పల్లె పేదల ఆకలితీరనుంది..!
ABN , Publish Date - Dec 23 , 2025 | 01:26 AM
పేదల ఆకలి తీర్చడంపై ప్రజా ప్రభుత్వం మరోసారి దృష్టి సారిం చింది. ఇప్పటివరకు పట్టణాలకు మాత్రమే పరిమితమైన అన్న క్యాంటీన్‌లను గ్రామీణ ప్రాంతాల్లోనూ అందుబాటులోకి తెస్తోంది.
ఉమ్మడి జిల్లాలో మరో నాలుగు అన్న క్యాంటీన్లు
వైపాలెం, దర్శి, మార్టూరు, సింగరాయకొండలో ఏర్పాటు
జనవరి నాటికి ప్రారంభించేలా చర్యలు
గ్రామీణ ప్రాంతాలకు విస్తరించేలా ప్రజాప్రభుత్వం దృష్టి
10 నుంచి 14కు పెరుగుతున్న అన్న క్యాంటీన్‌ల సంఖ్య
ఒంగోలు కార్పొరేషన్, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి) : పేదల ఆకలి తీర్చడంపై ప్రజా ప్రభుత్వం మరోసారి దృష్టి సారిం చింది. ఇప్పటివరకు పట్టణాలకు మాత్రమే పరిమితమైన అన్న క్యాంటీన్‌లను గ్రామీణ ప్రాంతాల్లోనూ అందుబాటులోకి తెస్తోంది. ఉమ్మడి జిల్లాలో కొత్తగా నాలుగు అన్న క్యాంటీన్‌లను ఏర్పాటు చేస్తోంది.గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రారం భించిన అన్న క్యాంటీన్లను అనంతరం అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం మూసివేసింది. క్యాంటీన్‌ల భవనాలను వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు, సచివాలయాలకు కేటాయించింది. ప్రస్తుత ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిపై దృష్టి సారించింది. ఆ క్రమంలోగత ఏడాది ఆగస్టు 15న రాష్ట్రవ్యాప్తంగా113 నియోజకవర్గాలలో 202 క్యాంటీన్లను పునఃప్రారంభించింది. దీంతో ప్రతిరోజూ వేలాది మంది పేదలు, సామాన్యులు రూ.5కే మూడు పూటలా ఆకలి తీర్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వాటిని గ్రామీణ ప్రాంతాలకు విస్తరించేం దుకు తాజాగా రాష్ట్రంలో మరో63 అన్న క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకురా వాలని నిర్ణయించింది. వాటిలో ఉమ్మడి జిల్లాలోని ఎర్రగొండపాలెం, దర్శి, మా ర్టూరు, సింగరాయకొండ ఉన్నాయి. ఒక్కో దాని నిర్మాణానికి రూ.61లక్షలు ఖర్చు చేస్తున్నారు. వచ్చే ఏడాది జనవరిలో వీటిని అందుబాటులోకి తెచ్చేందుకు అవ సరమైన నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉమ్మడి జిల్లాలో ఒంగోలులో నాలుగు, కనిగిరిలో ఒకటి, గిద్దలూరులో ఒకటి, మార్కాపురంలో ఒకటి ఉండగా, చీమకుర్తిలో ఒకటి, అద్దంకిలో ఒకటి, చీరాలలో మరొకటి తిరిగి తెరుచుకోవడంతో ఆ ప్రాంతాల ప్రజలు కడుపునిండా భోజనం చేస్తున్నారు ఇప్పటివరకు 10 అన్న క్యాంటీన్‌లు ఉండగా, కొత్తగా మరో నాలుగు క్యాంటీన్లు ఏర్పాటు చేస్తుండటంతో వాటి సంఖ్య14కు పెరగనుంది.
రూ.5కే కడుపునిండా భోజనం
2014 ఎన్నికల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేదల అకలి సమస్యలను దగ్గరగా గమనించారు. ఆ సమయంలో అధికారంలోకి రాగానే పేదవారికి అతి తక్కువ ధరకే ఆకలి తీరుస్తామని హామీలు ఇచ్చారు. అందులో భాగంగానే 2014 సెప్టెంబరులో అన్న క్యాంటిన్‌లకు శ్రీకారం పలికారు. రూ.5కే 450 గ్రాముల అన్నం, పప్పు/సాంబార్, కూర, అవసరాన్ని బట్టి పెరుగు, ఊరగాయ పచ్చడి ఇస్తున్నారు. టిఫిన్‌గా రూ.5కు ఇడ్లీ/పూరి, అందిస్తున్నారు.