ఫైళ్ల పరిష్కారంలో మంత్రి బెస్ట్
ABN , Publish Date - Dec 11 , 2025 | 01:39 AM
పైళ్ల పరిష్కారం విషయంలో రాష్ట్ర మంత్రివర్గంలోనే డాక్టర్ డోలా బాలవీరాంజనేయస్వామి ముందు వరసలో ఉన్నారు. అధికార యంత్రాంగంలో జిల్లాలో కీలకమైన కలెక్టర్ రాజాబాబు నెమ్మదిగా ఉన్నారు.
మంత్రివర్గంలో ప్రథమస్థానంలో నిలిచిన డాక్టర్ బాలవీరాంజనేయస్వామి
24వ స్థానంలో కలెక్టర్, 9వ స్థానంలో జేసీ
సీఎం సమీక్షలో ఈ-ఆఫీసు పైళ్ల పరిష్కార నివేదికను ప్రకటించిన ప్రభుత్వం
ఒంగోలు, డిసెంబరు 10 (ఆంఽధ్రజ్యోతి) : పైళ్ల పరిష్కారం విషయంలో రాష్ట్ర మంత్రివర్గంలోనే డాక్టర్ డోలా బాలవీరాంజనేయస్వామి ముందు వరసలో ఉన్నారు. అధికార యంత్రాంగంలో జిల్లాలో కీలకమైన కలెక్టర్ రాజాబాబు నెమ్మదిగా ఉన్నారు. ప్రస్తుత ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డాక 17 నెలల్లో శాఖాపరమైన పైళ్లను పరిశీలించి పరిష్కరించడంలో మంత్రి డాక్టర్ స్వామి రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో నిలిచారు. వివిధ అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం అమరావతిలోని సచివాలయంలో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ప్రజలు మెచ్చే విధంగా ప్రతి విభాగం పని చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా చెప్తున్న సీఎం.. మంత్రులు, రాష్ట్రస్థాయి లోని శాఖాధిపతులు, జిల్లాలో అత్యంత కీలకమైన కలెక్టర్, జేసీల పనితీరును ఆయా అంశాలపై బేరీజు వేసి సమీక్ష చేస్తున్నారు. అందులో ఈ-ఆఫీసు ద్వారా వచ్చే పైళ్లను సత్వరం పరిశీలించి పరిష్కరించాలన్న అంశం కూడా ప్రభుత్వ ప్రాధాన్యతలలో ముందు వరుసలో ఉంది. దీనిపై బుధవారం సీఎం సమీక్షలో ఐటీ, ఎలకా్ట్రనిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ విభాగం ఈ-ఆఫీసు పైళ్ల పరిష్కారంపై మంత్రులు, శాఖాధిపతులు, జిల్లాలో కలెక్టర్లు, జేసీల పనితీరును నివేదించారు. రెండు భాగాల్లో నివేదికలు ఇచ్చారు.
17 నెలల పనితీరు ప్రామాణికం
ప్రస్తుత ప్రభుత్వం వచ్చాక 2024 జూలై 15 నుంచి ఈనెల 9 వరకు సుమారు 17 నెలల కాలంలో ఆయా స్థాయిల్లో ఈ-ఆఫీసు ద్వారా వారికి వచ్చిన పైళ్ళు ఎన్ని, వాటిలో ఎన్నింటికి పరిష్కారం చేశారన్నది పరిగణనలోకి తీసుకున్నారు. ఐఏఎస్‌ల విషయంలో రెండు విభాగాలను తీసుకున్నారు. అందులో కలెక్టర్ రాజాబాబు ఇటీవలనే జిల్లాకు రావడంతో ఆయన మూడు నెలల విభాగంలో ఉండగా జేసీ గతం నుంచి ఉండటంతో ఆయన పనితీరు రెండు విభాగాల్లోనూ విశ్లేషించారు. కలెక్టర్ రాజాబాబు ఇక్కడ బాధ్యతలు స్వీకరించిన అనంతరం తనకు వచ్చిన పైళ్ల పరిష్కారంలో మందగమనంతో ఉన్నారు. రాష్ట్రంలోని 26 జిల్లాల కలెక్టర్లలో రాజాబాబు ఏకంగా 24వ స్థానానికి పడిపోయారు.
గత ఏడాది జూలై 15 నుంచి ఈనె ల 9వతేదీ వరకు సుమారు 17 నెలల్లో ఈ ఆఫీసు పైళ్ల పరిష్కారంలో మంత్రివర్గ సభ్యులందరిలోనూ జిల్లాకు చెందిన మంత్రి డాక్టర్ స్వామి ప్రథమస్థానంలో నిలిచారు. ఈ కాలంలో ఆయనకు ఈ ఆఫీసు ద్వారా 629 పైళ్లు రాగా అప్పటికి మరికొన్ని ఉన్నాయి. ఆ మొత్తంలో 651 పరిష్కరించారు. సగటున ఒక్కో ఫైల్ పరిష్కారానికి రెండు రోజుల 41 నిమిషాలు సమయం తీసుకున్నారు.
కలెక్టర్ రాజాబాబుకు ఈ ఏడాది సెప్టెంబరు 9 నుంచి ఈనెల 9వతేదీ వరకు 383 పైళ్లు రాగా 356 పరిష్కరించారు. ఆయన ఒక్కో పైలుకు సగటున 9 రోజుల 8గంటల 32 నిమిషాల సమయం తీసుకున్నారు.
జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ 17నెలల అంశంలో రాష్ట్రంలో 5వ స్థానంలోనూ, మూడు నెలల విషయంలో 9వ స్థానంలో ఉన్నారు. ఆయనకు 17నెలల విభాగంలో 3,755 పైళ్లు ఈ ఆఫీసు ద్వారా రాగా 3,695 పరిష్కరించారు. అలాగే మూడు నెలల విభాగంలో 494 పైళ్లు రాగా 441 పరిష్కారం చేశారు.