Share News

తొలిదశ పూర్తే లక్ష్యంగా..!

ABN , Publish Date - Oct 01 , 2025 | 02:18 AM

వెలిగొండ ప్రాజెక్టు తొలి దశ పనులు వచ్చే ఏడాది ఆగస్టుకు పూర్తిచేయాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ ప్రాజెక్టుపై తరచూ సమీక్షలు నిర్వహిస్తున్నారు.

తొలిదశ పూర్తే లక్ష్యంగా..!
వెలిగొండ పెండింగ్‌ పనులు, సాంకేతిక అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్న ఎస్‌ఈ అబూత్‌అలీ

వెలిగొండపై అధికారుల కసరత్తు

మిగిలి ఉన్న పనులపై ఎస్‌ఈ సమీక్ష

రూ.344 కోట్ల పెండింగ్‌ బిల్లులను చెల్లించిన ప్రభుత్వం

ఫీడర్‌ కాలువ ఆధునికీకరణకు తాజాగా రూ.456 కోట్లు మంజూరు

నాలుగు భాగాలుగా రెండో టన్నెల్‌ లైనింగ్‌ పనులు

వెలిగొండ ప్రాజెక్టు తొలి దశ పనులు వచ్చే ఏడాది ఆగస్టుకు పూర్తిచేయాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ ప్రాజెక్టుపై తరచూ సమీక్షలు నిర్వహిస్తున్నారు. అవసరమైన సూచనలు ఇస్తున్నారు. పనులకు సంబంధించి కావాల్సిన నిధుల మంజూరు, అదనపు పనులకు అనుమతులు త్వరితగతిన ఇచ్చేలా చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటి వరకూ చేసిన పనులకు సంబంధించి పెండింగ్‌ ఉన్న బిల్లులలో 90శాతం విడుదల చేశారు. అందులో గత వైసీపీ ప్రభుత్వకాలంలో పెండింగ్‌వి కూడా ఉన్నాయి. ఈ పరిణామాలన్నీ నిర్దేశిత గడువులోపు వెలిగొండ పూర్తిపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచుతున్నాయి.

ఒంగోలు, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వంలో ప్రచార ఆర్భాటం తప్ప ఆచరణలో వెలిగొండ ప్రాజెక్టు పనులు పెద్దగా జరగలేదు. పైగా చేసిన పనులకు కూడా చెల్లింపులు సరిగా చేయలేదు. అలా 2022 నుంచి పలువురు కాంట్రాక్టర్లకు బిల్లులు ఆగిపోయాయి. ప్రస్తుత ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వెలిగొండపై ప్రత్యేక దృష్టి సారించింది. తరుచూ సీఎం చంద్రబాబు సమీక్షలు చేస్తున్నారు. ఈ సందర్భంగా పాత బకాయిల చెల్లింపు, అలాగే కొత్తగా ఫీడర్‌ కాలువ ఆధునికీకరణ పనులకు అనుమతులు అత్యవసరంగా గుర్తించారు. ఈనేపథ్యంలో ఈ రెండు అంశాలపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. పెండింగ్‌ బిల్లులు సుమారు రూ.375 కోట్ల మేర ఉన్నట్లు గుర్తించగా అందులో రూ.344కోట్లను ఇటీవలే ప్రభుత్వం కాంట్రాక్టర్లకు చెల్లించింది. ప్రస్తుత ఏడాది ప్రాజెక్టు పనులకు బడ్జెట్‌లో రూ.390 కోట్లు కేటాయించారు. అప్పట్లో ఆ నిధులు ఎలా సరిపోతాయన్న విమర్శలు వచ్చాయి. పనులు జరిగే కొద్దీ సమకూర్చుతామని నిధులపై బెంగపడాల్సిన అవసరం లేదన్న సమాధానం ప్రభుత్వ పెద్దల నుంచి వచ్చింది. తదనుగుణంగానే వ్యవహరిస్తూ నాటి వైసీపీ కాలం నుంచి ఉన్న బకాయిలను కూడా పరిశీ లించి చెల్లించారు. ఇక చేసిన పనులకు సంబంధిం చి కేవలం రూ.30కోట్ల లోపు మాత్రమే బకాయిలు ఉన్నట్లు అధికారవర్గాల సమాచారం.

ఫీడర్‌ కెనాల్‌కు సిమెంట్‌ లైనింగ్‌

మరోవైపు ప్రాజెక్టు తొలిదశ పూర్తయి డ్యాంలోకి నీరు నింపాలంటే ఫీడర్‌ కాలువ ఆధునికీకరణ అత్యవసరమని అధికారులు నివేదించారు. టన్నెల్‌ నుంచి నీరు బయటకు వచ్చే దోర్నాల మండలం కొత్తూరు ప్రాంతం నుంచి 21.80 కి.మీ దూరం ఫీడర్‌ కాలువ ద్వారా నీరు ప్రవహించి డ్యాంలోకి చేరుతుంది. ఆ కాలువను జలయజ్ఞంలో భాగంగా 15 ఏళ్ల క్రితం తవ్వారు. అందుకు సుమారు రూ.105 కోట్ల మేర వెచ్చించారు. ప్రస్తుతం ఆ కాలువల నీరు సజావుగా ప్రవహించే పరిస్థితి లేదు. దీంతో మొత్తం కాలువకు సిమెంట్‌ లైనింగ్‌తోపాటు మూడుచోట్ల సుమారు 5.6 కి.మీ మేర కాంక్రీటు గోడల నిర్మాణం అవసరంగా నిపుణులు సూచించారు. అందుకోసం రూ.456 కోట్లు అవసరమని అధికారులు నివేదించగా ఐదు రోజుల క్రితం ఆ పనులను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో తక్షణం టెండర్లు పిలిచేలా ఉన్నత స్థాయిలో అధికారులు చర్యలు చేపట్టారు. రెండు రోజుల్లోనే టెండర్లు పిలువనున్నట్లు తెలుస్తోంది.

అధికారులతో ఎస్‌ఈ సమీక్ష

తాజా పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వ ప్రాధాన్యతకు అనుగుణంగా పెండింగ్‌ పనులను సకాలంలో పూర్తిచేసే వైపు ప్రాజెక్టు అధికారులు దృష్టి సారించారు. ఇందుకు సంబంధించి ప్రాజెక్టు ఎస్‌ఈ అబుత్‌అలీం మంగళవారం ఒంగోలులోని తన కార్యాలయంలో వివిధ స్థాయి ఇంజనీరింగ్‌ అధికారులతో భేటీ అయ్యారు. పెండింగ్‌ పనులు, వాటికి సంబంధించి సాంకేతికంగా ఎదురవుతున్న సమస్యలు, పరిష్కారం, ఏ పనులు ఎప్పటికి పూర్తి చేయాలన్న దానిపై సమీక్షించారు. ప్రస్తుతం కీలకమైన రెండో టన్నెల్‌లో పెండింగ్‌ ఉన్న లైనింగ్‌ పనులు జరుగుతున్నాయి. టన్నెల్‌ తవ్వకం మిషన్‌ ద్వారా చేసే సమయంలో లైనింగ్‌ కూడా ఒకేసారి సిమెంట్‌ కాంక్రీట్‌ సెగ్మెంట్లకు అమర్చేవారు. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో అందుకు భిన్నంగా తవ్వకాలు చేపట్టడం వల్ల లైనింగ్‌ చేయలేదు. ప్రస్తుతం గ్యాంట్రీ విధానంలో పెద్దపెద్ద గడ్డర్ల సాయంతో కాంక్రీట్‌ లైనింగ్‌ చేస్తున్నారు. మొత్తం 18.8 కి.మీ ఉండే టన్నెల్‌లో 4.50 కి.మీ అలా చేయాల్సి ఉండగా త్వరితగతిన పూర్తి కోసం నాలుగు భాగాలుగా లైనింగ్‌ పనులు నిర్ణయించారు. అలాగే ఫీడర్‌ కాలువ, తూర్పు ప్రధాన కాలువ హెడ్‌ రెగ్యులేటరీ, తీగలేరు కాలువకు షట్టర్ల ఏర్పాటు, అర్ధవీడు మండలంలో ప్రత్యామ్నాయ రోడ్డు నిర్మాణం వంటి కీలక పనులపైనా సమీక్ష నిర్వహించి తగు సూచనలు చేశారు. మొత్తం మీద వెలిగొండ తొలిదశకు నిర్ధిష్ట గడువు పెట్టి నిధుల కల్పనకు సీఎం భరోసా ఇవ్వడం, ఫీడర్‌ కాలువ పనులుకు నిధుల మంజూరు నేపథ్యంలో పనులు వేగవంతం సాగే దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

Updated Date - Oct 01 , 2025 | 02:34 AM