Share News

బడాబాబుల భూ మాయ

ABN , Publish Date - Sep 12 , 2025 | 02:23 AM

ఒంగోలు నగర నడిబొడ్డున రూ.కోట్ల విలువ చేసే బండ్లమిట్ట బీటీ రోడ్డు, కార్పొరేషన్‌కు చెందిన ఊరచెరువులో ఆక్రమణలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. గత వైసీపీ పాలనలో నాటి పాలకులు, ఆ పార్టీ ప్రజాప్రతినిధుల అండదండలతో కొందరు బడాబాబులు నకిలీ డీకే పట్టాలు సృష్టించి భారీ భవంతులు నిర్మించారు.

బడాబాబుల భూ మాయ
బండ్లమిట్ట రోడ్డును ఆక్రమించి నిర్మించిన భారీ భవంతులు

బండ్లమిట్ట బీటీ రోడ్డు.. ఊరచెరువులో ఆక్రమణలు

నాటి వైసీపీ పెద్దల అండతో అడ్డగోలుగా నిర్మాణాలు

అన్నీ తెలిసినా మౌనం వహించిన అధికారులు

కబ్జాలపై లోకాయుక్తకు ఫిర్యాదు

ఒంగోలు నగర నడిబొడ్డున రూ.కోట్ల విలువ చేసే బండ్లమిట్ట బీటీ రోడ్డు, కార్పొరేషన్‌కు చెందిన ఊరచెరువులో ఆక్రమణలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. గత వైసీపీ పాలనలో నాటి పాలకులు, ఆ పార్టీ ప్రజాప్రతినిధుల అండదండలతో కొందరు బడాబాబులు నకిలీ డీకే పట్టాలు సృష్టించి భారీ భవంతులు నిర్మించారు. అప్పట్లో నగరపాలక సంస్థ అధికారులు మౌనం వహించడం విమర్శలకు తావిచ్చింది. ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆవైపు అధికారులు కన్నెత్తి చూడకపోవడం పట్ల ప్రజలు పెదవి విరుస్తున్నారు.

ఒంగోలు కార్పొరేషన్‌, సెప్టెంబరు11 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆపార్టీ పెద్దల సహకారం ఆక్రమణదారులకు కలిసొచ్చింది. ప్రభుత్వ స్థలం కబ్జాచేసి, ప్లాను లేకుండా పన్నులు వేయించుకున్నారు. యథేచ్ఛగా అనుభవించడంతోపాటు, వ్యాపార కేంద్రాలుగా మార్చేశారు. ఇంత జరుగుతున్నా అప్పట్లో అధికారులు చర్యలు తీసుకునేందుకు వెనకడుగు వేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మిన్నకుండటంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. తాజాగా ఊరచెరువు, బండ్లమిట్ట బీటీ రోడ్డు ఆక్రమణలపై సామాజిక కార్యకర్త ఎం.మాధవరావు లోకాయుక్తను ఆశ్రయించారు. ఊరచెరువు ఆక్రమణలు, అడ్డగోలు నిర్మాణాలు, అందులో భాగస్వాములైన వారి పేర్లను వివరిస్తూ ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. ఇప్పటికైనా కార్పొరేషన్‌ అధికారులు ఆక్రమణలపై ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది.

నకిలీ పట్టాలతో పాగా.. అందులో భారీ భవనాలు

ఒంగోలు నగర సర్వే నెం.14/1 ఊరచెరువు, బండ్లమిట్ట నుంచి అద్దంకి బస్టాండ్‌కు వెళ్లే బీటీ రోడ్డులో రూ.కోట్ల విలువ చేసే భారీ భవంతులు అడ్డగోలుగా నిర్మించారు. అయితే సామాన్యుడు భవనం కట్టుకోవాలంటే సవాలక్ష నిబంధనలతో అభ్యంతరం చెప్పే కార్పొరేషన్‌ అధికారులు డీకే పట్టాలలో భవనాలు కట్టినా మౌనం వహించారు. ముఖ్యంగా అక్కడ సృష్టించిన నకిలీ పట్టాలకు అక్కడి సర్వే నంబరు వేయకుండా రాజీవ్‌నగర్‌కు చెందిన సర్వే నంబర్‌ వేసి మరీ భవనాలకు పన్ను విధించారు. ప్రస్తుతం ఈ భవనాల్లో షాపింగ్‌ మాల్స్‌, వ్యాపార సముదాయాలు, నిర్మించారు. అయితే వాటికి కార్పొరేషన్‌ నుంచి ఎలాంటి అనుమతులు లేవు. వాస్తవానికి సర్వే నంబర్‌ 14/1 ఊరచెరువు కార్పొరేషన్‌కు చెందినది కాగా ప్రస్తుతం ఆ స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేయకూడదని హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి. అయినప్పటికీ కార్పొరేషన్‌ అధికారులు కన్నెత్తి చూడలేదు. మరోవైపు ఏడాది క్రితం బండ్లమిట్ట బీటీ రోడ్డు విస్తరణ చేసేందుకు కార్పొరేషన్‌ అధికారులు మార్కింగ్‌ చేసి కాస్తంత హడావుడి చేసినా, ఆ తర్వాత పెద్దగా పట్టించుకోకపోవడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి.

వారంతా వైసీపీ నిరుపేదలంట.

ఊరచెరువు, బండ్లమిట్ట బీటీ రోడ్డులో ఆక్రమణలు చేసిన వారిలో అత్యధిక శాతం మంది వైసీపీకి చెందినవారు ఉన్నారు. వారందరినీ పేదలుగా గుర్తించి డీకే పట్టాలు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉంది. ముఖ్యంగా డీకే పట్టాలు పొంది, భవనాలు నిర్మించిన వారిలో వైసీపీకి చెందిన ఒడా మాజీ చైర్మన్‌ భర్త, వారి బంధువుల పేరుతో పట్టాలు ఉన్నాయి. పోలీసు శాఖలో పనిచేసిన ఓ విశ్రాంత ఏఎస్‌ఐ, క్రికెట్‌ బెట్టింగ్‌లో పేరు పొందిన మరో వ్యక్తికి కూడా షాపులు ఉన్నాయి. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి నిర్మించిన భవనాల ద్వారా అద్దెల రూపంలో లక్షలు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. అయితే నకిలీ పట్టాలు సృష్టించి భారీ భవంతులు నిర్మించిన వాటికి కార్పొరేషన్‌ అధికారులు సైతం పన్ను విధించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఆక్రమణలపై లోకాయుక్తలో ఫిర్యాదు

ఊరచెరువులో ఆక్రమణలు, అక్రమ కట్టడాలపై సామాజిక కార్యకర్త ఎం.మాధవరావు లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. ఆధారాలను కూడా ఆయన సమర్పించినట్లు సమాచారం.ముఖ్యంగా నకిలీ డీకే పట్టాలు సృష్టించి వాటికి నకిలీ సర్వే నంబర్లతో పన్ను వేయించడం,ప్లాను లేకుండా షాపులు నిర్మించడం, ఆ భవనాలకు తాగునీటి కోసం కార్పొరేషన్‌ నుంచి కొళాయిలు కూడా పొందారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఆక్రమణల వ్యవహారంలో కీలకదారులంతా వైసీపీలో పేరు ఉన్న వ్యక్తులు కాగా, వారి బంధువుల కూడా ఉన్నట్లు ఆయన ఫిర్యాదులో స్పష్టం చేశారు. దీనిపై కార్పొరేషన్‌ అధికారులు ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది.

Updated Date - Sep 12 , 2025 | 02:23 AM