Share News

జల సంరక్షణే లక్ష్యం

ABN , Publish Date - Nov 16 , 2025 | 01:21 AM

జిల్లాలో గ్రామాల వారీ నీటి బడ్జెట్‌ (లెక్కల)పై నీటి యాజమాన్య సంస్థ దృష్టి సారించింది. వచ్చే ఏడాది ఉపాధి హామీ పథకంలో జలసంరక్షణ పనులకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశించాయి.

జల సంరక్షణే లక్ష్యం
రాచర్ల మండలం సత్యవోలులో జలసంరక్షణ పనుల నమూనాను పరిశీలిస్తున్న అధికారులు (ఫైల్‌)

అందుకు అనుగుణంగానే ఉపాధి పనులు

నీటి నిల్వపైనే ప్రభుత్వాల దృష్టి

రానున్న ఏడాది లేబర్‌ బడ్జెట్‌లో అదే ప్రధానం

వర్షపు నీటిని ఒడిసిపట్టేలా ప్రతిపాదనలు

జిల్లాలో గ్రామాల వారీ నీటి బడ్జెట్‌ (లెక్కల)పై నీటి యాజమాన్య సంస్థ దృష్టి సారించింది. వచ్చే ఏడాది ఉపాధి హామీ పథకంలో జలసంరక్షణ పనులకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశించాయి. ఈ నేపథ్యంలో సమగ్ర నీటి ప్రణాళికకు ఆశాఖ చర్యలు ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం 90శాతం నిధులను ఉపాధి హామీ పథకానికి ఇస్తుండగా రాష్ట్రంలో పెద్దఎత్తున కూలీలకు పనుల కల్పన జరుగుతోంది. అలాగే ఆ పథకం మెటీరియల్‌ కోటా నిధుల ద్వారా గ్రామాల్లో మౌలిక సదుపాయాల పెంపు పనులను రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోంది. జిల్లాలోనూ పెద్దఎత్తున పనులు చేస్తున్నారు. అయితే ఈసారి నీటి సంరక్షణపై దృష్టి సారించడం విశేషం.

ఒంగోలు, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి) : ఉపాధి హామీ పథకాన్ని అటు కూలీలకు ప్రయోజనకరంగా, ఇటు గ్రామాల్లో సౌకర్యాల పెంపునకు పెద్దఎత్తున ఉపయోగిస్తున్నారు. ఆ పనుల్లో భాగంగా వచ్చే ఏడాది నీటి సంర క్షణకు పూర్తి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభు త్వాలు ఆదేశించాయి. ప్రధానంగా గ్రామాల వారీ ప్రస్తుతం ఉన్న నీటి వనరులు, వాటి ద్వారా లభ్యత, ఆ గ్రామంలో అవసరాలను లెక్కించి లోటును వర్షపు నీరు నిల్వ చేయ డం, లేదా భూమిలోకి ఇంకేలా చూసి భర్తీ చేసే పనులు చేపట్టాలన్న ఆదేశాలు ప్రభు త్వం నుంచి అందాయి. దీంతో ఆవైపు జిల్లాలో డ్వామా అధికారులు దృష్టి సారిం చారు. ఏటా అక్టోబరు నుంచి డిసెంబరు ఆఖరు వరకు తదుపరి ఏడాది గ్రామాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టే పనుల గుర్తింపు, అంచనాలు రూపొందించడం వంటి ప్రక్రియను డ్వామా సిబ్బంది చేస్తారు. అలా వచ్చే ఏడాదికి సంబంధించిన ప్రక్రియను ప్రస్తుతం ప్రారంభించారు. ఈ సమయంలోనే నీటి లెక్కలు తేల్చి తదనుగుణంగా వచ్చే ఏడాది పనులు ప్రతిపాదించాలని క్షేత్రస్థాయి సిబ్బందిని డ్వామా అధికారులు ఆదేశించారు. అలా గ్రామాల వారీ నీటి బడ్జెట్‌లను సిబ్బంది రూపొందించే పనిని ప్రారంభించారు.

వాటర్‌షెడ్‌ గ్రామాలే ప్రామాణికం

ప్రాథమికంగా ఇప్పటివరకు ఉన్న లెక్కల ద్వారా పరిశీలించి మెట్ట ప్రాంతాల్లోని అత్య ధిక గ్రామాల్లో అవసరమైన నీటిలో కేవలం నాల్గో వంతు మాత్రమే అందుబాటులో ఉంటున్నట్లు అంచనా వేశారు. అందుకు వాటర్‌షెడ్‌ అమలు ఉన్న గ్రామాలను ప్రామాణికంగా తీసుకున్నారు. సగటున ఒక గ్రామం 500 హెక్టార్ల విస్తీర్ణంలో ఉండి వార్షిక సగటు వర్షపాతం 600 మి.మీ అను కుంటే.. ఆ గ్రామంలో ఏడాదికి వర్షం ద్వారా లభించే నీరు 300 హెక్టా మీటర్లుగా గుర్తించారు. అందులో 9శాతం భూగర్భ జలంగా మారుతుంది. మరో పదిశాతం భూమిలో తేమ, 41శాతం ఆవిరి లేదా చెట్లు గ్రహిస్తాయి. మరో 40శాతం మేర వాగులు, వంకలు, కాలువల ద్వారా పారి బయటకు వెళ్లిపోతోంది. ఆ ప్రకారం చూస్తే వర్షం ద్వారా లభించే 300 హెక్టా మీటర్ల నీటిలో కేవలం 32 హెక్టా మీటర్లు మాత్రమే అందుబాటులో ఉంటోంది. మిగిలిన 270 హెక్టా మీటర్లు బయటకు వెళ్లిపోవడం లేదా ఆవిరి, చెట్లు గ్రహించడంతో సరిపోతుంది. అయితే 500 హెక్టార్ల విస్తీర్ణంలో ఉండే గ్రామంలో మనుషులు, పశుసంపద, పంటలు, పండ్ల తోటలు, కూరగాయల సాగు ఇతరత్రా అవసరాలకు సుమారు 121.41 హెక్టామీటర్ల నీరు అవసరమని అంచనా. అలా నీటి లభ్యత 32 హెక్టా మీటర్లు అయితే అవసరం 121.41 హెక్టామీటరుగా ఉంది. అంటే అలాంటి గ్రామాల్లో 89.40హెక్టామీటర్ల కొరత ఉంటూ నిత్యం నీటి కోసం ఇక్కట్లు పడుతున్నారు.

జల సంరక్షణ పనులకు రూపకల్పన

జిల్లాలోని అత్యధిక గ్రామాల్లో తక్కువగానే నీరు ఉంటుండగా కొన్నింటిలో కొంత ఎక్కువ నీటి లభ్యతకు అవకాశం ఉంది. ఆ మేరకు ప్రాథమిక అంచనా వేసి తదనుగుణంగా గ్రామాల వారీ నీటి బడ్జెట్‌ రూపకల్పన చేయాలని డ్వామా ద్వారా నిర్ణయించారు. ప్రధానంగా ఈ బడ్జెట్‌లో ఆ గ్రామంలో మొత్తం విస్తీర్ణం, జనాభా, పశుసంపద, సగటు వర్షపాతం, ఉన్న నీటి వనరులు, వాటిలో నీరు ఎంత నిల్వ ఉండే అవకాశం ఉంటుంది తదితరాలు గుర్తిస్తారు. తదనుగుణంగా కొరతను అంచనా వేస్తారు. అనంతరం దానిని ఆధిగమించేందుకు చేపట్టాల్సిన పనులను గుర్తిస్తారు. ప్రధానంగా చెరువులు, చెక్‌డ్యాంలు, కాలువలు, వాగులలో పూడికతీత, గ్రామంలో ఇళ్ల వద్ద ఇంకుడు గుంతలు, పొలాల్లో పంట కుంటలు, ఏటవాలు ప్రాంతంలో కందకాల తవ్వకం వంటి జలసంరక్షణ పనులను ప్రతిపాదించనున్నారు. వచ్చే ఏడాది కూలీలకు పనులు కల్పించే లేబర్‌ బడ్జెట్‌ ప్రతిపాదనలను నీటి బడ్జెట్‌కు అనుగుణంగా గ్రామాలవారీ నిర్ధిష్టంగా రూపొందించనున్నట్లు డ్వామా పీడీ జోసఫ్‌కుమార్‌ తెలిపారు.

Updated Date - Nov 16 , 2025 | 01:21 AM