సైకిల్ తొక్కిన మంత్రి.. నడిచి వచ్చిన కలెక్టర్
ABN , Publish Date - Oct 19 , 2025 | 01:43 AM
జిల్లావ్యాప్తంగా స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమం శనివారం ఉత్సాహంగా సాగింది. ప్రతినెలా మూడో శనివారం ప్రభుత్వం ప్రత్యే కంగా ఈ కార్యక్రమాన్ని ఒక్కోసారి ఒక్కో అంశంపై నిర్వ హిస్తున్న విషయం విదితమే. ఈ వారం క్లీన్ ఎయిర్ (పరిశుభ్రమైన గాలి) ఇతివృత్తంగా ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించింది.
ఉత్సాహంగా స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర
క్లీన్ ఎయిర్‌పై పెద్దఎత్తున అవగాహన
జిల్లావ్యాప్తంగా ర్యాలీలు
మొక్కలు నాటిన నేతలు, అధికారులు
స్వచ్ఛగాలి కోసం పర్యావరణాన్ని కాపాడుకోవాలని పలువురు పిలుపు
ఒంగోలు, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి) : జిల్లావ్యాప్తంగా స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమం శనివారం ఉత్సాహంగా సాగింది. ప్రతినెలా మూడో శనివారం ప్రభుత్వం ప్రత్యే కంగా ఈ కార్యక్రమాన్ని ఒక్కోసారి ఒక్కో అంశంపై నిర్వ హిస్తున్న విషయం విదితమే. ఈ వారం క్లీన్ ఎయిర్ (పరిశుభ్రమైన గాలి) ఇతివృత్తంగా ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించింది. తదనుగుణంగా జిల్లావ్యాప్తంగా స్థానిక సంస్థల ఆధ్వర్యంలో ఊరూరా అవగాహన ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించారు. పెద్దఎత్తున మొక్కలు నాటారు. జిల్లాకు చెందిన మంత్రి డాక్టర్ డీఎస్‌బీవీ స్వామి కొండపి నియోజకవర్గ పరిధిలోని సింగరాయకొండలో వందలాది మందితో నిర్వహించిన ర్యాలీలో పాల్గొనడమే కాక సైకిల్ తొక్కుతూ కాలుష్య నియంత్రణపై సందేశం ఇచ్చారు. ఒంగోలులో కలెక్టర్ రాజాబాబు కాలుష్య రహితంపై అవగాహన కోసం తన బంగ్లా నుంచి కలెక్టరేట్‌కు ఇతర అధికారులతో కలిసి నడుచుకుంటూ వచ్చారు. పాకల సముద్ర తీరంలో మంత్రి డాక్టర్ స్వామి, కలెక్టర్ రాజాబాబు మొక్కలు నాటారు. సంతనూతలపాడు హైస్కూల్‌లో అక్కడి ఎమ్మెల్యే బీఎన్.విజయకుమార్, మార్కాపురం తహసీల్దార్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ వెంకట త్రివినాగ్ మొక్కలు నాటారు. జిల్లాలోని ప్రధాన పట్టణాలు, మండల కేంద్రాలే కాక గ్రామ, గ్రామానా ర్యాలీలు, సభలు, సమావే శాలు జరిగాయి. ఉత్సాహంగా వివిధ వర్గాల ప్రజలు పాల్గొన్నారు. ప్రభుత్వం పర్యావరణానికి ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునివ్వడంతో జిల్లా రెవెన్యూ అధికారి ఓబులేషు కార్యాలయానికి సైకిల్‌పై వచ్చారు. ఆయన నివాసం నుంచి సైకిల్ తొక్కుకుంటూ కార్యాలయానికి చేరుకున్నారు. శనివారం కలెక్టరేట్‌లోకి వాహనాల అనుమతిని నిరాకరించారు. రెండు ప్రధాన గేట్లు మూసివేసి అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, వివిధ పనుల కోసం వచ్చిన ప్రజల వాహనాలను బయటే నిలిపివేశారు. కేవలం ఎలక్ట్రికల్ వాహనాలను మాత్రమే అనుమతించారు.