Share News

విధేయులకే మళ్లీ పట్టం

ABN , Publish Date - May 12 , 2025 | 01:50 AM

మలివిడత నామినేటెడ్‌ పదవుల భర్తీలోనూ పార్టీ విధేయులకే టీడీపీ అధిష్ఠానం పట్టం కట్టింది. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) పర్సన్‌ ఇన్‌చార్జి (చైర్మన్‌)గా ఒంగోలుకు చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్‌ కామేపల్లి సీతారామయ్యను ఖరారు చేసింది.

విధేయులకే మళ్లీ పట్టం
దామచర్లకు కృతజ్ఞతలు తెలుపుతున్న సీతారామయ్య , కాశిరెడ్డికి కేక్‌ తినిపిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్ర

పీడీసీసీ బ్యాంకు చైర్మన్‌గా డాక్టర్‌ సీతారామయ్య

డీసీఎంఎస్‌కు కాశిరెడ్డి

రియాజ్‌కు రాష్ట్ర కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

మలివిడత నామినేటెడ్‌ పదవుల భర్తీలోనూ పార్టీ విధేయులకే టీడీపీ అధిష్ఠానం పట్టం కట్టింది. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) పర్సన్‌ ఇన్‌చార్జి (చైర్మన్‌)గా ఒంగోలుకు చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్‌ కామేపల్లి సీతారామయ్యను ఖరారు చేసింది. జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ చైర్మన్‌గా కనిగిరి నియోజకవర్గానికి చెందిన శ్యామల కాశిరెడ్డి పేరును ప్రకటించింది. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు రియాజ్‌కు రాష్ట్ర కార్పొరేషన్‌ పదవిని కట్టబెట్టింది. తద్వారా ఒంగోలు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఒడా) చైర్మన్‌ పదవి టీడీపీకి ఖాయమన్న సంకేతాన్ని కూటమి పార్టీల అధిష్ఠానాలు ఇచ్చాయి.

ఆది నుంచి టీడీపీతోనే సీతారామయ్య

డాక్టర్‌గా సుపరిచితులైన సీతారామయ్య తెలుగుదేశం కుటుంబం నుంచి వచ్చి ఆపార్టీలోనే కొనసాగుతున్నారు. ఆయన తండ్రి దివంగత రమణారావు 1989లో టీడీపీ తరపున ఒంగోలు ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు. సీతారామయ్య డాక్టర్‌గా గుర్తింపు పొందడంతోపాటు ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌లో పలు పదవులు నిర్వహించారు. ఒంగోలులో లయన్స్‌ క్లబ్‌ ద్వారా సేవలందించారు. టీడీపీలో డాక్టర్స్‌ వింగ్‌కు నాయకత్వం వహించారు. గత టీడీపీ ప్రభుత్వంలో నాలుగేళ్లపాటు రిమ్స్‌ అభివృద్ధి కమిటీ ఛైర్మన్‌గా వ్యవహరించారు. అనేక విపత్కర పరిస్థితుల్లోనూ టీడీపీలో కొనసాగడం, నాయకులందరితో సమన్వయంగా ఉండటం ఆయనకు కలిసొచ్చింది.

పార్టీలో కాశిరెడ్డి కీలకమే

కనిగిరి నియోజకవర్గం వెలిగండ్ల మండలానికి చెందిన శ్యామల కాశిరెడ్డి డీసీఎంఎస్‌ చైర్మన్‌గా నియమితులయ్యారు. పారిశ్రామికవేత్త అయిన ఆయన కనిగిరి నియోజకవర్గంలో ప్రత్యేకించి తన సొంత మండలమైన వెలిగండ్లలో టీడీపీకి కీలక నేతగా ఉన్నారు. 2013లో టీడీపీలో చేరిన ఆయన 2014 ఎన్నికల్లో పనిచేయడమే గాక వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ పక్షాన ముందుండి పనిచేశారు. వరుసగా మూడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ టీడీపీ తరఫున కీలకంగా వ్యవహరించారు. తనతండ్రి పేరుతో ట్రస్టును ఏర్పాటుచేసి నియోజకవర్గంలో విస్తృతంగా సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్ర ఆయన పేరును ప్రతిపాదించారు.

రియాజ్‌ విషయంలో మారిన ప్రతిపాదన

జనసేన జిల్లా అధ్యక్షుడు రియాజ్‌కు రాష్ట్రస్థాయి పదవి దక్కింది. ఆంధ్రప్రదేశ్‌ లైవ్‌స్టాక్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ (పశుగణాభివృద్ధి సంస్థ) చైర్మన్‌గా నియమితులయ్యారు. నిజానికి ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్‌ సహకారంతో ఒంగోలు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఒడా) చైర్మన్‌ పదవిని రియాజ్‌ ఆశించారు. ఎమ్మెల్యే జనార్దన్‌ ఆయన పేరునే సూచించారు. అయితే జిల్లాలో ఎక్కువ నియోజకవర్గాలతో సంబంధం ఉన్న ఆ పదవిని టీడీపీకే కేటాయించాలని ఆపార్టీ ప్రజాప్రతినిధులు అధిష్ఠానానికి సూచించారు. ఈ విషయంలో మంత్రి నారా లోకేష్‌ పరిశీలన అనంతరం ఒడా చైర్మన్‌ పదవిని టీడీపీ నేతకే ఇవ్వాలని జనసేన నాయకత్వంతో మాట్లాడినట్లు తెలిసింది. తదనుగుణంగా జనసేన నాయకత్వం రియాజ్‌ పార్టీకి చేసిన సేవలను గుర్తించి రాష్ట్రస్థాయి కార్పొరేషన్‌ పదవికి ఎంపిక చేసింది. దీంతో ఒడా పదవిపై టీడీపీ నాయకుల మధ్య పోటీ పెరిగింది. అందిన సమాచారం మేరకు కాపు లేక దళిత సామాజిక వర్గాలకు చెందిన నేతల్లో ఒకరికి ఈ పదవిని కట్టబెట్టాలన్న ఆలోచనలో టీడీపీ అధిష్ఠానం ఉన్నట్లు తెలిసింది.

Updated Date - May 12 , 2025 | 01:50 AM