పేద కుటుంబాలు ఆర్థికంగా ఎదగాలన్నదే లక్ష్యం
ABN , Publish Date - Mar 12 , 2025 | 11:49 PM
సమాజంలో ఏళ్ల తరబడి పేదరికంతో బాధపడుతున్న కుటుంబాలను ఆదుకోవాలని, వారు ఆర్థికంగా ఉన్నత స్థాయికి ఎదగాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. బుధవారం మండలంలోని ఇసుకదర్శి ఎమ్మెల్యే ఏలూరి క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గంలోని ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను ఎమ్మెల్యే ఏలూరి మాట్లాడి తెలుసుకున్నారు.

ఆ దిశగా సీఎం చంద్రబాబు అడుగులు
ఎమ్మెల్యే ఏలూరి
12 ఎస్సీకుటుంబాలకు సబ్సిడీతో 14 లక్షల రుణాల పంపిణీ
37 మందికి సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల అందజేత
మార్టూరు, మార్చి 12 (ఆంధ్రజ్యోతి) : సమాజంలో ఏళ్ల తరబడి పేదరికంతో బాధపడుతున్న కుటుంబాలను ఆదుకోవాలని, వారు ఆర్థికంగా ఉన్నత స్థాయికి ఎదగాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. బుధవారం మండలంలోని ఇసుకదర్శి ఎమ్మెల్యే ఏలూరి క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గంలోని ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను ఎమ్మెల్యే ఏలూరి మాట్లాడి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని స్వయం సహాయక సంఘంలోని ఎస్సీ కుటుంబాలకు చెందిన 12 మంది మహిళలకు, ఒక్కొక్కరికి రూ.50వేల సబ్సిడీతో, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మంజూరైన రూ.14లక్షల రుణాల చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతున్న 37 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన రూ.26 లక్షల 84వేల594 చెక్కులను బాధితులకు స్వయంగా ఏలూరి అందచేశారు. ఇప్పటికి నియోజకవర్గంలో బాధితులకు రూ.3కోట్ల 26 లక్షలు సీఎం సహాయనిధి నుంచి చెక్కులను పంపిణీ చేసినట్లు చెప్పారు.
ప్రతి గ్రామంలో మోడల్ స్కూల్ ఏర్పాటుచేయాలి
నియోజకవర్గంలో ప్రభుత్వ విద్యాలయాలు ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా పిల్లలకు విద్యను అందించాలని నియోజకవర్గంలోని 6 మండలాలకు చెందిన ఎంఈవోలను ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కోరారు. ఆయన బుధవారం సాయంత్రం అన్ని మండలాలోని ఎంఈవో, ఎంపీడీవోలు, వ్యవసాయశాఖ, ఉద్యాన శాఖకు చెందిన అధికారులతో ప్రత్యేకంగా క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏలూరి మాట్లాడుతూ ప్రతి గ్రామంలో మోడల్ స్కూల్‌ను ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు మొదటి ఎంపిక ప్రభుత్వ పాఠశాల ఉండాలన్న లక్ష్యంతో మంత్రి లోకేష్ పనిచేస్తున్నారని తెలిపారు. 1 వతరగతి నుంచి 5 వతరగతి వరకు ప్రతి గ్రామంలో మోడల్ స్కూల్‌ను ఏర్పాటు చేసే విధంగా టీడీపీ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదన్నారు. అదేవిధంగా వ్యవసాయ అధికారులతో మాట్లాడుతూ రైతులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునే విధంగా వారికి సహకారం అందించాలని, ఆధునిక యంత్ర పరికరాలను సబ్సిడీపై ప్రభుత్వం రైతులకు అందిస్తుందని తెలిపారు. నేరుగా పొలాలు దగ్గరకు వెళ్లాలని, వారు వేసిన పంటలను పరిశీలించాలని, వ్యవసాయం సాగులో వారికి సూచనలు, సలహాలను అందించాలని ఆదేశించారు. అనంతరం ఎంపీడీవలో ఏలూరి మాట్లాడుతూ నియోజకవర్గంలో మహిళలకు ఆర్థికంగా భద్రతను కల్పించే దిశగా ప్రభుత్వం పనిచేస్తున్నదని, వారికి టైలరింగ్‌లో శిక్షణ నిచ్చే కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత వారికి ఉచితంగా కుట్టుమిషన్లను పంపిణీ చేస్తామన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గంలోని పలు శాఖలకు చెందిన అధికారులతోపాటు, స్థానిక నాయకులు నాయుడు హనుమంతరావు, కనపర్తి నాగేశ్వరరావు, మిన్నెకంటి రవికుమార్, కామేపల్లి హరిబాబు, గుదే తారకరామారావు, నల్లపనేని రంగయ్య చౌదరి, పొదవీరయ్య, కంభంపాటి హనుమంతరావు పాల్గొన్నారు.