దేవాలయాల అభివృద్ధే ధ్యేయం
ABN , Publish Date - May 13 , 2025 | 12:08 AM
రాష్ట్ర ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధికి కట్టుబడి ఉందని, అందుకోసం రూ.100 కోట్లు కేటాయించామని దేవదాయ శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు.
ఆలయాల నిర్మాణం, పునరుద్ధరణకు రూ.100 కోట్లు
అర్చకులు, నాయీబ్రాహ్మణులకు ఇచ్చిన హామీ మేరకు జీతం పెంపు అమలు
గత నెల నుంచి వేదపండితులకు సంభావన కింద రూ.3 వేలు
దూపదీపనైవేద్యాలకు రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంపు
దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి
ఒంగోలులో ఆ శాఖ నూతన కార్యాలయం ప్రారంభం
ఒంగోలు కల్చరల్, మే 12 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధికి కట్టుబడి ఉందని, అందుకోసం రూ.100 కోట్లు కేటాయించామని దేవదాయ శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. ఒంగోలులోని రంగారాయుడు చెరువు దగ్గర కోటి రూపాయలతో నిర్మించిన దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, జిల్లాకు చెందిన శాసనసభ్యులు, అధికారులు పాల్గొనగా వారికి వేదపండితుల పూర్ణకుంభతో స్వాగతం పలికారు. అనంతరం మంత్రి ఆనం మాట్లాడుతూ ప్రతి జిల్లాలో దేవదాయ శాఖకు స్వంత కార్యాలయం ఏర్పాటు చేయాలనేది సీఎం చంద్రబాబు నిర్ణయమని, ఇందుకు అనుగుణంగా ఇటీవల నెల్లూరులో సైతం కార్యాలయాన్ని ప్రారంభించామని తెలిపారు. తమ కూటమి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు గత ప్రభుత్వంలో రూ.5 వేలుగా ఉన్న ధూపదీప నైవేద్యాల మొత్తాన్ని రూ.10 వేలకు పెంచి దాదాపు 5600 దేవాలయాలకు అందిస్తున్నామన్నారు. మరో 300 ఆలయాల ప్రతిపాదనలు ఉన్నాయని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సీజీఎఫ్ పథకం కింద ఆలయాల పునరుద్ధరణ కోసం నిధులు మంజూరు ప్రక్రియ కూడా కొనసాగుతోందని మంత్రి చెప్పారు. ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు వేదపండితుల సంభావన కింద ఒక్కొక్కరికీ రూ. 3 వేలు ఇచ్చే ప్రక్రియ గత నెలలో ప్రారంభించామన్నారు. ఆలయాలలో పనిచేసే అర్చకులకు రూ.15 వేలు, నాయీ బ్రాహ్మణులకు రూ.20 వేలు ఇచ్చేందుకు ఇప్పటికే మార్గదర్శకాలు విడుదల చేశామని, రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాలలో నిత్యాన్నదాన కార్యక్రమం ప్రారంభించాలని సీఎం ఆదేశించారని చెప్పారు. ఆలయంలో జరిగే స్వామి ప్రతి కార్యక్రమం ఆగమపండితుల నిర్ణయం ప్రకారమే జరుగుతుందని, దేవదాయ శాఖ అధికారుల జోక్యం ఉండబోదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, ముత్తుముల అశోక్‌రెడ్డి, కందుల నారాయణరెడ్డి, డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, బి.ఎన్.విజయ్‌కుమార్, మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ, కలెక్టర్ అన్సారియా, మేయర్ సుజాత, జేసీ గోపాలకృష్ణ పాల్గొన్నారు.