతంలో పాలలో నీళ్లు కలిపి కల్తీ చేసేవారు. ఆతర్వాత అధికపాల ఉత్పత్తి కోసం పశువులకు ఇంజక్షన్‌లు ఇవ్వడం ప్రారంభించారు. ఇప్పుడు ఏకంగా ప్రాణాలను హరించే పదార్థాలతో కల్తీ చేస్తున్నారు. కల్తీ పాలు తెల్లగా ఉండేందుకు పాలపొడిని ఉపయోగిస్తున్నారు. జిగురు వచ్చేందుకు పామాయిల్‌ను మిక్స్‌ చేస్తున్నారు. నురుగు కోసం యూరియా, సల్ఫర్‌ను కలుపుతున్నారు. ఇలా రూ.100 ఖర్చుతో 10 లీటర్ల కల్తీపాలు తయారు చేస్తున్నారు. దాన్ని లీటర్‌ రూ.70కు ప్రజలకు అమ్ముతున్నారు.


పోలీసుల ముమ్మర తనిఖీలు

కల్తీపాల తయారీ నియంత్రణ గురించి ఆహార భద్రతశాఖ అధికారులు పట్టించుకోక పోయినప్పటికీ దర్శి పోలీసులు కొద్దిరోజులుగా ముమ్మర తనిఖీలు చేసి అక్రమ వ్యాపారాన్ని నియంత్రించేందుకు శ్రీకారం చుట్టారు. ఇటీవల దర్శి సీఐ వై.రామారావు మారువేషంలో అనేక గ్రామాల్లో తిరిగారు. దర్శి ఎస్‌ఐ ఎం.మురళి, తాళ్లూరు, ముండ్లమూరు ఎస్‌ఐలు కూడా సిబ్బందితో కలిసి డెయిరీ ఫాంలను తనిఖీ చేశారు. అక్కడ ఉత్పత్తి అవుతున్న పాలను తనిఖీ చేశారు. దీంతో అక్రమార్కుల వెన్నులో వణుకు మొదలైంది. కొద్దిరోజుల క్రితం కల్తీపాలు తయారు చేస్తున్న అక్రమార్కులు ఒకచోట సమావేశమై ఈవిషయంపై ఏం చేయాలని చర్చించుకున్నట్లు తెలిసింది. వీరికి పెద్దన్నగా వ్యవహరిస్తున్న పాలశీతల కేంద్రం నిర్వాహకుడి సలహాను కూడా తీసుకున్నట్లు తెలిసింది. పోలీసు దూకుడు తగ్గేవరకు కొద్దిరోజులు మౌనంగా ఉంటే అంతా సర్ధుకుంటుందని వారు భావించినట్లు సమాచారం. అయితే, తనిఖీలు నిర్వహించిన పోలీసు అధికారులు కల్తీపాలు ఎవరెవరు తయారుచేస్తున్నారనే సమాచారాన్ని పూర్తిగా తెలుసుకున్నట్లు తెలుస్తోంది. ఆహార భద్రత అధికారులతో చర్చించి అక్రమార్కులపై త్వరలో చర్యలకు శ్రీకారం చుట్టనున్నట్టు సమాచారం.

Updated Date - May 08 , 2025 | 01:51 AM