Share News

ప్రజాప్రభుత్వంలో అన్నదాత సుఖీభవ

ABN , Publish Date - Aug 10 , 2025 | 10:44 PM

రైతు సంక్షేమానికి సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం మునుపెన్నడూ లేనివిధంగా పెట్టుబడి నిధులు, రాయితీలు, ప్రోత్సాహకాలు అందిస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి చెప్పారు.

ప్రజాప్రభుత్వంలో అన్నదాత సుఖీభవ
ట్రాక్టర్‌ నడుపుతున్నమారిటైంబోర్డు చైర్మన్‌ దామచర్ల సత్య, పక్కన మంత్రి స్వామి

రైతు సంక్షేమం కోసం సీఎం చంద్రబాబు కృషి

సాగు పెట్టుబడికి నిధులు

రాయితీతో యంత్ర పరికరాలు

బిందుసేద్యం, ప్రకృతి సేద్యాలకు ప్రోత్సాహం

మంత్రి స్వామి, సత్య

భారీగా ట్రాక్టర్లతో ర్యాలీలో పాల్గొన్న రైతులు

జరుగుమల్లి/కొండపి, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి) : రైతు సంక్షేమానికి సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం మునుపెన్నడూ లేనివిధంగా పెట్టుబడి నిధులు, రాయితీలు, ప్రోత్సాహకాలు అందిస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి చెప్పారు. రైతులు ఆదివారం సాయంత్రం కామేపల్లి నుంచి చిర్రికూరపాడు వరకు పది కిలోమీటర్లు దూరం ట్రాక్టర్లతో నిర్వహించిన అన్నదాత సుఖీభవ కృతజ్ఞతా ర్యాలీలో మంత్రి స్వామి, ఏపీ మారిటైం బోర్డు చైర్మన్‌ దామచర్ల సత్యలు పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం చిర్రికూరపాడు గ్రామంలోని బస్టాండ్‌ సెంటర్‌లో జరిగిన సభలో మంత్రి మాట్లాడారు. రైతులకు అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్‌ పథకం ద్వారా తొలి విడత నిధులు ఏడు వేల రూపాయలు సకాలంలో రైతులకు అందించామన్నారు. రాయితీపై ట్రాక్టర్‌ అనుబంధ యంత్ర పరికరాలు, డ్రిప్‌ పైపులు ప్రభుత్వం అందజేస్తోందన్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ద్వారా రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని చెప్పారు. ఏపీ మారిటైం బోర్డు చైర్మన్‌ దామచర్ల సత్య మాట్లాడుతూ నియోజకవర్గంలోని 36,808 మంది రైతులకు అన్నదాత సుఖీభవ కింద దాదాపు 25 కోట్ల రూపాయల లబ్ధి చేకూరిందన్నారు. ర్యాలీకి ముందుగా కామేపల్లిలోని బస్టాండ్‌ సెంటర్‌లోని దివంగత సీఎం ఎన్టీఆర్‌, దివంగత మంత్రి దామచర్ల ఆంజనేయులు విగ్రహాలకు పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు పోకూరి రవీంద్రబాబు, సీనియర్‌ నాయకుడు పోటు శ్రీనివాసమురళి, కామేపల్లి మాజీ సర్పంచ్‌ ఏలూరి రాంబాబు, నాయకులు దగ్గుమాటి సుబ్బారెడ్డి, నలమోతు వెంకటేశ్వర్లు, కొమ్మాలపాటి కృష్ణ, చెన్నారెడ్డి వెంకటేశ్వర్లు, చదలవాడ బ్రహ్మేంద్రం, బీజేపీ, జనసేన నేతలు పాల్గొన్నారు.

200 ట్రాక్టర్లతో భారీగా ర్యాలీ...

కామేపల్లిలోని జడ్పీస్కూల్‌ నుంచి దాదాపు 200 ట్రాక్టర్లతో రైతులు భారీగా ర్యాలీ నిర్వహించారు. ర్యాలీకి ముందు భాగాన మినీ ట్రాక్టర్‌ను ఏపీ మారిటైంబోర్డు చైర్మన్‌ దామచర్ల సత్య నడపగా పక్క సీట్లో మంత్రి స్వామి కూర్చుని ర్యాలీలో అగ్రభాగాన సాగారు.

Updated Date - Aug 10 , 2025 | 10:44 PM