మత్స్య మర్మం..!
ABN , Publish Date - Oct 15 , 2025 | 11:10 PM
సొసైటీల మాటున చేపల వ్యాపారి దోపిడీ చేస్తున్నారు. మత్స్యకారుల జీవనోపాధి కోసం ప్రభుత్వం నామమాత్రం రుసుంతో చేపలు పెంచుకునేందుకు కల్పించిన అవకాశాలను సొమ్ము చేసుకుంటున్నారు. అధికారులను లోబర్చుకొని, మత్స్యకారులను మాయచేసి సొసైటీ చెరువుల్లో వ్యాపారి ఏళ్ల తరబడి పాగా వేశారు. వాటిల్లో చేపలు పెంచుకుంటూ కోట్లాది రూపాయలు గడిస్తున్నారు. ఇంత జరుగుతున్నా పాలకులు చోద్యం చూస్తుండడం విమర్శలకు తావిస్తోంది.
సొసైటీల మాటున చేపల పెంపకం పేరుతో ఓ వ్యాపారి దోపిడీ
దర్శి నియోజకవర్గంలోని నాలుగు చెరువుల్లో ఇదే తంతు
సహకరిస్తున్న అధికారులు
దర్శి, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి) : సొసైటీల మాటున చేపల వ్యాపారి దోపిడీ చేస్తున్నారు. మత్స్యకారుల జీవనోపాధి కోసం ప్రభుత్వం నామమాత్రం రుసుంతో చేపలు పెంచుకునేందుకు కల్పించిన అవకాశాలను సొమ్ము చేసుకుంటున్నారు. అధికారులను లోబర్చుకొని, మత్స్యకారులను మాయచేసి సొసైటీ చెరువుల్లో వ్యాపారి ఏళ్ల తరబడి పాగా వేశారు. వాటిల్లో చేపలు పెంచుకుంటూ కోట్లాది రూపాయలు గడిస్తున్నారు. ఇంత జరుగుతున్నా పాలకులు చోద్యం చూస్తుండడం విమర్శలకు తావిస్తోంది. వివరాల్లోకెళ్తే...
మత్స్యకారులకు దక్కని ప్రభుత్వ ఫలాలు
దర్శి మండలంలోని పొతకమూరు, తూర్పువీరాయపాలెం, ముండ్లమూరు మండలంలోని పులిపాడు, ఉల్లగల్లు చెరువులు మత్స్యకారుల సొసైటీ పరిధిలో ఉన్నాయి. ఒక్కొక్క చెరువు సుమారు 400 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ప్రభుత్వమే చేపల పెంపకానికి వేలం పాటలు నిర్వహిస్తే ఒక్కొక్క చెరువు కోటి రూపాయల వరకు పాట పలికే అవకాశముంది. కేవలం మత్స్యకారుల జీవనోపాధి కోసం ఎంతో ఆదాయం వచ్చే చెరువులను సొసైటీలకు కేటాయించారు. ప్రభుత్వం సదుద్దేశ్యంతో తీసుకున్న నిర్ణయం తాలూకు ప్రతిఫలం మత్స్యకారులకు అందటం లేదు. పేదలైన మత్స్యకారులు ఒత్తిళ్లకు తలొగ్గి బడా వ్యాపారి చెప్పినట్లు సంతకాలు చేస్తున్నారు. సొసైటీ సభ్యులకు అంతో ఇంతో ఇచ్చి చేపలు పెంచుకుంటూ అతను లబ్ధిపొందుతున్నారు.
పదేళ్ల నుంచి అతనే...
నర్సరావుపేటకు చెందిన ఒక వ్యాపారి సుమారు పదేళ్లుగా సొసైటీల చెరువుల్లో చేపలు పెంచుకుంటూ వ్యాపారం చేసుకుంటున్నారు. ఏళ్ల తరబడి ఈ తంతు కొనసాగుతున్నప్పటికీ మత్స్యశాఖ అధికారులు ముడుపులు తీసుకుంటూ వారికి కొమ్ముకాస్తున్నారు. దీంతో మత్స్యకారులకు తీరని అన్యాయం జరుగుతోంది. వైసీపీ ప్రభుత్వం హయాంలోనూ అతను ఇష్టానుసారంగా వ్యవహరించారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ తంతు కొనసాగుతోంది. ఆయా గ్రామాల ప్రజలు కూడా మత్స్యకారుల పేరున వ్యాపారి సొమ్ము చేసుకుంటున్న విషయాన్ని సహించలేకపోతున్నారు. కనీసం పంచాయతీలకు అప్పగిస్తే గ్రామాలైనా అభివృద్ధి చెందుతాయనే అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు వాస్తవ పరిస్థితులను గుర్తించి నిజమైన మత్స్యకారులు చేపలు పెంచుకునేలా చర్యలు తీసుకోవాలని లేదా ఆ చెరువులను పంచాయతీలకు విలీనం చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.