Share News

ఆక్రమణదారుల సరికొత్త ఎత్తులు

ABN , Publish Date - Sep 07 , 2025 | 02:22 AM

విలువైన ప్రభుత్వ స్థలాలను కొట్టేసేందుకు అక్రమార్కులు కొత్త ఎత్తులు వేస్తున్నారు. నేరుగా ఆక్రమణలకు అవకాశం లేనిచోట దేవుళ్ల విగ్రహాలను నెలకొల్పి సెంటిమెంట్‌ను రేకెత్తిస్తున్నారు. కొంతకాలం తర్వాత ఆ స్థలాలను సొంతం చేసుకుంటున్నారు. అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తుండటంతో రూ.కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాలు పరులపరమవుతున్నాయి.

ఆక్రమణదారుల సరికొత్త ఎత్తులు
దర్శిలోని కాటేరు వాగు భూమిలో ఏర్పాటు చేసిన ఆంజనేయస్వామి విగ్రహం (ఫైల్‌)

ప్రభుత్వ స్థలాల్లో దేవుని విగ్రహాలను ఏర్పాటు చేసి ఉద్రిక్తతలు

ఉదాసీన వైఖరి అవలంబిస్తున్న అధికారులు

రూ.కోట్ల ప్రభుత్వ భూములు పరులపరం

దర్శి, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి) : విలువైన ప్రభుత్వ స్థలాలను కొట్టేసేందుకు అక్రమార్కులు కొత్త ఎత్తులు వేస్తున్నారు. నేరుగా ఆక్రమణలకు అవకాశం లేనిచోట దేవుళ్ల విగ్రహాలను నెలకొల్పి సెంటిమెంట్‌ను రేకెత్తిస్తున్నారు. కొంతకాలం తర్వాత ఆ స్థలాలను సొంతం చేసుకుంటున్నారు. అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తుండటంతో రూ.కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాలు పరులపరమవుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. ఆ పార్టీ నాయకులు రూ.కోట్ల ఆస్తులను స్వాహా చేశారు. దర్శి-పొదిలి రోడ్డులో వందల ఎకరాల్లో విస్తరించి ఉన్న కాటేరువాగు అధిక శాతం ఆక్రమణకు గురైంది. దర్శి-పొదిలి ప్రధాన రహదారికి దగ్గరలో ఉన్న సుమారు ఎకరం స్థలం కోట్ల రూపాయల ధర పలుకుతోంది. ఆ రోడ్డుకు సమీపంలో కాటేరు వాగుకు సంబంధించిన భూమిని కొట్టేసేందుకు వైసీపీ నాయకుడు మూడేళ్ల క్రితం ప్రయత్నించాడు. అది సాధ్యం కాకపోవడంతో సరికొత్త ఎత్తుగడ వేశాడు. కొంతమంది అక్రమార్కులతో కలిసి ఆ భూమిలో ఆంజనేయస్వామి విగ్రహాన్ని తాత్కాలికంగా ఏర్పాటు చేశాడు. ప్రభుత్వ అధికారులు అక్కడ హెచ్చరిక బోర్డులు పెట్టి వదిలేశారు. ఆ స్థలం సంరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తాజాగా ముండ్లమూరు మండలంలోని పసుపుగల్లులో వైసీపీ నాయకుడు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టగా పోలీసు అధికారులు తొలగించారు. అయితే వైసీపీ నాయకుడు ఆ స్థలాన్ని ఎలాగైనా దక్కించుకోవాలన్న ఉద్దేశంతో రెండు రోజుల క్రితం అక్కడ దేవుళ్ల బొమ్మలు ఏర్పాటు చేశారు. ఈ స్థలాన్ని ఆలయాల నిర్మాణానికి ఇస్తున్నట్లు ప్రకటించాడు. ప్రభుత్వ స్థలంలో దేవుళ్ల బొమ్మలు పెట్టి సమస్య మరింత జటిలం చేస్తున్నారని స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు వెళ్లి ఆ బొమ్మలను తొలగించారు. అధికారులు ఇలాంటి చర్యలను ఆదిలోనే కట్టడి చేసి ఉంటే ఇలాంటి ఆలోచన అక్రమార్కులకు వచ్చేదికాదు. వారు పట్టీపట్టనట్లు వ్యవహరించడంతో ప్రభుత్వ స్థలాల స్వాహాకు రకరకాల ఎత్తులు వేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలు కొనసాగుతూనే ఉన్నాయి. అధికారులు ఇప్పటికైనా స్పందించి ప్రభుత్వ స్థలాలను కాపాడాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - Sep 07 , 2025 | 02:22 AM