Share News

కమ్మ వారి పల్లెలో గరళకంఠులు

ABN , Publish Date - Aug 05 , 2025 | 11:57 PM

కనిగిరి మండలంలోని దిరిశవంచ పంచాయతీ పరిధిలో 250 గృహాలు ఉన్నాయి. వాటిలో కమ్మవారిపల్లి గ్రామంలో 115 గృహాలు ఉండగా 546 మంది జీవిస్తున్నారు. వీరు కొన్ని దశాబ్దాలుగా ఫ్లోరోసిస్‌ సమస్యతో బాధపడుతున్నారు.

కమ్మ వారి  పల్లెలో గరళకంఠులు
కమ్మవారిపల్లి ఎస్సీ కాలనీ, పట్టుకుంటే లేవలేని స్థితిలో ఉన్న దానయ్య

దశాబ్దాలుగా ఫ్లోరైడ్‌ నీటినే సేవిస్తున్న దళితులు, గిరిజనులు

జనం గోడు పట్టని పాలకులు

ఫ్లోరైడ్‌ రక్కసి కాటుతో సగం జీవితానికే నేల చూపులు

అరకొర పరిష్కార మార్గాలకే పరిమితమైన గత వైసీపీ పాలకులు

పరాయి ప్రాంతాలకు వలసలు పోతున్న గ్రామస్థులు

ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్ర చొరవతో సమస్యకు పరిష్కార మార్గం

డిప్యూటి సీఎం పవన్‌కళ్యాణ్‌ ద్వారా నిధుల అభ్యర్థన

ఇటీవల రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణనీటిసరఫరా శాఖ అధికారుల పర్యటన

వారి పర్యటనతో మంచి రోజులొస్తున్నాయని ప్రజల్లో చిగురించిన ఆశలు

కనిగిరి, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి) : కనిగిరి మండలంలోని దిరిశవంచ పంచాయతీ పరిధిలో 250 గృహాలు ఉన్నాయి. వాటిలో కమ్మవారిపల్లి గ్రామంలో 115 గృహాలు ఉండగా 546 మంది జీవిస్తున్నారు. వీరు కొన్ని దశాబ్దాలుగా ఫ్లోరోసిస్‌ సమస్యతో బాధపడుతున్నారు. గారపట్టిన పళ్లు, వంకర్లు పోయిన కాళ్లూ, చేతులు. వెన్నెముక సమస్యలు.. కిడ్నీ వ్యాధులు.. అనేక రుగ్మతలలో అల్లాడుతున్నారు. ముఖ్యంగా కమ్మవారిపల్లి ఎస్సీ కాలనీ, పునుగోడు గ్రామ ఎస్టీ కాలనీ ప్రజలు ఫ్లోరైడ్‌ బారినపడి ఇంటికొకరు మంచానికే పరిమితమై కాలం వెళ్లదీస్తున్నారు. గతంలో పాలకులు తీసుకున్న అరకొర చర్యలు మినహా సమస్య శాశ్వత పరిష్కారం దిశగా అడుగులేసింది లేదు. దీంతో చాలామంది పరాయి ప్రాంతాలకు వలస వెళ్లి వివిధ పనులు చేసుకుని జీవిస్తున్నారు. కొంతమంది మాత్రం పుట్టిన గ్రామాన్ని వదిలి వెళ్లలేక ఫ్లోరైడ్‌తోనే సహవాసం చేస్తూ బతుకు లీడుస్తున్నారు. ఇటీవల అక్కడ పర్యటించిన ప్రత్యేక బృందం అక్కడి నీటిని పరీక్షించగా 6.5శాతం ఫ్లోరైడ్‌ శాతం ఉండటం మరింత ఆందోళనకు గురి చేస్తోంది.

బోరు నీటినే తాగుతున్న దళిత కుటుంబాలు

కమ్మవారిపల్లిలో ఉన్న దళిత కాలనీలో పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. గ్రామంలో ఉన్న నీటి ట్యాంకు దూరంగా ఉండటంతో అక్కడికి వెళ్లి తెచ్చుకోవడం ఇబ్బందిగా మారింది. గత టీడీపీ ప్రభుత్వంలో ట్యాంకును ఏర్పాటు చేసి ప్రత్యేక మోటార్‌ ద్వారా ఎస్సీ కాలనీకి నీటిని సరఫరా చేసేవారు. ప్రస్తుతం అది చెడిపోయి ట్యాంకు శిథిలావస్థకు చేరి నిరుపయోగంగా మారింది. దీంతో కాలనీ ప్రజలకు మంచి నీటి ఇక్కట్లు మరింత పెరిగాయి. దీంతో బోరు నీరే దిక్కయ్యింది. ప్రస్తుతం కాలనీలో ఉన్న పంచాయతీ చేతి పంపుల్లో కొన్ని మొరాయించాయి. గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో పట్టించుకున్న నాథుడు కరువయ్యాడు. అసలే మోకాళ్ల నొప్పులు, బరువు మోయలేని స్థితిలో ఉన్న కాలనీవాసులకు ఊళ్లోకి వెళ్లి నీరు తెచ్చుకోవాలంటే ఇబ్బందిగా మారింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో బోరు నీటిని తాగుతున్నారు. దీంతో ఫ్లోరైడ్‌ రక్కసి కోరల్లో చిక్కి వారి జీవనం దుర్భరంగా మారింది. దీంతో కాలనీలో నివసించే పెద్దలతోపాటు చిన్నపిల్లలు కూడా ఫ్లోరోసిస్‌ బారినపడుతున్నారు.

రోజుకు 2వేల లీటర్ల తాగునీరు అవసరం

కమ్మవారిపల్లెలో నివసించే ప్రజలకు రోజుకు సగటున 2.5వేల లీటర్లు తాగునీరు అవసరం. కానీ గ్రామంలోని ట్యాంకుకు 5 రోజులకోసారి నీటిని సరఫరా చేస్తున్నారు. సగటును ఒక్కో మనిషికి రోజుకు 40లీటర్లు మంచినీరు అవసరం ఉంటుంది. అంటే రోజుకు ఆ గ్రామంలో నివసించే ప్రజలకు 2వేల లీటర్లకుపైగా కావాలి. ఐదురోజులకు ఒకసారి సరఫరా చేస్తున్న నీరు ఆ గ్రామ ప్రజలకు ఏమాత్రం సరిపోవడం లేదు. వాటర్‌ ప్లాంట్ల నుంచి బబుల్‌ రూ.15 చెల్లించి కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్కో కుటుంబానికి రెండు బబుల్స్‌ అవరమవుతాయి. అందుకోసం రోజుకు రూ.30 ఖర్చు చేయాల్సి వస్తోంది.

పునుగోడు ఎస్టీకాలనీ వాసుల పరిస్థితి దయనీయం

మండలంలోని పునుగోడు గ్రామంలోని ఎస్టీకాలనీ అంటే ఓ వైపు విసిరేసినట్లుగా కొండ దిగువనే ఉంటుంది. 40ఏళ్ల క్రితం కొన్ని కుటుంబాల వారు కొండలో కట్టెలు కొట్టుకుని అక్కడ దిగువనే గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తూ వచ్చారు. ఆ కాలనీలో 63 గృహాలు ఉండగా, 256 మంది జీవిస్తున్నారు. వారిలో చిన్నపిల్లలు 40మందికి పైగా ఉన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో మంచినీటి సరఫరాకు చర్యలు చేపట్టారు. ఎస్టీ కాలనీలో ఓవర్‌హెడ్‌ ట్యాంకును నిర్మించారు. అప్పటి నుంచి సాగర్‌ నీటిని సరఫరా చేస్తున్నారు. కానీ వారం, పది రోజులకు కూడా ఆ ట్యాంకుకు నీరు రావడం లేదని ఎస్టీ కాలనీ వాసులు చెప్తున్నారు. దీంతో వంటకు, వాడకానికి బోరు నీటినే వినియోగించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఈ కాలనీలో కొంతమంది ఫ్లోరైడ్‌ బారినపడి కాళ్లు వంకర్లు తిరగడం, మోకాళ్లు ఒంగిపోవటం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఇటీవల ఆ ప్రాంతంలో పర్యటించిన బృందం నీటి నమూనాలు సేకరించి ఫ్లోరైడ్‌ శాతం పరీక్షించగా 2.6 శాతం ఉన్నట్లు తేలింది.


ఫ్లోరైడ్‌ నుంచి విముక్తికి ఉగ్ర చర్యలు

ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి 2024 ఎన్నికలకు ముందు మండలంలోని కమ్మవారిపల్లి, పునుగోడు ఎస్టీకాలనీల్లో పర్యటించారు. ఆ సమయంలో ఫ్లోరైడ్‌తో బాధపడుతున్న కుటుంబాల దయనీయస్థితిని గమనించారు. చలించిపోయిన ఆయన మంచినీటి సరఫరా చేసేలా కృషి చేస్తానని వాగ్దానం చేశారు. ఇటీవల మార్కాపురం వచ్చిన డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు కనిగిరి ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఫ్లోరైడ్‌ సమస్యను వివరించి ప్రత్యేక నిఽధులు మంజూరు చేయాలని కోరారు. పవన్‌ కల్యాణ్‌ ఇచ్చిన హామీ మేరకు అమరావతి నుంచి రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణ నీటి సరఫరా శాఖల నుంచి ప్రత్యేక బృందం ఇటీవల కమ్మవారిపల్లి, పునుగోడు గ్రామాల్లో పర్యటించింది. నీటి నమూనాలు సేకరించి అందులో ఫ్లోరైడ్‌ శాతాన్ని గుర్తించాయి. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబును కూడ ఇటీవల ఎమ్మెల్యే ఉగ్ర కలిసి ఫ్లోరైడ్‌ సమస్యను వివరించారు. సానుకూలంగా స్పందించిన సీఎం ఫ్లోరైడ్‌ సమస్య పరిష్కారానికి తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. దీంతో కనిగిరి ప్రాంతంతోపాటు కమ్మవారిపల్లి, పునుగోడు కాలనీ వాసులకు ఫ్లోరైడ్‌ నుంచి విముక్తి కలుగుతుందని ప్రజలు ఆశిస్తున్నారు.

Updated Date - Aug 05 , 2025 | 11:57 PM