Share News

సమగ్రాభివృద్ధే లక్ష్యం

ABN , Publish Date - May 24 , 2025 | 01:32 AM

జిల్లా ప్రగతి, విభిన్నవర్గాల ప్రజల సమగ్రాభివృద్ధే లక్ష్యమని మంత్రులు, ముఖ్య నేతలు ప్రకటించారు. అందుకు ఉపకరించే పలు కీలక అంశాలపై శుక్రవారం ఒంగోలులో జరిగిన టీడీపీ జిల్లా మహానాడులో చర్చించారు.

సమగ్రాభివృద్ధే లక్ష్యం
టీడీపీ జిల్లా మహానాడులో మాట్లాడుతున్న ఇన్‌చార్జి మంత్రి ఆనం, వేదికపై ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు, ఇతర ప్రతినిధులు

వెలిగొండ పూర్తి-మార్కాపురం జిల్లా-డెయిరీ పునరుద్ధరణ

పలు కీలక అంశాలపై టీడీపీ జిల్లా మహానాడులో తీర్మానాలు

నియోజకవర్గ మినీ మహానాడుల్లో చేసిన అంశాలకు ఆమోదం

అభివృద్ధి, సంక్షేమం, ఇతర సమస్యలను ప్రస్తావించిన ప్రజాప్రతినిధులు

పాల్గొన్న మంత్రులు ఆనం, స్వామి, ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలు

ప్రతినిధుల హాజరు పేలవం, కార్యకర్తలు హుషారుగా ఉండాలని నేతల విజ్ఞప్తి

జిల్లా ప్రగతి, విభిన్నవర్గాల ప్రజల సమగ్రాభివృద్ధే లక్ష్యమని మంత్రులు, ముఖ్య నేతలు ప్రకటించారు. అందుకు ఉపకరించే పలు కీలక అంశాలపై శుక్రవారం ఒంగోలులో జరిగిన టీడీపీ జిల్లా మహానాడులో చర్చించారు. దాదాపు 35కుపైగా వివిధ అంశాలపై తీర్మానాలు చేశారు. వాటిలో ప్రజల్లో విస్తృత చర్చ నడుస్తున్న వెలిగొండ ప్రాజెక్టు పూర్తి, మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు, గత వైసీపీ ప్రభుత్వంలో సమాధి కట్టిన ఒంగోలు డెయిరీ పునరుద్ధరణ వంటి ప్రధానమైనవి ఉన్నాయి.

ఒంగోలు, మే 23 (ఆంధ్రజ్యోతి): సంస్థాగత నిర్మాణంలో భాగంగా టీడీపీ నిర్వహిస్తున్న మినీ మహానాడుల్లో భాగంగా జిల్లాస్థాయి సమావేశం శుక్రవారం సాయంత్రం ఒంగోలు నగరపరిధిలోని బృందావనం కల్యాణ మండపంలో జరిగింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఏపీ టూరిజం కార్పొరేషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ నూకసాని బాలాజీ అధ్యక్షత వహించారు. ఇన్‌చార్జి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. జిల్లాకు చెందిన మంత్రి డాక్టర్‌ డీఎస్‌బీవీ స్వామి, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్‌, బీఎన్‌.విజయకుమార్‌, ఉగ్రనరసింహారెడ్డి, ముత్తుముల అశోక్‌రెడ్డి, కందుల నారాయణరెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జిలు ఎరిక్షన్‌బాబు, డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మితోపాటు పలువురు ముఖ్యనాయకులు హాజరయ్యారు. ఇప్పటికే జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల స్థాయిలో మినీ మహానాడులు పూర్తికాగా వాటిలో ఆయా నియోజకవర్గాల పరిధిలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, ప్రజల సమస్యలు, వాటి పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి తీర్మానాలు చేశారు. వాటిని జిల్లా మహానాడులో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలు తమ ప్రసంగంలో ప్రతినిధుల దృష్టికి తీసుకురాగా ఆమోదముద్ర వేశారు. పశ్చిమ ప్రాంత ప్రజాప్రతినిధులు ముక్తకంఠంతో తమ ప్రాంత ప్రజల తరఫున వెలిగొండ ప్రాజెక్టు పూర్తిద్వారా పశ్చిమ ప్రాంతానికి సాగు, తాగునీరు అందించాలని, మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయడం ద్వారా ఆ ప్రాంత అభివృద్ధికి, సౌకర్యాలవ ెురుగుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం ఇప్పటికే ఆ దిశగా వేస్తున్న అడుగులను ప్రస్తావిస్తూ త్వరితగతిన చేయాలని కోరుతూ ఎమ్మెల్యేలు అశోక్‌రెడ్డి, నారాయణరెడ్డి, వైపాలెం ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబులు తీర్మానాలను ప్రవేశపెట్టగా మహానాడులో ఆమోదించారు.

డెయిరీ పునరుద్ధరణ కీలకం

జిల్లాలోని రైతులు, పాడి పరిశ్రమకు ఊతం ఇచ్చే ఒంగోలు డెయిరీ పునరుద్ధరించడంతోపాటు రామతీర్థం ప్రాజెక్టు సామర్థ్యం పెంపుపై సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్‌.విజయకుమార్‌ తీర్మానం ప్రవేశపెట్టగా ఆమోదించారు. కనిగిరి ప్రాంతంతోపాటు జిల్లావ్యాప్తంగా ఉన్న భూసమస్యల పరిష్కారానికి సంబంధించి అగ్రిమెంట్‌ ద్వారా భూములు కొనుగోలు చేసిన రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వాలని. ఇతర పలు అంశాలపై ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి మహానాడు దృష్టికి చెచ్చారు. ఒంగోలులో భూగర్భ డ్రైనేజీ, పోతురాజు కాలువ ఆధునికీకరణ, ఎయిర్‌పోర్టు, ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణాలపై ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ మాట్లాడారు. దొనకొండలో పారిశ్రామిక కారిడార్‌ ఏర్పాటు, డ్రైవింగ్‌ స్కూలు నిర్మాణం పూర్తి అంశాలపై టీడీపీ దర్శి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మీ ప్రవేశపెట్టిన తీర్మానాలను సమావేశం ఆమోదించింది. ఆయా నియోజకవర్గాల పరిధిలోని పలు కీలక అంశాలపై తీర్మానాలు చేశారు. సభలో మంత్రులు ఆనం, డాక్టర్‌ స్వామిలు మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షసపాలనను అంతం చేసి చంద్రబాబునాయుడు నేతృత్వంలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కార్యకర్తలను కోరారు. జిల్లా అభివృద్ధికి కీలకమైన వెలిగొండ ప్రాజెక్టు, మార్కాపురం జిల్లా ఏర్పాటు, పారిశ్రామిక అభివృద్ధి, రోడ్లు, తాగునీరు ఇతర మౌలికరంగాల అభివృద్ధికి ప్రణాళికాబద్ధ కృషి ప్రభుత్వపరంగా జరుగుతున్నదన్నారు.

ప్రతినిధుల హాజరు పేలవం

టీడీపీ జిల్లా మహానాడుకు ప్రతినిధుల హాజరు పేలవంగా కనిపించింది. పార్టీ ఆదేశాల మేరకు జిల్లా నుంచి రాష్ట్రస్థాయి వరకు సుమారు మూడువేల మందికిపైగా ప్రతినిధులు హాజరుకావాలి. అయితే అందులో నాల్గోవంతు కూడా రాలేదు. సమయపాలన పాటించలేదు. మధ్యాహ్నం మూడు గంటలకు అని చెప్పి ఆరు గంటలకు అతిఽథులు రావడంతో అప్పటికి వచ్చిన పార్టీశ్రేణులు కార్యక్రమం ప్రారంభమైన అర్ధగంటకే వెళ్లిపోవడం ప్రారంభించారు. చివరకు ఏడున్నర ప్రాంతంలో సభాప్రాంగణంలోని కుర్చీలలో మూడింట రెండొంతులు మాత్రమే ఉన్నారు. అంతేకాక ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోపే మహానాడు నిర్వహించగా ఆ జోష్‌ కార్యకర్తల్లో కనిపించలేదు. కనిగిరి ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి తన ప్రసంగంలో కార్యకర్తలు హాజరుకాకపోవడం, జోష్‌ కనిపించకపోవడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కార్యకర్తల కష్టంతో తాము అసెంబ్లీకి వెళ్లామంటూ వారిని ఉత్సాహపరిచే లా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ మాట్లాడే ప్రయత్నం చేశారు. ఎంపీ మాగుంట ఢిల్లీలో మీటింగ్‌తో హాజరుకాకపోగా మంత్రి డాక్టర్‌ స్వామి, ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి కార్యక్రమా లకు దూరప్రాంతాలకు వెళ్లాల్సి ఉండటంతో తొలిగానే ప్రసంగించి వెళ్లిపోయారు.

Updated Date - May 24 , 2025 | 01:32 AM