Share News

ఆక్రమణలు మళ్లీ ఎప్పటిలానే...!

ABN , Publish Date - Dec 11 , 2025 | 11:26 PM

మార్కాపురం పట్టణ పరిధిలోని ప్రధాన రహదారులు ప్రాంతాన్ని బట్టి గతంలో 40 నుంచి 80 అడుగుల వెడల్పుతో ఉండేవి. కాలక్రమంలో ఆక్రమణల పుణ్యమా అని రహదారులు కుంచించుకుపోయాయి.

ఆక్రమణలు మళ్లీ ఎప్పటిలానే...!
కోర్టు సెంటర్‌ ప్రాంతంలో ట్రాఫిక్‌ స్తంభించిపోతే ఇదీ పరిస్థితి

మార్కాపురం జిల్లా కేంద్రంతో మరింత పెరగనున్న వాహన రద్దీ ఇబ్బందులు

పట్టణంలో ఆక్రమణలు తొలగించి ఏడాది...

ప్రస్తుతం యథావిధిగా కుంచించుకుపోయిన రోడ్లు

పెరిగిన ట్రాఫిక్‌ కష్టాలు

మార్కాపురం, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి) : మార్కాపురం పట్టణంలో నానాటికీ పెరిగిపోతున్న ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రధాన రహదారుల్లో ఆక్రమణలు తొలగించాలని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి యోచించారు. అందుకనుగుణంగా పలు శాఖల సమన్వయంతో 2024 నవంబరులో ఆక్రమణల తొలగింపు కార్యక్రమం చేపట్టారు. స్థానిక గడియార స్తంభం నుంచి ఆర్టీసీ డిపో వరకు, పూల సుబ్బయ్యకాలనీ వరకు రెండు వైపులా మురుగు కాలువలపైన, రహదారులపైకి వచ్చిన నిర్మాణాలను తొలగించారు. అదేవిధంగా కంభం రోడ్డు, విశ్వేశ్వర థియేటర్‌ నుంచి మెయిన్‌ బజారు వరకు కూడా కొంతమేర తొలగించారు. ముఖ్యంగా వన్‌వే ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ కష్టాలు తప్పించాలని అప్పట్లో అమలు కూడా చేశారు. అధికారుల అలసత్వం, వ్యాపారుల స్వార్థం పుణ్యాన అది మూణ్ణాళ్ల ముచ్చటే అయింది. ప్రస్తుతం కంభం వెళ్లే రహదారిలో మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో షరామామూలుగానే పాత పరిస్థితే పునరావృతమైంది. పాలకులు చిత్తశుద్ధి చూపినా అధికార యంత్రాంగం నిర్లక్ష్యంతో మళ్లీ ఆక్రమణలు యథావిధిగానే ప్రారంభమయ్యాయి. మార్కాపురం పట్టణం త్వరలో జిల్లా కేంద్రంగా రూపాంతరం చెందనుంది. దీంతోపాటే అధికార యంత్రాంగం, వాహనాల రద్దీ కూడా పెరుగుతుంది. ఇలాంటి సమయంలో యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణతో మళ్లీ రహదారులను విస్తరించాల్సిన అవసరం ఉంది.


మళ్లీ యథాతథమే..

మార్కాపురం పట్టణ పరిధిలోని ప్రధాన రహదారులు ప్రాంతాన్ని బట్టి గతంలో 40 నుంచి 80 అడుగుల వెడల్పుతో ఉండేవి. కాలక్రమంలో ఆక్రమణల పుణ్యమా అని రహదారులు కుంచించుకుపోయాయి. ముఖ్యంగా గడియారస్తంభం నుంచి సెవెన్‌హిల్స్‌ లాడ్జి వరకు, మెయిన్‌ బజార్‌, రథం బజార్‌, అరవింధ్‌ఘోస్‌ వీధి, కంభం రోడ్డు ఆక్రమణలతో ఇరుకుగా మారాయి. ఒకప్పుడు పెద్దపాటి లారీలు తిరిగిన కొన్ని వీధుల్లో నేడు ఆటోలు కూడా తిరగలేని దుస్థితి. గతం కంటే రహదారులు ఇరుకుగా మారడం, వాహనాలు ఇబ్బడిముబ్బడిగా పెరగడంతో ట్రాఫిక్‌ ఇబ్బందులు ఎక్కువయ్యాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్‌ స్తంభించిపోతోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ట్రాఫిక్‌ కష్టాలు తీర్చేందుకు ఆక్రమణల తొలగింపు చేపట్టింది. మూడు నెలలపాటు బాగానే ఉన్నా మళ్లీ కాలువలపైకి ఆక్రమణలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం గతంలో మాదిరే బంకులు, చిన్నపాటి నిర్మాణాలు మళ్లీ వెలిశాయి. ఒక్క కంభం రోడ్డులో షాదీఖానా నుంచి జడ్పీ బాలికల పాఠశాల చివరి వరకు తొలగించిన బంకుల స్థానే ఎలాంటి ఆక్రమణలకు తావివ్వలేదు. రెండో వైపు కాలువలపై అప్పట్లో తొలగించినా మళ్లీ యధావిధిగానే నిర్మాణాలు చేపట్టారు.

జిల్లా కేంద్రంతో పెరగనున్న కష్టాలు

రాష్ట్ర ప్రభుత్వం మార్కాపురం జిల్లా ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది. వచ్చే నెలలోనే పాలన ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. జిల్లా కేంద్రం అయితే ట్రాఫిక్‌ కష్టాలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ శాఖలకు సంబంధించి అధికార యంత్రాంగం సంఖ్య పెరగనుంది. దాంతోపాటే జిల్లా కేంద్రానికి ఇతర నియోజకవర్గాల నుంచి రాకపోకలు సాగించే వాహనాల సంఖ్య రెట్టింపు అవుతుంది. ప్రస్తుతం తిరిగే వాహనాలతోనే ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్‌ స్తంభించిపోతుంటే భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు తప్పవు. వీటి నుంచి బయటపడాలంటే గతంలో మాదిరి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. వన్‌ వేను ఖచ్ఛితంగా అమలు చేస్తేనే కొంతమేరకైనా తాత్కాలికంగా ఇబ్బందులు తప్పుతాయి. ఆ దిశగా పాలకులు అడుగులు వేయాల్సి ఉంది.

Updated Date - Dec 11 , 2025 | 11:26 PM