అంగరంగ వైభవం.. నరసింహుడి బ్రహ్మోత్సవం
ABN , Publish Date - Jun 12 , 2025 | 11:18 PM
దక్షిణ సింహాచలంగా పేరుగాంచిన పాతసింగరాయకొండ వరాహ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.
ఘనంగా పాతసింగరాయకొండలో వసంతోత్సవం
స్వామిని దర్శించుకున్న అధిక సంఖ్యలో భక్తులు
సింగరాయకొండ, జూన్ 12 (ఆంధ్రజ్యోతి) : దక్షిణ సింహాచలంగా పేరుగాంచిన పాతసింగరాయకొండ వరాహ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన గురువారం మూలవిరాట్ వరాహ లక్ష్మీనరసింహస్వామి, అమ్మవార్లు రాజ్యలక్ష్మి, గోదాదేవి, యోగానంద లక్ష్మీనరసింహస్వామి, స్వయంభు ఆంజనేయుడిని పూలతో అలంకరించి పూజలు నిర్వహించారు. భక్తులు అధికసంఖ్యలో స్వామివార్లను దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. తెల్లవారుజామున గరుడవాహనంపై కొలువుదీరిన స్వామివారిని మోతకాపులు పార్వేట ఉత్సవానికి సోమరాజుపల్లికి మోసుకెళ్లారు. అక్కడి గ్రామస్థులు స్వామికి పందిళ్లువేసి హారతులు పట్టారు. అనంతరం ఉదయం చప్పరం వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రికి స్వామికి శాస్ర్తోక్తంగా వసంతోత్సవం నిర్వహించారు. అనంతరం మోతకాపులు గ్రామోత్సవానికి తీసుకెళ్లారు. విద్యుత్ అలంకరణలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఈవో పి.కృష్ణవేణి, ప్రధాన అర్చకుడు ఉదయగిరి వెంకటశేషాలక్ష్మీనరసింహాచార్యులు, అర్చకుడు నరసింహాచార్యులు, రికార్డు అసెస్టింట్ బాపట్ల బ్రహ్మయ్య పాల్గొన్నారు. నేడు ఉదయం స్వామికి కల్యాణం, సాయంత్రం రథోత్సవం నిర్వహించనున్నారు